ఎల్‌ఐసీ.. షేర్ల అలాట్‌మెంట్‌పై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం

Supreme Court refused To Give Stay On LIC IPO Share Allotment Process - Sakshi

న్యూఢిల్లీ: పాలసీదారులకు మధ్యంతర ఆర్థిక ప్రయోజనాన్ని అందించాలని, జీవిత బీమా కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ) ఐపీఓ షేర్ల అలాట్‌మెంట్‌పై స్టే ఇవ్వాలని కొందరు పిటిషనర్లు చేసిన వాదనలను సుప్రీంకోర్టు గురువారం తోసిపుచ్చింది. వాణిజ్య పెట్టుబడులు, ఐపీఓ విషయాలలో ఏటువంటి మధ్యంతర ఉపశమనం ఇవ్వలేమని న్యాయమూర్తులు డీవై చంద్రచూడ్, సూర్యకాంత్, పీఎస్‌ నరసింహలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.

 ఈ కేసులో తొలుత పిటిషనర్‌ పాలసీహోల్డర్ల తరఫు సీనియర్‌ అడ్వకేట్‌ ఇందిరా జైసింగ్‌ తన వాదనలు వినిపిస్తూ, ఎల్‌ఐసీ చట్ట సవరణ అమలు పక్రియ మొత్తం ఫైనాన్స్‌ యాక్ట్‌– మనీ బిల్‌ అనే ప్రాతిపదికన జరిగిందని తెలిపారు. ఈ అంశాన్ని  2020లో విస్తృత ధర్మాసనానికి నివేదించడం జరిగిందని తెలిపారు. ఎల్‌ఐసీ చట్టం, 1956లోని సెక్షన్‌ 28కి సవరణ ఫలితంగా ‘పరస్పర ప్రయోజన సొసైటీ తరహాలో ఉన్న ఎల్‌ఐసీ సహజ లక్షణం’  జాయింట్‌–స్టాక్‌ కంపెనీగా మారిందని అన్నారు. అంతకుముందు సంస్థలో 95 శాతం మిగులు పాలసీదారులకు వెళ్లగా, ఎల్‌ఐసీకి ట్రస్టీగా ఉన్న కేంద్ర ప్రభుత్వం ఐదు శాతాన్ని తన వద్దే ఉంచుకుందని జైసింగ్‌ చెప్పారు. 

ఈ ప్రాతిపదికన తాజా ఐపీఓ వల్ల పాలసీదారుల ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని ఆమె వాదించారు. అంతకుముందు 95 శాతం మిగులు పాలసీదారులకు వెళ్లగా, ఐదు శాతం ఎల్‌ఐసీకి ట్రస్టీగా ఉన్న కేంద్ర ప్రభుత్వం తన వద్దే ఉంచుకుందని జైసింగ్‌ చెప్పారు. ఎల్‌ఐసీ చట్టంలోని నిబంధనలకు ఫైనాన్స్‌ యాక్ట్, 2021 ద్వారా తీసుకువచ్చిన సవరణ ద్వారా ఐపీఓలో పాల్గొనే పాలసీదారుల అర్హత మార్చడం జరిగిందని పేర్కొన్న ఆమె, ఇది రాజ్యాంగ నిబంధనల కిందకు వస్తుందని తెలిపారు. అయితే ఈ వాదనలను తోసిపుచ్చిన ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది.   

చదవండి: ఎల్‌ఐసీ పబ్లిక్‌ ఇష్యూ షురూ..పాలసీదారులకు, రిటైల్‌ ఇన్వెస్టర్లకు బంపరాఫర్‌..!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top