సెకండ్‌ హ్యాండ్‌ ఇళ్లకు గిరాకీ | Second hand Homes in demand in Hyderabad | Sakshi
Sakshi News home page

సెకండ్‌ హ్యాండ్‌ ఇళ్లు.. హైదరాబాద్‌లో ఇ‍క్కడ భలే డిమాండ్‌

May 3 2025 8:22 AM | Updated on May 3 2025 10:04 AM

Second hand Homes in demand in Hyderabad

కరోనాతో పెరిగిన ఇంటి అవసరం

మంచి ప్రాంతం, మౌలిక వసతులుంటే కొనడం ఉత్తమం

38 శాతం నుంచి 43శాతానికి పెరిగిన రీ సేల్‌ ప్రాపర్టీల వాటా

ఐటీ కారిడార్‌ సమీప ప్రాంతాల్లోని ఇళ్లకు అధిక డిమాండ్‌

స్థిరాస్తి రంగానికి ప్రత్యేకించి గృహ విభాగానికి కరోనా మహమ్మారి బూస్ట్‌లా బలానిచ్చింది. హోం ఐసోలేషన్, వర్క్‌ ఫ్రం హోమ్‌ వంటి కారణంగా సొంతింటి అవసరం తెలిసి రావడంతో నివాస విభాగం శరవేగంగా అభివృద్ధి చెందింది. దీంతో కోవిడ్‌ తర్వాత కొత్త ఇళ్లకే కాదు రీసేల్‌ ప్రాపర్టీలకూ గిరాకీ పెరిగింది. 2018–19 ఆర్థిక సంవత్సరంలో దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో రిజిస్ట్రేషన్‌ అయిన ప్రాపర్టీలలో సెకండ్‌ హ్యాండ్‌ హోమ్స్‌ వాటా 38 శాతంగా ఉండగా.. 2024–25 నాటికి 43 శాతానికి పెరిగిందని ఇంటిగ్రేటెడ్‌ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ ప్లేస్‌ స్క్వేర్‌ యార్డ్స్‌ నివేదిక వెల్లడించింది. - సాక్షి, సిటీబ్యూరో

డెవలపర్‌ నుంచి నేరుగా కొనుగోలుదారులు కొనుగోలు చేసే ప్రాపర్టీలను ప్రైమరీగా, ఇంటి యజమాని మరొక కస్టమర్‌కు రీసేల్‌ చేస్తే దాన్ని సెకండరీ ప్రాపర్టీగా పరిగణిస్తారు. దేశంలోని 7 ప్రధాన నగరాలలో 2018–19 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 3.07 లక్షల యూనిట్లు రిజిస్ట్రేషన్‌ కాగా.. ఇందులో 1.22 లక్షల రీసేల్‌ ప్రాపర్టీలు ఉండగా 2024–25 నాటికి మొత్తం 5.44 లక్షల యూనిట్లు రిజిస్ట్రేషన్‌ కాగా.. సెకండ్‌హ్యాండ్‌ ప్రాపర్టీలు ఏకంగా 2.33 లక్షలకు పెరిగాయి. ప్రైమరీ యూనిట్లు 2018–19లో 1.84 లక్షలుగా ఉండగా.. 2024–25 నాటికి 3.11 లక్షలకు చేరాయి. అంటే రీసేల్‌ ప్రాపర్టీలలో 38 శాతం నుంచి 43 శాతానికి పెరిగితే.. ప్రైమరీ యూనిట్లు 62 శాతం నుంచి 57 శాతానికి తగ్గాయి.

లగ్జరీ పెరగడమే రీసేల్‌కు బూస్ట్‌.. 
కరోనా కంటే ముందు వరకూ బెంగళూరు, చెన్నై, ముంబై వంటి నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు అందుబాటులోనే ఉండేవి. డెవలపర్లు కూడా అఫర్డబుల్‌ హౌసింగ్‌ నిర్మాణాలకే ప్రాధాన్యత ఇచ్చేవారు. అయితే ఏటేటా భూముల ధరలు పెరుగుతుండటంతో చౌక ఇళ్ల నిర్మాణ వ్యయప్రయాసంగా మారింది. దీంతో లగ్జరీ, విశాలమైన గృహ నిర్మాణాల వైపు ఆసక్తి పెరిగింది. కొత్త ప్రాజెక్ట్‌ల లాంచింగ్స్‌ పరిమిత స్థాయిలో ఉండటం, అందు బాటు గృహాల స్థానంలో ఖరీదైన గృహాల సరఫరా పెరగడంతో సెకండ్‌ హ్యాండ్‌ ప్రాపర్టీల వైపు సామాన్య, మధ్యతరగతి ప్రజలు మొగ్గుచూపుతున్నారు.

