క్యాష్‌లెస్‌ క్లెయిమ్‌ తిరస్కరిస్తే.. కుదరదు

Special Story About Health Insurance Policy On Cashless Medical Service - Sakshi

ఇది ఒప్పందానికి విరుద్ధం

టీపీఏ, బీమా సంస్థల దృష్టికి తీసుకెళ్లాలి

పరిష్కారం రాకపోతే ఐఆర్‌డీఏ దృష్టికి

ప్రత్యామ్నాయంగా మరో నెట్‌వర్క్‌ ఆస్పత్రికి

లేదంటే నాన్‌ నెట్‌వర్క్‌ ఆస్పత్రి   ముందు ప్రాణాలు కాపాడుకోవడమే ముఖ్యం

ఆ తర్వాత సేవల తిరస్కారంపై పోరాడొచ్చు

కరోనా రెండో విడతలో ఇన్ఫెక్షన్‌ కారణంగా ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య పెరుగుతోంది. ఆరోగ్య బీమా కలిగిన వారు సాధారణంగా నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో నగదు రహిత వైద్య చికిత్సలను పొందొచ్చు. కానీ, ప్రస్తుత కరోనా మహమ్మారి కాలంలో చాలా ఆస్పత్రులు నగదు చెల్లించేవారికే చికిత్సలు అందిస్తూ బీమా ప్లాన్లపై నగదు రహిత వైద్య సేవలను తిరస్కరిస్తున్నాయి. దీంతో ఐఆర్‌డీఏఐ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. నగదు రహిత కరోనా చికిత్సల క్లెయిమ్‌లను తిరస్కరించొద్దంటూ బీమా కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది.

ఆస్పత్రులతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు పాలసీదారులకు నగదు రహిత వైద్య చికిత్సలు అందేలా చూడాలని కోరింది. కొన్ని నెట్‌వర్క్‌ ఆస్పత్రులు కరోనా చికిత్సలకు అధిక రేట్లను వసూలు చేయడమే కాకుండా.. నగదునే చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నాయి. ఆస్పత్రుల వైఖరి వల్ల పాలసీదారులకు ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రా ణాలను కాపాడుకోవాల్సిన పరిస్థితుల్లో నగదు కోసం పాట్లు పడేలా పరిస్థితులను ఆస్పత్రులు మార్చేశాయి. ఇటువంటి ప్రతికూలతలు ఎదురైతే పాలసీదారుల ముందున్న మార్గాలేంటో చూద్దాం...

బీమా సంస్థలు, ఆస్పత్రులు కుదుర్చుకున్న సేవల ఒప్పందాన్ని అమలు చేసే దిశగా బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్‌డీఏఐ) ఇప్పటికే రెండు పర్యాయాలు సర్క్యులర్‌లను జారీ చేసింది. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించి.. నిబంధనలను పాటించాలంటూ ఆస్పత్రులను కోరింది. ‘‘నగదు రహిత చికిత్సలు అందుబాటులో ఉన్నట్టు పాలసీదారు గుర్తించినట్టయితే.. పాలసీ ఒప్పందం మేరకు ఆయా నెట్‌వర్క్‌ ఆస్పత్రిలో నగదు రహిత వైద్యం పాలసీదారుకు అందేలా బీమా సంస్థలు చర్యలు తీసుకోవాలి’’ అని తన ఉత్తర్వుల్లో ఐఆర్‌డీఏఐ కోరింది. నగదు రహిత వైద్యాన్ని ఆస్పత్రి తిరస్కరిస్తే.. అందుకు వీలు కల్పించాలని కోరుతూ పాలసీదారులు థర్డ్‌ పార్టీ అడ్మినిస్ట్రేటర్‌ (బీమా సంస్థ తరఫున క్లెయిమ్‌ సేవలు అందించే మూడో పక్షం/టీపీఏ)కు అధికారికంగా తెలియజేయాలి. అప్పటికీ నగదు రహిత వైద్యం లభించకపోతే.. ఆస్పత్రికి వ్యతిరేకంగా బీమా సంస్థకు నేరుగా ఫిర్యాదు దాఖలు చేయాలి.

నగదు రహిత వైద్యం పాలసీదారులకు ఎంతో శ్రమను తప్పిస్తుంది. కనుక ఒక నెట్‌వర్క్‌ ఆస్పత్రి ఈ సేవను తిరస్కరించినట్టయితే.. అత్యవసర పరిస్థితుల్లో ఎక్కువ సమయం వేచి చూసే పరిస్థితి ఉండదు. అటువంటి సందర్భాల్లో మరో నెట్‌వర్క్‌ ఆస్పత్రికి వెళ్లి నగదు రహిత చికిత్సలను తీసుకోవడం ఒక పరిష్కారం. దీనివల్ల పాలసీదారులు తమ జేబుల నుంచి భారీగా వ్యయం చేయాల్సిన ఇబ్బంది తప్పుతుంది. ఆస్పత్రులు అంగీకరించిన ధరలనే వసూలు చేసేలా చూడాలని కూడా బీమా సంస్థలను ఐఆర్‌డీఏఐ కోరింది.

