
78 వేల స్థాయిపైకి సెన్సెక్స్
నిఫ్టీ లాభం పది పాయింట్లు
ముంబై: ఐటీ రంగ షేర్ల అండతో స్టాక్ సూచీల ర్యాలీ ఏడోరోజూ కొనసాగింది. అయితే లాభాల స్వీకరణతో ఆరంభ లాభాలు హరించుకుపోయాయి. ట్రేడింగ్ ప్రారంభంలోనే 757 పాయింట్లు ఎగసిన సెన్సెక్స్ చివరికి 33 పాయింట్లు పరిమిత లాభంతో 78 వేల స్థాయిపైన 78,017 వద్ద స్థిరపడింది. నిఫ్టీ పది పాయింట్ల స్వల్ప లాభంతో 23,669 వద్ద నిలిచింది. ఐటీ, ప్రైవేటు రంగ బ్యాంకు షేర్లు మినహా అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి.
ఇప్పటికీ అధిక విలువల వద్ద ట్రేడవుతున్న చిన్న, మధ్య తరహా కంపెనీల షేర్లలో విక్రయాలు చోటుచేసుకున్నాయి. బీఎస్‌ఈ స్మాల్ సూచీ 1.63%, మిడ్ క్యాప్ ఇండెక్సు 1.13 శాతం నష్టపోయాయి. ఏప్రిల్ 2 నుంచి అమల్లోకి రానున్న ప్రతీకార సుంకాల్లో మినహాయింపు ఉండొచ్చని ట్రంప్ సంకేతాలతో అంతర్జాతీయ మార్కెట్లు సానుకూలంగా ట్రేడవుతున్నాయి.
⇒ అధిక విలువ కలిగిన షేర్లలో ఇటీవల దిద్దుబాటు కారణంగా ఐటీ షేర్లకు డిమాండ్ నెలకొంది. పెర్సిస్టెంట్ 2.60%, కో ఫోర్జ్ 2.25% ర్యాలీ చేశాయి. ఎంఫసిస్, ఇన్ఫోసిస్ 1.50% పెరిగాయి. హెచ్‌సీఎల్ టెక్ 1%, టీసీఎస్, విప్రో షేర్లు అరశాతం మేర లాభపడ్డాయి.
⇒ ప్రభుత్వరంగ బ్యాంకు షేర్లు భారీ నష్టాలు చవిచూశాయి. సెంట్రల్ బ్యాంక్ ఇండియా, యూకో బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 3–5% క్షీణించాయి.
⇒ వచ్చే ఆర్థిక సంవత్సరంలో డిమాండ్ ఊపందుకుంటుందనే అంచనాలతో బ్రోకరేజ్ సంస్థ యూబీఎస్ సిమెంట్ రంగ షేర్లకు ‘బై’ కేటాయించింది. అ్రల్టాటెక్ 3.50%, ఏసీసీ, దాల్మియా భారత్, అంబుజా సిమెంట్స్ 3% పెరిగాయి.