సహారాకి షాక్‌ ! సెబీకి రూ.2,000 కోట్లు డిపాజిట్‌ చేయండి! | Sakshi
Sakshi News home page

సహారాకి షాక్‌ ! సెబీకి రూ.2,000 కోట్లు డిపాజిట్‌ చేయండి!

Published Fri, Nov 19 2021 1:28 PM

Securities Appellate Tribunal Order Sahara To Deposit Rs 2000 Crore - Sakshi

న్యూఢిల్లీ: రెగ్యులేటరీ నిబంధనావళిని ఉల్లంఘించి దాదాపు రూ.14,000 కోట్ల వసూలు కేసులో సహారా గ్రూప్‌ సంస్థ, ఆ సంస్థ డైరెక్టర్లకు శాట్‌లోనూ పూర్తి ఊరట లభించలేదు. మార్కెట్‌ రెగ్యులేటర్‌– సెబీ ఎస్క్రో అకౌంట్‌లో రూ.2,000 కోట్లు డిపాజిట్‌ చేయాలని సహారా గ్రూప్‌ సంస్థ– సహారా ఇండియా కమర్షియల్‌ కార్పొరేషన్‌ (ఎస్‌ఐసీసీఎల్‌), ఆ సంస్థ మాజీ డైరెక్టర్లను సెక్యూరిటీస్‌ అప్పీలేట్‌ ట్రిబ్యునల్‌ (శాట్‌) ఆదేశించింది. ఇందుకు నాలుగువారాల గడువు మంజూరు చేసింది. ఈ నిధుల డిపాజిట్‌ తర్వాతే గ్రూప్‌ కంపెనీ, ఆ సంస్థ డైరెక్టర్లకు వ్యతిరేకంగా సెబీ రికవరీ ఆఫీసర్‌ జారీ చేసిన జప్తు ఉత్తర్వులను వెనక్కు తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేసింది.  శాట్‌ ఆదేశాలు జారీ చేసిన డైరెక్టర్లలో గ్రూప్‌ చైర్మన్‌ సుబ్రతారాయ్‌ కూడా ఉన్నారు.  
ఆస్తుల వివరాలు అందజేయాలని స్పష్టీకరణ 
ఆస్తులు, తదితర వివరాలు కూడా సెబీకి సుబ్రతారాయ్‌ అఫిడవిట్‌ రూపంలో అందజేయాలని శాట్‌ ఆదేశించింది. ‘‘భారతదేశం, అలాగే విదేశాలలో ఉన్న అన్ని ఆస్తులు, అన్ని బ్యాంకు ఖాతాల వివరాలు, డీమ్యాట్‌ ఖాతాల పూర్తి జాబితాను, మ్యూచువల్‌ ఫండ్స్‌/షేర్లు/సెక్యూరిటీలను (భౌతికంగా లేదా డీమ్యాట్‌ రూపంలో) సెబీకి  నాలుగు వారాల్లోగా అందజేయాలని మేము మొదటి అప్పీలుదారు– సహారా ఇండియా కమర్షియల్‌ కార్పొరేషన్, రెండవ అప్పీలుదారు– సహారా ఇండియాలను ఆదేశిస్తున్నాము’’అని శాట్‌ తన ఉత్తర్వు్యల్లో పేర్కొంది.   
ఇరువురికి ఊరట... 
కాగా, వృద్ధాప్యం, అత్యవసర వైద్య ఖర్చులను పరిగణనలోకి తీసుకుని కంపెనీ అప్పటి డైరెక్టర్లు ఇరువురు– ఏఎస్‌ రావు, రనోజ్‌ దాస్‌ గుప్తాలకు వ్యతిరేకంగా జారీ అయిన జప్తు ఉత్తర్వులను వెనక్కు తీసుకోవాలని సెబీ రికవరీ ఆఫీసర్‌ను శాట్‌ ఆదేశించింది. 
కేసు వివరాలు ఇవీ...
ఎటువంటి రెగ్యులేటరీ నిబంధనలు పాటించకుండా దాదాపు 2 కోట్ల మంది ఇన్వెస్టర్ల నుంచి ఐచ్ఛిక పూర్తి కన్వర్టబుల్‌ డిబెంచర్ల (ఆప్షనల్లీ ఫుల్లీ కన్వెర్టబుల్‌ డిబెంచర్లు)  ద్వారా 1998 నుంచి 2009 మధ్య ఎస్‌ఐసీసీఎల్‌ ఈ నిధులు సమీకరించిందన్నది ఈ కేసులో సహారా గ్రూప్‌ సంస్థ, కంపెనీ అప్పటి డైరెక్టర్లపై ఆరోపణ. కంపెనీ వసూలు చేసిన రూ.14,000 కోట్లను 15 శాతం వార్షిక వడ్డీతోసహా రిఫండ్‌ చేయాలని ఎస్‌ఐసీసీఎల్, ఆ కంపెనీ ఒకప్పటి డైరెక్టర్లను 2018 అక్టోబర్‌లో సెబీ ఆదేశించింది. అలాగే ఇతర సంస్థలతో భాగస్వామ్యాల నుంచి కూడా ఎస్‌ఐసీసీఎల్‌ను, ఆ సంస్థ డైరెక్టర్లను సెబీ నిషేధించింది. ఈ కేసుకు సంబంధించి 2021 ఏప్రిల్‌లో సెబీ రికవరీ ఆఫీసర్‌ ఎస్‌ఐసీసీఎల్‌కు, కంపెనీ అప్పటి డైరెక్టర్లకు డిమాండ్‌ నోటీస్‌ జారీ చేశారు. రూ.14,106 కోట్లు 15 రోజుల్లో డిపాజిట్‌ చేయకపోతే రికవరీ ప్రక్రియ తప్పదని స్పష్టం చేశారు. డబ్బు చెల్లించకపోవడంతో అక్టోబర్‌ 2021న జప్తు ఉత్తర్వులుజారీ చేశారు. బ్యాంక్‌ అకౌంట్లు, డీమ్యాట్‌ అకౌంట్లు తదితర వారి ఆస్తుల అన్నింటి జప్తునకు బ్యాంకులు తత్సబంధ అధికారులకు జప్తు ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో సహారా శాట్‌ను ఆశ్రయించింది.

చదవండి: రెండు లక్షల కోట్ల రూపాయల ఐపీవో! భారీ పబ్లిక్‌ ఇష్యూ!

Advertisement
 

తప్పక చదవండి

Advertisement