గ్రేటర్‌లో ఇదీ పరిస్థితి.. 
హైదరాబాద్‌లో 2024–25 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 71 వేల యూనిట్లు రిజిస్ట్రేషన్‌ కాగా.. ఇందులో 35 వేలు ప్రైమరీ, 36 వేలు సెకండరీ యూనిట్లు ఉన్నాయి. అదే 2018–19లో మొత్తం 63 వేల యూనిట్లు రిజిస్ట్రేషన్‌ కాగా.. ఇందులో ప్రైమరీ 29 వేలు, సెకండరీ యూనిట్లు 34 వేలు ఉన్నాయి. 2018–19లో ప్రైమరీ యూనిట్ల వాటా 46 శాతం కాగా.. సెకండరీ యూనిట్ల వాటా 54 శాతంగా ఉంది. అదే 2024–25లో ప్రైమరీ యూనిట్ల వాటా 49 శాతం కాగా.. 
సెకండరీ యూనిట్ల వాటా 51 శాతంగా ఉంది.

ఐటీ హబ్‌కు చేరువలో..
రోడ్లు, విద్యుత్, తాగునీటి సరఫరా, మురుగునీటి వ్యవస్థ వంటి మెరుగైన మౌలిక వసతులు ఉన్న ప్రాంతాలలో రీసేల్‌ ప్రాపర్టీలకు డిమాండ్‌ ఎక్కువగా ఉంది. మాదాపూర్, హైటెక్‌ సిటీ, కూకట్‌పల్లి, హబ్సిగూడ, ఉప్పల్, పోచారం వంటి ఐటీ కేంద్రాలకు సమీపంలో ఉన్న ప్రాంతాల్లోని సెకండ్‌ హ్యాండ్‌ హోమ్స్‌ డిమాండ్‌ ఎక్కువగా ఉంది. మెట్రో కనెక్టివిటీ ఉన్న ప్రాంతాల్లోని నాణ్యమైన ఇళ్లకు ధర కాస్త ఎక్కువైనా కొనేందుకు కస్టమర్లు ఆసక్తి చూపిస్తున్నారు.

ప్రయోజనాలివీ

» కొత్త నిర్మాణాల కంటే రీసేల్‌ ప్రాపర్టీల ధరలు అందుబాటులో ఉంటాయి.  
» రోడ్లు, విద్యా, వైద్య సంస్థలు, మార్కెట్లు, రవాణా సదుపాయాలతో స్థిరమైన మౌలిక వసతులు ఉంటాయి. 
» నిర్మాణం పూర్తయ్యే వరకూ వేచి చూడాల్సిన అవసరం లేకుండా గృహ ప్రవేశం చేసేయవచ్చు. 
» రీసేల్‌ ప్రాపర్టీలకు జీఎస్‌టీ వర్తించదు కాబట్టి కొనుగోలుదారులకు డబ్బు ఆదా అవుతుంది. 
» కొత్త ప్రాజెక్ట్‌లు పెద్దగా లేని ప్రాంతాలలో సెకండ్‌హ్యాండ్‌ హోమ్స్‌ యజమానితో బేరసారాలకు అవకాశం ఉంటుంది. 
» రీసేల్‌ ప్రాపర్టీలకు సైతం అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ బ్యాంక్‌లు తక్కువ వడ్డీలోనే గృహ రుణాలను అందిస్తున్నాయి. 
» కొత్త ఇంటి కొనుగోలు సమయంలో డెవలపర్‌కు ముందుగా చెల్లించే 10–15 శాతం డౌన్‌ పేమెంట్‌ను చెల్లించి, బుకింగ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అదే రీసేల్‌ ప్రాపర్టీలో అయితే ఇదేమీ అక్కర్లేదు.

జాగ్రత్తలివీ..

» సెకండ్‌ హ్యాండ్‌ ప్రాపర్టీలు కొనేముందు ఇంటి వాస్తవ విలువ, మార్కెట్‌ ధరలను పూర్తిగా అధ్యయనం చేసుకున్న తర్వాతే నిర్ణయానికి రావడం ఉత్తమం. 
» సాధారణంగా రీసేల్‌ ప్రాపర్టీలు వ్యవస్థీకృత రంగంలో విక్రయాలు జరగవు కాబట్టి మధ్యవర్తుల మాటలు నమ్మకూడదు. ఒకటికి రెండుసార్లు పునఃసమీక్ష చేసుకున్న తర్వాతే ముందడుగు వేయాలి. 
» లీకేజీలు, నిర్వహణ సమస్యలను గృహ యజమాని దాచిపెట్టే అవకాశాలు ఉంటాయి కాబట్టి థర్డ్‌పార్టీతో సమగ్రంగా అధ్యయనం చేయించిన తర్వాత కొనుగోలు చేయడం బెటర్‌. 
» 10–15 ఏళ్లకు పైబడి పాత ఇంటిని కొనకపోవడమే ఉత్తమం. బాగా అభివృద్ధి చెందిన ప్రాంతంలో అయితే పాత ఇంటిని కొన్నా.. దాని కూల్చేసి కొత్త ఇంటిని నిర్మించుకుంటేనే కలిసొస్తుంది. 
» లింక్‌ డాక్యుమెంట్లు, సేల్‌ డీడ్, ఆస్తి పన్ను పత్రాలు ఇతరత్రా డాక్యుమెంట్లను న్యాయ సలహా తీసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement