Stock Market: ఆరో రోజూ అదే సీన్‌.. ఆఖరి గంట ఊపిరిపోసింది

Stock Market: Sensex Up 214 Pts Nifty Ends At 17400 Gain It Stocks - Sakshi

రికవరీకి ఐటీ, రిలయన్స్‌ షేర్ల ర్యాలీ అండ 

గట్టెక్కించిన ఆఖరి గంట కొనుగోళ్లు 

సెన్సెక్స్‌ లాభం 214 పాయింట్లు; 43 పాయింట్లు పెరిగిన నిఫ్టీ

ముంబై: ట్రేడింగ్‌ ఆద్యంతం తీవ్ర ఊగిసలాటకు లోనైన సూచీలు.., ఆఖర్లో కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఆరో రోజూ లాభాలను ఆర్జించాయి. ఐటీ షేర్లతో పాటు అధిక వెయిటేజీ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు రాణించాయి. ఫలితంగా బుధవారం సెన్సెక్స్‌ 214 పాయింట్లు పెరిగి 58,351 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 43 పాయింట్లు బలపడి 17,388 వద్ద నిలిచింది.

ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 57,789–58,416 శ్రేణిలో ట్రేడైంది. నిఫ్టీ 182 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.765 కోట్ల షేర్లను కొన్నారు. దేశీ ఇన్వెస్టర్లు రూ.518 కోట్ల షేర్లను అమ్మేశారు. అమెరికా, చైనా మధ్య తైవాన్‌ వివాదంతో ప్రపంచ మార్కెట్లు లాభ, నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి.  

ఆరు రోజుల్లో రూ.13.53 లక్షల కోట్లు 
గడచిన ఆరు రోజుల్లో సెన్సెక్స్‌ సూచీ ఐదున్నర శాతానికి(3,082 పాయింట్లు)పైగా ర్యాలీ చేయడంతో బీఎస్‌ఈలో రూ.13.53 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్‌ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ రూ.271 లక్షల కోట్లకు చేరింది. ఇదే ఆరు రోజుల్లో నిఫ్టీ 904 పాయింట్లు పెరిగింది.  

మార్కెట్లో మరిన్ని సంగతులు 
► 5జీ ఉత్పత్తుల ఆవిష్కరణకు జియోతో జతకట్టడంతో సాఫ్ట్‌వేర్‌ సొల్యూషన్‌ ప్రొవైడర్‌ సుబెక్స్‌ షేరు 20% పెరిగి రూ.33.30 అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది.
► మధ్య ప్రాచ్యానికి చెందిన ఓ ప్రముఖ ఎయిర్‌వేస్‌ సంస్థకు 24% వాటాను అమ్మేందుకు చర్చలు జరుపుతుందనే వార్తలతో స్పైస్‌జెట్‌ జెట్‌ షేరు 13 శాతం లాభపడి రూ.50.05 వద్ద స్థిరపడింది.  
► రైడ్‌ షేరింగ్‌ దిగ్గజం ఉబెర్‌.., జొమాటోలో తనకున్న మొత్తం వాటాను విక్రయించడంతో జొమాటో షేరు తీవ్ర ఒడిదుడుకులకు లోనైంది. ట్రేడింగ్‌లో 9.62% పతనమై రూ.50.25కి దిగివచ్చింది. చివర్లో కొనుగోళ్ల మద్దతు లభించడంతో 0.50% స్వల్ప నష్టంతో రూ.55.40 వద్ద నిలిచింది.

చదవండి: 'ప్రమాదం అంటే ఓ వ్యక్తి రోడ్డున పడటం కాదు..ఒక కుటుంబం రోడ్డున పడటం'

   

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top