అమెరికా ప్యాకేజీ జోష్‌..!

Stock markets scale new heights on US stimulus dose And Brexit deal - Sakshi

బ్రెగ్జిట్‌ డీల్‌ సానుకూల సంకేతాలు 

కొనసాగిన రికార్డుల పర్వం

సూచీలకు నాలుగోరోజూ లాభాలే 

సెన్సెక్స్‌ లాభం 380 పాయింట్లు 

13,873 వద్ద నిఫ్టీ ముగింపు

ముంబై: అమెరికా ఉద్దీపన ప్యాకేజీకి ఆమోదం లభించడంతో సోమవారం మార్కెట్‌ లాభాలతో ముగిసింది. బ్రెగ్జిట్‌ చర్చల విజయవంతం నుంచి కూడా సానుకూల సంకేతాలు అందాయి. ఫలితంగా సెన్సెక్స్‌ 380 పాయింట్ల లాభంతో 47,354 వద్ద ముగిసింది. నిఫ్టీ 124 పాయింట్లు పెరిగి 13,873 వద్ద నిలిచింది. సూచీలకిది నాలుగోరోజూ లాభాల ముగింపు కావడం విశేషం. ఒక్క ఫార్మా తప్ప మిగిలిన అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. అత్యధికంగా మెటల్‌ షేర్లు లాభపడ్డాయి. ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే మద్దతు ఇవ్వడంతో ఒక సెన్సెక్స్‌ 433 పాయింట్లు లాభపడి 47,407 వద్ద, నిఫ్టీ 136 పాయింట్లు పెరిగి 13,885 వద్ద కొత్త జీవితకాల గరిష్టాలను అందుకున్నాయి.

కరోనా వైరస్‌తో చిన్నాభిన్నమైన దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు అమెరికా ప్రతినిధుల సభ గతవారం 2.3 ట్రిలియన్‌ డాలర్ల బిల్లును ఆమోదించి.. సంతకం కోసం అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వద్దకు పంపింది. ముందు బిల్లు ఆమోదానికి ట్రంప్‌ నిరాకరించారు. అయితే అన్ని వైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో ఆదివారం రాత్రి 2.3 ట్రిలియన్‌ డాలర్ల బిల్లుపై సంతకం చేశారు. మరోవైపు ఐరోపా సమాఖ్య(ఈయూ)–బ్రిటన్‌ల మధ్య ఎట్టకేలకు కీలక వాణిజ్య ఒప్పందం పూర్తవడంతో ఈక్విటీ మార్కెట్లకు సానుకూలంగా మారింది. ఆసియా, ఐరోపా మార్కెట్లు లాభాలతో ముగిశాయి. ఇక దేశీయంగా పరిణామాలను పరిశీలిస్తే ... కోవిడ్‌–19 వ్యాక్సిన్‌ పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు కేంద్రం నాలుగు రాష్ట్రాల్లో ట్రయల్‌ డ్రై–రన్‌ను మొదలుపెట్టడం ఇన్వెస్టర్లకు ఉత్సాహాన్నిచ్చింది. ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ 6 పైసలు బలపడి 73.49 వద్ద స్థిరపడింది.

రూ.11వేల కోట్లను తాకిన టీసీఎస్‌ మార్కెట్‌ క్యాప్‌...  
దేశీయ ఐటీ సేవల సంస్థ టీసీఎస్‌ కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ ఇంట్రాడేలో రూ.11 వేల కోట్లను తాకింది. రిలయన్స్‌ తర్వాత ఈ ఘనతను సాధించిన రెండో దేశీయ కంపెనీగా టీసీఎస్‌ రికార్డుకెక్కింది. డాయిష్‌ బ్యాంక్‌ నుంచి పోస్ట్‌బ్యాంక్‌ సిస్టమ్‌ను చేజిక్కించుకోవడంతో పాటు ఈ డిసెంబర్‌ 18న ప్రారంభించిన రూ.16 వేల కోట్ల బైబ్యాక్‌ ఇష్యూతో  టీసీఎస్‌ షేరుకు కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. ఈ క్రమంలోనే సోమవారం ట్రేడింగ్‌లో ఈ షేరు 1% పైగా లాభపడి రూ.2949.70 వద్ద జీవితకాల గరిష్టాన్ని తాకింది.

4 రోజుల్లో  8.22 లక్షల కోట్లు!
సూచీల నాలుగురోజుల ర్యాలీతో రూ.8.22 లక్షల కోట్ల సంపద ఇన్వెస్టర్ల సొంతమైంది. ఇన్వెస్టర్ల సంపద భావించే బీఎస్‌ఈ మార్కెట్‌ క్యాప్‌ రూ.187 లక్షల కోట్లకు చేరుకుంది. జాతీయ, అంతర్జాతీయ సానుకూల పరిణామాలతో ఈ నాలుగు రోజుల ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 1,800 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 742 పాయింట్లను ఆర్జించింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top