పెట్స్‌కు ఫోన్‌ చేయండి.. కుక్కల భాష తెలుసుకోండి! | Smart gadgets for pet care | Sakshi
Sakshi News home page

పెట్స్‌కు ఫోన్‌ చేయండి.. కుక్కల భాష తెలుసుకోండి!

Apr 13 2025 2:04 PM | Updated on Apr 13 2025 3:02 PM

Smart gadgets for pet care

పెంపుడు జంతువులపై ప్రేమతో వాటికి కావాల్సిన వస్తువులు, దుస్తులు, బొమ్మలు ఇలా చాలానే కొంటుంటారు. కాని, ఇప్పుడు ఆ జంతువులకు, వాటి యజమానులకు ఎంతగానో ఉపయోగపడే అత్యాధునిక గాడ్జెట్స్‌ మీ కోసం..

పెట్‌ ఫోన్‌
పెంపుడు జంతువులకు కూడా ఫోన్‌ చేసి మాట్లాడే వీలు కల్పిస్తుంది ఈ ‘పెట్‌ ఫోన్‌’. దీని ద్వారా మీ పెట్స్‌ ఎక్కడున్నా, ఎప్పుడైనా సరే వాటికి ఫోన్‌ చేసి టచ్‌లో ఉండొచ్చు. క్లౌడ్‌ సిమ్‌ టెక్నాలజీతో పనిచేసే ఈ ఫోన్‌ టూ వే కమ్యూనికేషన్‌ ఫీచర్‌తో పనిచేస్తుంది. ఇందులోని జీపీఎస్, రియల్‌ టైమ్‌ లొకేషన్‌ ట్రాకింగ్‌ సాయంతో సిగ్నల్‌ తక్కువ ఉన్న ప్రాంతాల్లోనూ వాటి లొకేషన్‌ను గుర్తించి సమాచారం ఇస్తుంది. ధర రూ. 32,411 మాత్రమే!

పెంపుడుజీవాల ఆరోగ్యానికి రక్షణ
పెంపుడు జంతువుల అనారోగ్యం గుర్తించడంలో ఆలస్యం అయితే, వాటి ప్రాణాలకే ప్రమాదం. వాటి ఆరోగ్యం విషయంలో ఎంతగానో జాగ్రత్త తీసుకోవాలి. పెంపుడు జంతువుల హెల్త్‌ చెకప్‌ కోసం తయారు చేసినదే ఈ ‘విజ్‌డమ్‌ ప్యానెల్‌ ప్రీమియం’. ఇది డీఎన్‌ఏ పరీక్ష కిట్‌తో పాటు, వివిధ పరీక్షల ప్యాకేజింగ్‌తో వస్తుంది. ఈ పరీక్షలతో దాదాపు 211 జన్యు, ఇతర ఆరోగ్య పరిస్థితుల ఫలితాలు, వాటి వివరాలను తెలుసుకోవచ్చు. ధర వివిధ ప్యాకేజీలను బట్టి ఉంటుంది.

శునక భాషను అనువదిస్తుంది..
శునకాలు మూగజీవులైనప్పటికీ వాటికీ ఓ భాష ఉంటుంది. అవి కూడా మనతో మాట్లాడే ప్రయత్నం చేస్తుంటాయి. మనకే అర్థం కావు. తాజాగా అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు కుక్కల భాషను అర్థం చేసుకునేందుకు వీలుగా ఓ ప్రత్యేకమైన ‘పెట్‌ ట్రాన్స్‌లేటర్‌’ను అభివృద్ధి చేశారు. ఈ ప్రత్యేకమైన పరికరం కుక్కలు మొరిగే తీరు, అవి చేసే వివిధ శబ్దాల ఆధారంగా అవి చెప్పాలనకున్న విషయాన్ని మనకు తెలిసిన భాషలో వివరిస్తుంది. ధర 220 డాలర్లు. (రూ. 18,817) మాత్రమే!

పాటీ క్లీనర్‌ 
ప్రేమగా పెంచుకున్నప్పటికీ పెంపుడు జంతువుల విసర్జనను శుభ్రం చేయడానికి ఇబ్బంది పడుతుంటారు కొందరు. అయితే, ‘ఐ రోబో రోంబా జే7’ వాక్యూమ్‌ ఈ పనిని చాలా చక్కగా చేస్తుంది. సాధారణ రోబో వ్యాక్యూమ్స్‌ పాటీలను గుర్తించలేవు. కాబట్టి, వాటిని సరిగ్గా శుభ్రం చేయలేవు. కాని, ఈ రోంబా జే7 పెట్‌ పాటీలను గుర్తించి ప్రత్యేకంగా వాటిని శుభ్రం చేస్తుంది. ధర 799 డాలర్లు (రూ. 68,322). ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసే వీలుంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement