ఆటో, బ్యాంకింగ్‌ షేర్లలో అమ్మకాలు

Sensex dives 333 points, Nifty holds above 15,600 points - Sakshi

కొనసాగిన లాభాల స్వీకరణ

నిఫ్టీ నష్టం 105 పాయింట్లు

52 వేల దిగువకు సెన్సెక్స్‌

సూచీలకు రెండోరోజూ నష్టాలే

ముంబై: బ్యాంకింగ్, ఆటో, ఆర్థిక షేర్లతో పాటు అధిక వెయిటేజీ కలిగిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరులో లాభాల స్వీకరణ కొనసాగడంతో సూచీలు రెండోరోజూ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 334 పాయింట్లను కోల్పోయి 52 దిగువున 51,941 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 105 పాయింట్లు పతనమైన 15,635 వద్ద ముగిసింది. ప్రపంచ మార్కెట్లలో ప్రతికూలతలు, రూపాయి బలహీన ట్రేడింగ్‌ దేశీయ మార్కెట్‌ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఇటీవల మెరుగైన క్యూ4 ఆర్థిక ఫలితాల ప్రకటనతో దూసుకెళ్లిన చిన్న, మధ్య తరహా కంపెనీ షేర్లలో అధిక లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. ఉదయం సెషన్‌లో లాభాల్లో కదలాడిన సూచీలు.., మిడ్‌సెషన్‌లో ఒక్కసారిగా తలెత్తిన అమ్మకాలతో భారీ నష్టాలను చవిచూశాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 730 పాయింట్లు, నిఫ్టీ 233 పాయింట్లు పరిధిలో కదలాడాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.846 కోట్ల విలువైన షేర్లను, దేశీయ ఇన్వెస్టర్లు రూ.1627 కోట్ల ఈక్విటీలను అమ్మేశారు. ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి విలువ రెండోరోజూ క్షీణించింది. డాలర్‌ మారకంలో ఎనిమిది పైసలు నష్టపోయి 72.97 వద్ద స్థిరపడింది.  

ముంచేసిన మిడ్‌సెషన్‌ అమ్మకాలు...  
ఆసియా మార్కెట్ల నష్టాలతో ట్రేడ్‌ అవుతున్నప్పటికీ.., దేశీయ మార్కెట్‌ ఉదయం లాభాలతో మొదలైంది. సెన్సెక్స్‌ 125 పాయింట్ల లాభంతో 52,401 వద్ద, నిఫ్టీ 26 పాయింట్లు పెరిగి 15,766 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. తొలుత ఆటో షేర్లతో  మినహా అన్ని రంగాల షేర్లు రాణించడంతో ఒక దశలో సెన్సెక్స్‌ 147 పాయింట్లు ర్యాలీ చేసి 52,447 వద్ద, నిఫ్టీ 60 పెరిగి 15,800 వద్ద ఇంట్రాడే గరిష్టాలను అందుకున్నాయి. సాఫీగా సాగుతున్న తరుణంలో మిడ్‌సెషన్‌లో ఒక్కసారి తలెత్తిన అమ్మకాలు సూచీల ర్యాలీని అడ్డుకున్నాయి. క్రమంగా విక్రయాల ఒత్తిడి పెరగడంతో ఆరంభ లాభాలన్ని కోల్పోయి నష్టాల బాట పట్టాయి. ఈ క్రమంలో సెన్సెక్స్‌ ఇంట్రాడే గరిష్టం(52,447) నుంచి 730 పాయింట్లు, నిఫ్టీ డే హై(15,800) నుంచి 233 పాయింట్లు పతనాన్ని చవిచూశాయి. చివరి అరగంటలో కాస్త కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీల నష్టాల కొంత తగ్గాయి.

|ప్రపంచ మార్కెట్లలో ప్రతికూలతలు...
చైనా మే మాసపు ద్రవ్యోల్బణ గణాంకాలు అంచనాలకు మించి నమోదవడంతో ఆసియాలో ప్రధాన దేశాల మార్కెట్లు నష్టాలను చవిచూశాయి. జపాన్, సింగపూర్, తైవాన్, కోప్పీ దేశాల సూచీలు ఒకశాతం నష్టంతో ముగిశాయి. యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ పాలసీ సమావేశం గురువారం ప్రారంభవుతుంది. వడ్డీ రేట్లు, ఆర్థిక వ్యవస్థ అవుట్‌లుక్‌పై ఫెడ్‌ వైఖరిని తెలిపే అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు కూడా అదే రోజున వెల్లడి కానున్నాయి. కీలకమైన ఈ ఘట్టాలకు ముందు అంతర్జాతీయ ఇన్వెస్టర్లు
అప్రమత్తత వహిస్తున్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top