రెండు లక్షల కోట్ల రూపాయల ఐపీవో! భారీ పబ్లిక్‌ ఇష్యూ!

NSE Planning For IPO SEBI Ready To Give Permissions - Sakshi

ఎన్‌ఎస్‌ఈ ఐపీవోకు రంగం సిద్ధం!

ఆఫర్‌ జారీకి అనుమతించవచ్చని సెబీకి న్యాయ సలహాలు

త్వరలో ప్రాస్పెక్టస్‌ దాఖలు అవకాశం

భారీ పబ్లిక్‌ ఇష్యూగా రికార్డుకు చాన్స్‌

గ్రే మార్కెట్లో రూ.4,000 ధరలో షేరు

ఈక్విటీ డెరివేటివ్స్‌ విభాగంలో లీడర్‌

సుప్రసిద్ధ ఇన్వెస్టర్లకు ఎన్‌ఎస్‌ఈలో వాటా  

దిగ్గజ స్టాక్‌ ఎక్సే్ంజీ ఎన్‌ఎస్‌ఈ పబ్లిక్‌ ఇష్యూకి మార్గం సుగమమైనట్లు తెలుస్తోంది. క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఈ అంశంపై తాజాగా తీసుకున్న న్యాయ సలహాలు ఎన్‌ఎస్‌ఈ ఆఫర్‌ జారీకి అనుకూలంగా ఉన్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. గతంలో ఆల్గో ట్రేడింగ్‌ కుంభకోణం నేపథ్యంలో సెబీ ఇందుకు విముఖత  చూపిన సంగతి తెలిసిందే. కాగా.. ఈక్విటీ డెరివేటివ్స్‌ విభాగంలో లీడర్‌గా నిలుస్తున్న నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజీ (ఎన్‌ఎస్‌ఈ) పబ్లిక్‌ ఇష్యూకి భారీ స్థాయిలో స్పందన లభించనున్నట్లు మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. వివరాలు చూద్దాం..

NSE Likely to Get Clearance from SEBI for Big Ticket IPO: నేషనల్‌ స్టాక్‌ ఎక్సే్ంజీ త్వరలో పబ్లిక్‌ ఇష్యూకి రానున్నట్లు మార్కెట్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. గతంలో ఆల్గోరిథమ్‌ ట్రేడింగ్‌ స్కామ్‌ నేపథ్యంలో రెడ్‌సిగ్నల్‌ ఇచ్చిన సెబీ తాజాగా న్యాయపరమైన అంశాలను తీసుకుని, ఆఫర్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. దీంతో తిరిగి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేయడానికి ఎన్‌ఎస్‌ఈకి సెబీ అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. తద్వారా త్వరలో ఎన్‌ఎస్‌ఈ ఐపీవో చేపట్టే వీలున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా.. ఇప్పటికే అనధికార(గ్రే) మార్కెట్లో ఎన్‌ఎస్‌ఈ షేరు రూ.3,000–4,000 శ్రేణిలో కదులుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి.  

అతిపెద్ద ఇష్యూ 
ఈక్విటీ డెరివేటివ్స్‌ విభాగంలో దాదాపు ఏకచత్రాధిపత్యం వహిస్తున్న ఎన్‌ఎస్‌ఈ పబ్లిక్‌ ఇష్యూకి భారీ స్పందన లభించే వీలుంది. ఐపీవో ద్వారా ఎన్‌ఎస్‌ఈ రూ. 2 లక్షల కోట్ల విలువను సాధించవచ్చని అంచనా. నిజానికి 2016 డిసెంబర్‌లోనే లిస్టింగ్‌కు వీలుగా ఎన్‌ఎస్‌ఈ సెబీకి ప్రాథమిక పత్రాలను దాఖలు చేసింది. అయితే తదుపరి ఆల్గో ట్రేడింగ్‌ మోసం బయటపడటంతో సెబీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన అజయ్‌ త్యాగి ఎన్‌ఎస్‌ఈ ఐపీవోకు చెక్‌ పెట్టారు. ఎక్సే్ంజీ సహలొకేషన్ల సర్వర్ల ద్వారా డేటా చౌర్యం జరిగినట్లు ఆరోపణల నేపపథ్యంలో సెబీ దర్యప్తుకు సైతం ఆదేశించింది.

సెబీ చర్యలు 
ఆల్గో స్కామ్‌ నేపథ్యంలో 2019 మే నెలలో సెబీ రూ.1,000 కోట్లు చెల్లించమంటూ ఎన్‌ఎస్‌ఈని ఆదేశించింది. అంతేకాకుండా ఎక్సే్ంజీ సీనియర్‌ అధికారులపై కేసులు నమోదు చేసింది. కాగా.. ప్రస్తుతం ఈ కేసు కోర్టుల పరిధిలో ఉన్నప్పటికీ సెబీ తాజాగా న్యాయ సలహా పొందినట్లు తెలుస్తోంది. ఎన్‌ఎస్‌ఈలో వాటా విక్రయానికి కోర్టు అభ్యంతరం చెప్పకపోవడంతో తిరిగి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేయవలసిందిగా ఎన్‌ఎస్‌ఈను సెబీ ఆదేశించనున్నట్లు తెలుస్తోంది. మరోపక్క కుంభకోణంలో పాత్ర ఉన్నట్లు కేసులు నమోదైన అధికారులను ఎక్సే్ంజీ నుంచి తొలగించడం సానుకూల అంశంగా నిలవనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. కాగా.. సెబీ రూ.1,000 కోట్ల జరిమానా విధింపుపై ఎన్‌ఎస్‌ఈ శాట్‌ను ఆశ్రయించిన సంగతి తెలిసిందే.  

బీఎస్‌ఈతో పోలిస్తే 
ఇప్పటికే లిస్టింగ్‌ను సాధించిన మరో స్టాక్‌ ఎక్సే్ంజీ దిగ్గజం బీఎస్‌ఈ గత 12 నెలల ఆర్జనను పరిగణిస్తే 38 పీఈ (నిష్పత్తి)లో ట్రేడవుతున్నట్లు బ్రోకింగ్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే అతిభారీ ప్రయివేట్‌ డీల్స్‌ నమోదయ్యే ఎన్‌ఎస్‌ఈ విలువ 80–100 స్థాయిలో ఉండవచ్చని అంచనా వేస్తున్నాయి. దీంతో ఎన్‌ఎస్‌ఈ ఐపీవో ధరల శ్రేణి సైతం ప్రీమియంలో నిర్ణయంకావచ్చని భావిస్తున్నాయి. ఈక్విటీ డెరివేటివ్స్‌లో దాదాపు ఏకచత్రాధిపత్యం వహిస్తున్న కారణంగా ఎన్‌ఎస్‌ఈ 80 శాతం ఇబిటా మార్జిన్లు సాధిస్తున్నట్లు చెబుతున్నారు. అంతక్రితం ఏడాదితో పోలిస్తే 2021 మార్చికల్లా ఎన్‌ఎస్‌ఈ నిర్వహణ ఆదాయంలో 60 శాతం వృద్ధిని సాధించింది. రూ. 5,625 కోట్లను ఆర్జించింది. నికర లాభం సైతం 89 శాతం జంప్‌చేసి రూ. 3,574 కోట్లను తాకింది. అయితే గతేడాది అనుబంధ సంస్థ క్యామ్స్‌(సీఏఎంఎస్‌)లో వాటా విక్రయం ద్వారా పొందిన ఆదాయం నికర లాభాల్లో కలసి ఉన్న విషయం గమనార్హం!

చదవండి:కొనసాగుతున్న ఐపీవోల సందడి

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top