ద్రవ్యోల్బణం, ఫెడ్‌ నిర్ణయాలు కీలకం

Stock experts expectations on the market movement this week - Sakshi

ఉక్రెయిన్‌ రష్యా యుద్ధ పరిస్థితులపై దృష్టి

హోళీ సందర్భంగా శుక్రవారం ఎక్సే్చంజీలకు సెలవు  

ఒడిదుడుకుల ట్రేడింగ్‌ కొనసాగవచ్చు

ఈ వారం మార్కెట్‌ గమనంపై స్టాక్‌ నిపుణుల అంచనాలు

ముంబై: అమెరికా ఫెడ్‌ రిజర్వ్‌ సమావేశ నిర్ణయాలతో (బుధవారం వెలువడనున్న) పాటు ద్రవ్యోల్బణ గణాంకాలు ఈ వారం దేశీయ మార్కెట్‌ గమ నాన్ని నిర్ధేశిస్తాయని స్టాక్‌ నిపుణులు చెబుతున్నారు. ఉక్రెయిన్‌ – రష్యా యుద్ధ పరిణామాలు, క్రూడాయిల్‌ ధరలు, అంతర్జాతీయ పరిస్థితులపైనా ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చు. వీటితో విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు, రూపాయి విలువ అంశాలూ ట్రేడింగ్‌పై ప్రభావాన్ని చూపొచ్చు. హోళీ సందర్భంగా శుక్రవారం(మార్చి 18న) ఎక్సే్చంజీలకు సెలవుకావడంతో ఈ వారంలో ట్రేడింగ్‌ నాలుగురోజులే జరగనుంది.  గతవారంలో సెన్సెక్స్‌ 1,216 పాయింట్లు, నిఫ్టీ 386 పాయింట్లు లాభపడ్డాయి.

‘‘అంతర్జాతీయంగా నెలకొన్న అస్థిరతలు తగ్గేంత వరకు ఒడిదుడుకుల ట్రేడింగ్‌ కొనసాగవచ్చు. ముఖ్యంగా యుద్ధ పరిస్థితులు మార్కెట్లను నడిపించనున్నాయి. ఫెడ్‌ రిజర్వ్‌ ద్రవ్య పరపతి నిర్ణయాలు క్రూడాయిల్‌ ధరలు కూడా కీలకం కానున్నాయి. ఇక దేశీయంగా సోమవారం వెలువడనున్న ద్రవ్యోల్బణ టోకు, రిటైల్‌ గణాంకాలు, ఎఫ్‌ఐఐల అమ్మకాలపై ఇన్వెస్టర్లు దృష్టిని సారించవచ్చు. సాంకేతికంగా దిగువస్థాయిలో నిఫ్టీకి 16,400 వద్ద కీలక మద్దతు స్థాయి కలిగి ఉంది. ఎగువస్థాయిలో 16,800 వద్ద బలమైన నిరోధాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది’’ శామ్కో సెక్యూరిటీస్‌ ఈక్విటీ రీసెర్చ్‌ హెడ్‌ యశ్‌ షా తెలిపారు.

కొనసాగుతున్న విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు  
ఈ మార్చి మొదటి రెండు వారాల్లో విదేశీ ఇన్వెస్టర్లు నికర అమ్మకందారులుగా నిలిచారు. ఈ నెల 2–4 తేదీల మధ్య ఎఫ్‌ఐఐలు మొత్తం రూ.45,608 కోట్లను ఉపసంహరించుకున్నారు. ఇందులో ఈక్విటీల రూపంలో రూ. 41,168 కోట్లు, డెట్‌ విభాగం నుండి రూ. 4,431 కోట్లు, హైబ్రిడ్‌ సాధనాల నుండి రూ. 9 కోట్లను వెనక్కి తీసుకున్నట్లు డిపాజిటరీల గణాంకాలు చెబుతున్నాయి. ‘‘పెరిగిన కమోడిటీ ధరల ప్రభావం భారత్‌ మార్కెట్‌పై ఎక్కువ ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది’’ అని జియోజిత్‌ ఫైనాన్సియల్‌ సర్వీసెస్‌ చీఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ స్ట్రాటజిస్ట్‌ వీకే విజయ్‌ తెలిపారు.

ఐపీవోకు నవీ టెక్నాలజీస్‌
ఈకామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ సహవ్యవస్థాపకుడు సచిన్‌ బన్సల్‌ ఏర్పాటు చేసిన నవీ టెక్నాలజీస్‌ పబ్లిక్‌ ఇష్యూకి రానుంది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 3,350 కోట్లు సమకూర్చుకునే ప్రణాళికల్లో ఉంది. ఐపీవో నిధుల కోసం పూర్తిగా తాజా ఈక్విటీని జారీ చేయనున్నట్లు ప్రాస్పెక్టస్‌లో పేర్కొంది. దీంతో ఇప్పటివరకూ నవీ టెక్నాలజీస్‌లో రూ. 4,000 కోట్లు ఇన్వెస్ట్‌ చేసిన ప్రమోటర్‌ బన్సల్‌ ఐపీవోలో భాగంగా ఎలాంటి వాటాను విక్రయించబోవడంలేదని ప్రాస్పెక్టస్‌ ద్వారా కంపెనీ వెల్లడించింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top