‘జేన్‌ స్ట్రీట్‌’ స్కామ్‌! | SEBI bans Jane Street over Rs 4843 crore unlawful earnings | Sakshi
Sakshi News home page

‘జేన్‌ స్ట్రీట్‌’ స్కామ్‌!

Jul 5 2025 12:29 AM | Updated on Jul 5 2025 5:53 AM

SEBI bans Jane Street over Rs 4843 crore unlawful earnings

వేల కోట్ల అక్రమార్జనపై సెబీ ఉక్కుపాదం

మార్కెట్‌ లావాదేవీలు నిర్వహించకుండా జేన్‌ స్ట్రీట్‌ గ్రూప్‌పై నిషేధం 

రూ. 4,843 కోట్ల అక్రమ లాభాలను చెల్లించేయాలంటూ ఆదేశాలు 

స్టాక్‌ మార్కెట్లో అవకతవకలకు పాల్పడటమే కారణం

న్యూఢిల్లీ: దేశీ స్టాక్‌ మార్కెట్లలో అవకతవకలకు పాల్పడినందుకు గాను అమెరికన్‌ సంస్థ జేన్‌ స్ట్రీట్‌ (జేఎస్‌) గ్రూప్‌పై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ కొరడా ఝుళిపించింది. తదుపరి నోటీసులు ఇచ్చేంత వరకు ట్రేడింగ్‌ చేయకుండా గ్రూప్‌ సంస్థలపై నిషేధం విధించింది. అక్రమంగా ఆర్జించిన రూ. 4,843 కోట్ల మొత్తాన్ని ఎస్క్రో అకౌంటుకు బదిలీ చేయాలని ఆదేశించింది. 

స్టాక్‌ సూచీలను ప్రభావితం చేసి, జేఎస్‌ గ్రూప్‌ భారీగా లబ్ధి పొందిందనే ఆరోపణలపై చేపట్టిన విచారణలో భాగంగా సెబీ ఈ మేరకు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. జేన్‌ స్ట్రీట్‌ (జేఎస్‌) గ్రూప్‌లో భాగమైన జేఎస్‌ఐ ఇన్వెస్ట్‌మెంట్స్, జేఎస్‌ఐ2 ఇన్వెస్ట్‌మెంట్స్, జేన్‌ స్ట్రీట్‌ సింగపూర్, జేన్‌ స్ట్రీట్‌ ఏషియా ట్రేడింగ్‌ సంస్థలకు ఇవి వర్తిస్తాయి. 2023 జనవరి–2025 మే మధ్య కాలంలో 21 ఎక్స్‌పైరీ తేదీల్లో సూచీలను ప్రభావితం చేసే విధంగా క్యాష్, ఫ్యూచర్స్‌ మార్కెట్లో గ్రూప్‌ పెద్ద ఎత్తున ట్రేడింగ్‌ చేసినట్లు, తద్వారా ఆప్షన్స్‌ మార్కెట్లో పొజిషన్లతో భారీగా లాభాలు ఆర్జించినట్లు సెబీ విచారణలో తేలింది. 

జేన్‌ స్ట్రీట్, దాని అనుబంధ సంస్థలు భారతీయ ఆప్షన్స్‌ మార్కెట్లో అనధికారిక ట్రేడింగ్‌ వ్యూహాలు అమలు చేస్తున్నాయంటూ 2024 ఏప్రిల్‌లో మీడియాలో వార్తలు రావడం ఈ కేసుకు బీజం వేశాయి. ఎక్స్‌పైరీ రోజు దగ్గరపడే సమయంలో, ఇండెక్స్‌ తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యేలా, జేఎస్‌ గ్రూప్‌ సందేహాస్పద ట్రేడింగ్‌ లావాదేవీలు నిర్వహిస్తోందని సెబీ గుర్తించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో హెచ్చరికలు జారీ చేసినప్పటికీ, ఇలాంటివి చేయబోమంటూ ఎన్‌ఎస్‌ఈకి హామీ ఇచ్చినప్పటికీ గ్రూప్‌ సంస్థలు తమ తీరును మార్చుకోలేదని ఉత్తర్వుల్లో సెబీ ఆగ్రహం వ్యక్తం చేసింది.  

