
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే మంగళవారం స్థిరంగా కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:39 సమయానికి నిఫ్టీ(Nifty) 15 పాయింట్లు పెరిగి 24,956కు చేరింది. సెన్సెక్స్(Sensex) 38 ప్లాయింట్లు ఎగబాకి 82,085 వద్ద ట్రేడవుతోంది.
అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 100.38 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 65.53 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.44 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో గతంతో పోలిస్తే స్వల్ప లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్‌తో పోలిస్తే 0.09 శాతం లాభపడింది. నాస్‌డాక్ 0.02 శాతం ఎగబాకింది.
2025లో అడపాదడపా వస్తున్న పబ్లిక్ ఇష్యూలు ఇకపై జోరందుకోనున్నాయి. ఈ నెలాఖరులోగా ఆరు కంపెనీలు స్టాక్ మార్కెట్ తలుపుతట్టనున్నాయి. మొత్తం మీద వచ్చే పది రోజుల్లో రూ.11,669 కోట్లు సమీకరించేందుకు రంగం సిద్ధమైంది. టెక్స్‌టైల్ కంపెనీ బొరానా వీవ్స్ నేడు (20న) ప్రారంభమై 22న ముగుస్తుంది. ఇక పుణేకు చెందిన ఆటోమొబైల్ విడిభాగాల తయారీ సంస్థ బెల్‌రైజ్ ఇండస్ట్రీస్ ఇష్యూ 21న ఆరంభమై 23న క్లోజవుతుంది. మిగిలిన నాలుగు కంపెనీలు వచ్చే వారంలో పబ్లిక్ ఆఫర్ చేపట్టనున్నాయి. లీలా ప్యాలెస్ హోటల్స్ అండ్ రిసార్ట్స్‌కు చెందిన స్లోస్ బెంగళూరు లిమిటెడ్, ఏజిస్ వోప్యాక్ టెర్మినల్స్, అరిస్‌ఇన్‌ఫ్రా సొల్యూషన్స్, స్కోడా ట్యూబ్స్ ఈ జాబితాలో ఉన్నాయి. ఈ వారంలోనే ఈ నాలుగూ ప్రైస్ బ్యాండ్‌లను ప్రకటించనున్నాయి.




(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)