‘‘నెట్‌వర్క్‌ ఆస్పత్రులు అంగీకరించిన ధరలకే పాలసీదారులకు చికిత్సలు అందించేలా బీమా సంస్థలు చూడాలి. ఎటువంటి అదనపు చార్జీలు తీసుకోకుండా చూడాలి. ఒకవేళ ఒప్పందానికి విరుద్ధంగా నగదు రహిత చికిత్సలకు తిరస్కరిస్తే, ఆయా ఆస్పత్రులపై తగిన చర్యలు తీసుకోవాలి’’ అని ఐఆర్‌డీఏఐ కో రింది. ఒకవేళ ఆస్పత్రులు అధికంగా చార్జీలు వసూలు చేసినట్టయితే ఆ తర్వాత ఫిర్యాదు దాఖలు చేయడం ద్వారా వాటి సంగతి తేల్చవచ్చు. మంచి ఆస్పత్రి అని భావిస్తుంటే, నగదు రహిత చికిత్సలను తిరస్కరించిన సందర్భంలో నగదు చెల్లించి ఆ తర్వాత రీయింబర్స్‌మెంట్‌ పొందడం ఒక్కటే మార్గం.

ఇతర ఆస్పత్రులు
నగదు రహిత చికిత్సలకు తిరస్కారం ఎదురైన సందర్భాల్లో బీమా కంపెనీ నెట్‌వర్క్‌ జాబితాలో లేని ఆస్పత్రికి సైతం వెళ్లొచ్చు. ఎందుకంటే చికిత్సల వ్యయాలను సొంతంగా భరించి, ఆ తర్వాత రీయింబర్స్‌మెంట్‌ చేసుకోవడమే కనుక ఎక్కడైనా రిజిస్టర్డ్‌ హాస్పిటల్‌లో వైద్య సేవలను పొందొచ్చు. ముఖ్యంగా ఆయా క్లిష్ట సందర్భాల్లో ప్రాణాలను కాపాడుకోవడాన్ని ప్రాధాన్య అంశంగా చూడాలి. అందుకే కీలక సమయంలో కాలయాపనకు బదులు ప్రత్యామ్నాయ మార్గాలను ఆశ్రయించడం మంచిది. నిధులు సర్దుబాటు అయితే అందుబాటులోని ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్న తర్వాత రీయింబర్స్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. క్లెయిమ్‌ వచ్చేందుకు నెల వరకు సమయం తీసుకుంటుంది.

ఆస్పత్రిపై ఫిర్యాదు
నగదు రహిత వైద్యం తిరస్కరణపై ఐఆర్‌డీఏఐ తీవ్రంగా స్పందించింది. ఎటువంటి ఆటంకాల్లేని సేవలు లభించేందుకు నెట్‌వర్క్‌ ఆస్పత్రులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులకు ఏర్పాట్లు చేసుకోవాలని బీమా కంపెనీలకు సూచించింది. పాలసీదారుల ఫిర్యాదులకు కచ్చితమైన పరిష్కారం అందించాలని.. చట్టపరమైన చర్యల కోసం స్థానిక అధికార యంత్రాంగం దృష్టికి ఆయా ఆస్పత్రుల వ్యవహారాలను తీసుకెళ్లాలని కోరింది. ఒకవేళ ఆస్పత్రుల వ్యవహారశైలి పట్ల సంతృప్తిగా లేకపోతే బీమా సంస్థకు, స్థానిక అధికార యంత్రాగానికి పాలసీదారులు కూడా ఫిర్యాదు చేయవచ్చు.

ఫిర్యాదు దాఖలు ఎలా..?
ఫిర్యాదును దాఖలు చేయడమే కాదు.. తగిన పరిష్కారాన్ని పొందడమూ ముఖ్యమే. పాలసీదారులు ముందుగా బీమా సంస్థకు చెందిన పాలసీదారుల ఫిర్యాదుల పరిష్కార విభాగాన్ని సంప్రదించాలి. 15 రోజుల్లోపు బీమా సంస్థ నుంచి సరైన పరిష్కారం లభించకపోయినా, పరిష్కారం పట్ల సంతృప్తి లేకపోయినా అప్పుడు సమగ్ర ఫిర్యాదుల పరిష్కార విభాగం రూపంలో ఐఆర్‌డీఏఐ దృష్టికి సమస్యను తీసుకెళ్లొచ్చు. ఈ పోర్టల్‌లో (https://igms.irda. gov.in/) పాలసీదారులు తమ వివరాలతో నమోదు చేసుకోవాలి. అనంతరం లాగిన్‌ అయ్యి ఫిర్యాదును దాఖలు చేయడంతోపాటు పురోగతిని తెలుసుకోవచ్చు. అలాగే ఈ మెయిల్‌ (complaints@irdai.gov.in) రూపంలో నూ ఐఆర్‌డీఏఐకి ఫిర్యాదు చేయవచ్చు. 1800 4254 732 టోల్‌ఫ్రీ నంబర్‌లో సంప్రదించొచ్చు.
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top