    ‘‘2025లో ఎన్‌ఎస్‌ఈ జారీ చేసిన అడ్వైజరీని కూడా పట్టించుకోకుండా, లెక్కలేనితనాన్ని ప్రదర్శిస్తూ జేఎస్‌ గ్రూప్‌ వ్యవహరించిన తీరు చూస్తే, మిగతా ఎఫ్‌పీఐలు, మార్కెట్‌ వర్గాల్లాగా, అది నమ్మతగినది కాదని అర్థం అవుతోంది. గతంలోలాగే లావాదేవీలు కొనసాగించేందుకు జేఎస్‌ గ్రూప్‌ను అనుమతిస్తే ఇన్వెస్టర్ల ప్రయోజనాలకు కచ్చితంగా భంగం వాటిల్లుతుందని ప్రాథమిక సాక్ష్యాధారాలు కనిపిస్తున్నాయి’’ అని సెబీ వ్యాఖ్యానించింది. నిబంధనలను ఉల్లంఘిస్తూ జేఎస్‌ గ్రూప్‌ అక్రమంగా ఆర్జించిన రూ. 4,843.57 కోట్ల మొత్తాన్ని ఎస్క్రో అకౌంటుకు బదిలీ చేయాలని ఆదేశించింది. 

ఉత్తర్వులకు సంబంధించినవి అయితే తప్ప, తమ అనుమతి లేకుండా, జేఎస్‌ గ్రూప్‌ సంస్థల ఖాతాల్లో ఎలాంటి డెబిట్‌ లావాదేవీలను జరగనివ్వరాదంటూ బ్యాంకులకు సెబీ ఆదేశాలు ఇచ్చింది.  ఇతరత్రా సూచీల్లోనూ జేఎస్‌ గ్రూప్‌ ట్రేడింగ్‌ లావా దేవీలపై సెబీ విచారణ చేపడుతోంది. సెబీ ఉత్తర్వుల ప్రకారం ఇండెక్స్, స్టాక్‌ ఆప్షన్లలో ట్రేడింగ్‌ ద్వారా జేఎస్‌ గ్రూప్‌ రూ.44,358 కోట్లు ఆర్జించింది. స్టాక్‌ ఫ్యూచర్స్‌లో రూ.7,208 కోట్లు, ఇండెక్స్‌ ఫ్యూచర్స్‌లో రూ. 191 కోట్లు, క్యాష్‌ సెగ్మెంట్లో రూ. 288 కోట్లు నష్టపోయింది. దీంతో 2023 జనవరి–2025 మార్చి మధ్య మొత్తం మీద రూ.36,671 కోట్లు అక్రమంగా ఆర్జించింది.  

ఏం చేసింది.. ఎలా చేసింది..
స్టాక్‌ మార్కెట్లో లిక్విడిటీ ఎక్కువగా ఉండే నిఫ్టీ, బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ ఆప్షన్స్‌ సెగ్మెంట్స్‌లో ట్రేడింగ్‌ ద్వారా సూచీలను ప్రభావితం చేసి, దాన్నుంచి లాభాలు పొందిందని జేఎస్‌ గ్రూప్‌పై ఆరోపణలు ఉన్నాయి. ఇందుకోసం అది రెండు కీలక వ్యూహాలు అమలు చేసిందని సెబీ విచారణలో వెల్లడైంది. దీని ప్రకారం, బ్యాంక్‌ నిఫ్టీ స్టాక్స్, ఫ్యూచర్లలో ’జేఎస్‌ గ్రూప్‌’ ఉదయం పెద్దయెత్తున కొనుగోళ్లు చేసి, సాయంత్రం భారీగా అమ్మేసేది. అలాగే ఎక్స్‌పైరీ రోజున ఆఖరు రెండు గంటల్లో సూచీలు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యేలా ఏదో ఒకదాన్ని భారీగా కొనడమో లేదా అమ్మడమో చేసేది. 

