షార్ట్‌ కవరింగ్‌ కొనుగోళ్లు | Sakshi
Sakshi News home page

షార్ట్‌ కవరింగ్‌ కొనుగోళ్లు

Published Fri, Nov 26 2021 4:08 AM

Sensex Surges Over 450 Points, Nifty Near 17,550 points - Sakshi

ముంబై: స్టాక్‌ సూచీలు నవంబర్‌ సిరీస్‌కు లాభాలతో వీడ్కోలు పలికాయి. డెరివేటివ్స్‌ కాంట్రాక్టుల గడువు ముగింపు నేపథ్యంలో షార్ట్‌ కవరింగ్‌ కొనుగోళ్ల జరగడంతో గురువారం సెన్సెక్స్‌ 454 పాయింట్లు పెరిగి 58,795 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 121 పాయింట్ల లాభంతో 17,536 వద్ద నిలిచింది. అధిక వెయిటేజీ రిలయన్స్‌ షేరు ఆరుశాతం రాణించి సూచీల ర్యాలీకి అండగా నిలిచింది. మూడీస్‌తో సహా పలు అంతర్జాతీయ బ్రోకరేజ్‌ సంస్థలు భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి అవుట్‌లుక్‌ను అప్‌గ్రేడ్‌ రేటింగ్‌కు సవరించడంతో సెంటిమెంట్‌ మరింత బలపడింది.

ఇంధన, ఫార్మా, ఐటీ, మీడియా, మెటల్, రియల్టీ, షేర్లు లాభపడ్డాయి. నవంబర్‌ ఎఫ్‌అండ్‌ఓ డెరివేటివ్స్‌ కాంట్రాక్టుల ముగింపు సందర్భంగా ట్రేడర్లు తమ పొజిషన్లను మార్చుకోనే (స్క్యేయర్‌ ఆఫ్, రోలోవర్‌) క్రమంలో సూచీలు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.2300 కోట్ల షేర్లను విక్రయించారు. దేశీయ ఇన్వెస్టర్లు రూ.1368 కోట్ల షేర్లను కొన్నారు. బ్యాంకింగ్, ఆర్థిక, ఆటో షేర్లు నష్టపోయాయి. వీలైనంత తొందర్లో ఉద్దీపన ఉపసంహరణ చర్యలను చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఫెడ్‌ రిజర్వ్‌ తన మినిట్స్‌లో తెలపడంతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా ట్రేడ్‌ అవుతున్నాయి. ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి విలువ 12 పైసలు బలపడి 74.52 వద్ద స్థిరపడింది.

తడబడినా.., నిలబడ్డాయ్‌..!
ఒకరోజు నష్టం తర్వాత స్టాక్‌ మార్కెట్‌ ఉదయం స్వల్ప లాభంతో మొదలైంది. సెన్సెక్స్‌ ఉదయం 23 పాయింట్ల లాభంతో  58,364 వద్ద, నిఫ్టీ రెండు పాయింట్ల పెరిగి 17,417 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. అంతర్జాతీయ మార్కెట్లోని బలహీనతలు, విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాల మార్కెట్‌ సెంటిమెంట్‌ను దెబ్బతీయడంతో తొలి అరగంటలోనే సూచీలు నష్టాలను మూటగట్టుకున్నాయి. సెన్సెక్స్‌ 198 పాయింట్లును కోల్పోయి 58,143 వద్ద, నిఫ్టీ 63 పాయింట్లు పతనమైన 17,352 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదుచేశాయి. మిడ్‌సెషన్‌ నుంచి రిలయన్స్‌ షేరు జోరు కనబరచడంతో పాటు ట్రేడర్లు షార్ట్‌ కవరింగ్‌ చేపట్టడంతో సూచీలు నష్టాల నుంచి గట్టెక్కాయి. మార్కెట్‌ ముగిసే వరకు ట్రేడర్లు కొనుగోళ్లకే కట్టుబడటంతో సూచీలు లాభాల్లో ముగించాయి.  

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు...
సౌదీ ఆరాంకో ఒప్పంద రద్దుతో ఈ వారం ఆరంభం నుంచి నష్టాలను చవిచూస్తున్న రిలయన్స్‌ షేరు గురువారం భారీగా పెరిగింది. షార్ట్‌ కవరింగ్‌ జరగడంతో షేరు ఇంట్రాడేలో ఆరున్నర శాతం ర్యాలీ చేసి రూ.2503 స్థాయిని అందుకుంది. చివరికి 6% లాభపడి రూ.2,494 వద్ద ముగిసింది. గ్యాసిఫికేషన్‌ అండర్‌టేకింగ్‌ను పూర్తిగా యాజమాన్యంలోని అనుబంధ సంస్థకి బదిలీ చేసేందుకు బోర్డు నిర్ణయించుకోవడం కూడా షేరు ర్యాలీకి కలిసొచ్చినట్లు మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

మార్కెట్లో మరిన్ని సంగతులు
► యాంకర్‌ ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో పేటీఎం షేరు మూడోరోజూ ర్యాలీ చేసింది. బీఎస్‌ఈలో రెండుశాతం ర్యాలీ చేసి రూ.1797 వద్ద ముగిసింది.  
► బైబ్యాక్‌ ప్రణాళికకు బోర్డు ఓకే చెప్పొచ్చనే అంచనాలతో వేదాంత షేరు ఆరుశాతం లాభపడి రూ.368 వద్ద స్థిరపడింది.
► సెప్టెంబర్‌ క్వార్టర్‌ ఫలితాలు నిరాశపరచడంతో సీమైన్స్‌ షేరు ఐదున్నర శాతం నష్టంతో రూ.2152 వద్ద నిలిచింది.

Advertisement
 
Advertisement
 
Advertisement