ఉదాహరణకు.. జేఎస్‌ గ్రూప్‌ ఉదయాన్నే కొన్ని ఎంపిక చేసుకున్న బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ షేర్లను భారీగా కొనేసేది. అదే సమయంలో ఇండెక్స్‌ ఆప్షన్స్‌ను షార్ట్‌ (అమ్మేయడం) చేసేది. ట్రేడింగ్‌ ముగిసే సమయం దగ్గరపడే కొద్దీ షేర్లను ఒక్కసారిగా అమ్మేసేది. దీంతో షేరు ధర పడిపోయేది. ఫలితంగా షేర్లపరంగా నష్టాలు వచ్చినప్పటికీ, సమాంతరంగా తీసుకున్న ఇండెక్స్‌ షార్ట్‌ ఆప్షన్లలో భారీగా లాభాలు వచ్చేవి.  దీనివల్ల, ఉదయం రూ. 10 దగ్గర ఉన్న ఆప్షన్‌.. సాయంత్రానికి ఎకాయెకిన  రూ.300–రూ. 400 అయిపోతుంది. లేదా అటుది ఇటవుతుంది. ఇలా ఎక్స్‌పైరీ రోజుల్లో ఇలా అసా ధారణ తీవ్ర ఒడిదుడుకులు ఏర్పడటంతో సాధారణ ట్రేడర్లు భారీగా నష్టపోతారు.  

వాల్యూమ్స్‌పై ప్రభావం.. 
జేన్‌ స్ట్రీట్‌పై సెబీ చర్యలను మార్కెట్‌ వర్గాలు స్వాగతించాయి. దీనితో చిన్న ట్రేడర్లకు కాస్త ఊరట లభించగలదన్నాయి. కాకపోతే ఆప్షన్స్‌ వాల్యూమ్స్‌పైనా ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని పేర్కొన్నాయి. ఆప్షన్స్‌ ట్రేడింగ్‌ వాల్యూమ్స్‌లో జేన్‌ స్ట్రీట్‌ లాంటి ట్రేడింగ్‌ సంస్థల వాటా దాదాపు 50 శాతం వరకు ఉంటుందని జిరోధా సహ వ్యవస్థాపకుడు నితిన్‌ కామత్‌ తెలిపారు. ఇలాంటి సంస్థలు వెనక్కి వెళ్లిపోతే దాదాపు రిటైల్‌ కార్యకలాపాలపైనా ప్రభావం పడొచ్చని వివరించారు. ఫలితంగా బిడ్‌–ఆస్క్‌ స్ప్రెడ్‌ (కొనుగోలు, అమ్మకం బిడ్ల మధ్య వ్యత్యాసం), తీవ్ర ఒడిదుడుకులు, అనిశ్చితి పెరిగిపోవచ్చన్నారు. ఇది ఇటు ఎక్సే్చంజీలకు, అటు బ్రోకర్లకు మంచి వార్త కాకపోవచ్చని పేర్కొన్నారు. ఇలాంటి పెద్ద సంస్థలపై మన మార్కెట్‌ ఎంతగా ఆధారపడిందనేది దీనితో తెలిసిపోతుందని కామత్‌ తెలిపారు.  

స్టాక్స్‌ కుదేలు.. 
జేఎస్‌ గ్రూప్‌పై సెబీ చర్యలతో ప్రతికూల ప్రభావం పడుతుందనే భయాలతో, విదేశీ సంస్థల ట్రేడింగ్‌ యాక్టివిటీ ఎక్కువగా ఉండే ప్లాట్‌ఫాంలు, సంస్థల షేర్లు శుక్రవారం గణనీయంగా క్షీణించాయి. బీఎస్‌ఈలో నువామా వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ షేరు 11.26%, స్టాక్‌ బ్రోకింగ్‌ సంస్థ ఏంజెల్‌ వన్‌ షేరు  6%, బీఎస్‌ఈ షేరు 6.42%, సెంట్రల్‌ డిపాజిటరీ సర్వీసెస్‌ (ఇండియా) 2.3% క్షీణించాయి. జేఎస్‌ గ్రూప్‌పై సెబీ చర్యలతో ఇన్వెస్టర్ల సెంటిమెంటు దెబ్బతిందని లెమన్‌ మార్కెట్స్‌ డెస్క్‌ అనలిస్ట్‌ గౌరవ్‌ గర్గ్‌ తెలిపారు.

ఏమిటీ జేన్‌ స్ట్రీట్‌..  
ఆర్థిక సేవల రంగానికి సంబంధించిన జేన్‌ స్ట్రీట్‌ గ్రూప్‌ 2000లో ట్రేడింగ్‌ సంస్థగా అమెరికాలో కార్యకలాపాలు ప్రారంభించింది. అమెరికాతో పాటు యూరప్, ఆసియాలోని 45 దేశాల్లో, 5 కార్యా లయాల్లో 2,600 మంది సిబ్బంది ఉన్నారు. 2020 డిసెంబర్‌లో ఇది భారత్‌లో కార్యకలాపాలు ఆరంభించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement