breaking news
escrow account
-
‘జేన్ స్ట్రీట్’ స్కామ్!
న్యూఢిల్లీ: దేశీ స్టాక్ మార్కెట్లలో అవకతవకలకు పాల్పడినందుకు గాను అమెరికన్ సంస్థ జేన్ స్ట్రీట్ (జేఎస్) గ్రూప్‌పై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ కొరడా ఝుళిపించింది. తదుపరి నోటీసులు ఇచ్చేంత వరకు ట్రేడింగ్ చేయకుండా గ్రూప్ సంస్థలపై నిషేధం విధించింది. అక్రమంగా ఆర్జించిన రూ. 4,843 కోట్ల మొత్తాన్ని ఎస్క్రో అకౌంటుకు బదిలీ చేయాలని ఆదేశించింది. స్టాక్ సూచీలను ప్రభావితం చేసి, జేఎస్ గ్రూప్ భారీగా లబ్ధి పొందిందనే ఆరోపణలపై చేపట్టిన విచారణలో భాగంగా సెబీ ఈ మేరకు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. జేన్ స్ట్రీట్ (జేఎస్) గ్రూప్‌లో భాగమైన జేఎస్ఐ ఇన్వెస్ట్మెంట్స్, జేఎస్ఐ2 ఇన్వెస్ట్మెంట్స్, జేన్ స్ట్రీట్ సింగపూర్, జేన్ స్ట్రీట్ ఏషియా ట్రేడింగ్ సంస్థలకు ఇవి వర్తిస్తాయి. 2023 జనవరి–2025 మే మధ్య కాలంలో 21 ఎక్స్పైరీ తేదీల్లో సూచీలను ప్రభావితం చేసే విధంగా క్యాష్, ఫ్యూచర్స్ మార్కెట్లో గ్రూప్ పెద్ద ఎత్తున ట్రేడింగ్ చేసినట్లు, తద్వారా ఆప్షన్స్ మార్కెట్లో పొజిషన్లతో భారీగా లాభాలు ఆర్జించినట్లు సెబీ విచారణలో తేలింది. జేన్ స్ట్రీట్, దాని అనుబంధ సంస్థలు భారతీయ ఆప్షన్స్ మార్కెట్లో అనధికారిక ట్రేడింగ్ వ్యూహాలు అమలు చేస్తున్నాయంటూ 2024 ఏప్రిల్‌లో మీడియాలో వార్తలు రావడం ఈ కేసుకు బీజం వేశాయి. ఎక్స్పైరీ రోజు దగ్గరపడే సమయంలో, ఇండెక్స్ తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యేలా, జేఎస్ గ్రూప్ సందేహాస్పద ట్రేడింగ్ లావాదేవీలు నిర్వహిస్తోందని సెబీ గుర్తించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో హెచ్చరికలు జారీ చేసినప్పటికీ, ఇలాంటివి చేయబోమంటూ ఎన్ఎస్ఈకి హామీ ఇచ్చినప్పటికీ గ్రూప్ సంస్థలు తమ తీరును మార్చుకోలేదని ఉత్తర్వుల్లో సెబీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘2025లో ఎన్ఎస్ఈ జారీ చేసిన అడ్వైజరీని కూడా పట్టించుకోకుండా, లెక్కలేనితనాన్ని ప్రదర్శిస్తూ జేఎస్ గ్రూప్ వ్యవహరించిన తీరు చూస్తే, మిగతా ఎఫ్‌పీఐలు, మార్కెట్ వర్గాల్లాగా, అది నమ్మతగినది కాదని అర్థం అవుతోంది. గతంలోలాగే లావాదేవీలు కొనసాగించేందుకు జేఎస్ గ్రూప్‌ను అనుమతిస్తే ఇన్వెస్టర్ల ప్రయోజనాలకు కచ్చితంగా భంగం వాటిల్లుతుందని ప్రాథమిక సాక్ష్యాధారాలు కనిపిస్తున్నాయి’’ అని సెబీ వ్యాఖ్యానించింది. నిబంధనలను ఉల్లంఘిస్తూ జేఎస్ గ్రూప్ అక్రమంగా ఆర్జించిన రూ. 4,843.57 కోట్ల మొత్తాన్ని ఎస్క్రో అకౌంటుకు బదిలీ చేయాలని ఆదేశించింది. ఉత్తర్వులకు సంబంధించినవి అయితే తప్ప, తమ అనుమతి లేకుండా, జేఎస్ గ్రూప్ సంస్థల ఖాతాల్లో ఎలాంటి డెబిట్ లావాదేవీలను జరగనివ్వరాదంటూ బ్యాంకులకు సెబీ ఆదేశాలు ఇచ్చింది. ఇతరత్రా సూచీల్లోనూ జేఎస్ గ్రూప్ ట్రేడింగ్ లావా దేవీలపై సెబీ విచారణ చేపడుతోంది. సెబీ ఉత్తర్వుల ప్రకారం ఇండెక్స్, స్టాక్ ఆప్షన్లలో ట్రేడింగ్ ద్వారా జేఎస్ గ్రూప్ రూ.44,358 కోట్లు ఆర్జించింది. స్టాక్ ఫ్యూచర్స్‌లో రూ.7,208 కోట్లు, ఇండెక్స్ ఫ్యూచర్స్‌లో రూ. 191 కోట్లు, క్యాష్ సెగ్మెంట్లో రూ. 288 కోట్లు నష్టపోయింది. దీంతో 2023 జనవరి–2025 మార్చి మధ్య మొత్తం మీద రూ.36,671 కోట్లు అక్రమంగా ఆర్జించింది. ఏం చేసింది.. ఎలా చేసింది..స్టాక్ మార్కెట్లో లిక్విడిటీ ఎక్కువగా ఉండే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ ఆప్షన్స్ సెగ్మెంట్స్‌లో ట్రేడింగ్ ద్వారా సూచీలను ప్రభావితం చేసి, దాన్నుంచి లాభాలు పొందిందని జేఎస్ గ్రూప్‌పై ఆరోపణలు ఉన్నాయి. ఇందుకోసం అది రెండు కీలక వ్యూహాలు అమలు చేసిందని సెబీ విచారణలో వెల్లడైంది. దీని ప్రకారం, బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్, ఫ్యూచర్లలో ’జేఎస్ గ్రూప్’ ఉదయం పెద్దయెత్తున కొనుగోళ్లు చేసి, సాయంత్రం భారీగా అమ్మేసేది. అలాగే ఎక్స్పైరీ రోజున ఆఖరు రెండు గంటల్లో సూచీలు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యేలా ఏదో ఒకదాన్ని భారీగా కొనడమో లేదా అమ్మడమో చేసేది. ఉదాహరణకు.. జేఎస్ గ్రూప్ ఉదయాన్నే కొన్ని ఎంపిక చేసుకున్న బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ షేర్లను భారీగా కొనేసేది. అదే సమయంలో ఇండెక్స్ ఆప్షన్స్‌ను షార్ట్ (అమ్మేయడం) చేసేది. ట్రేడింగ్ ముగిసే సమయం దగ్గరపడే కొద్దీ షేర్లను ఒక్కసారిగా అమ్మేసేది. దీంతో షేరు ధర పడిపోయేది. ఫలితంగా షేర్లపరంగా నష్టాలు వచ్చినప్పటికీ, సమాంతరంగా తీసుకున్న ఇండెక్స్ షార్ట్ ఆప్షన్లలో భారీగా లాభాలు వచ్చేవి. దీనివల్ల, ఉదయం రూ. 10 దగ్గర ఉన్న ఆప్షన్.. సాయంత్రానికి ఎకాయెకిన రూ.300–రూ. 400 అయిపోతుంది. లేదా అటుది ఇటవుతుంది. ఇలా ఎక్స్పైరీ రోజుల్లో ఇలా అసా ధారణ తీవ్ర ఒడిదుడుకులు ఏర్పడటంతో సాధారణ ట్రేడర్లు భారీగా నష్టపోతారు. వాల్యూమ్స్‌పై ప్రభావం.. జేన్ స్ట్రీట్‌పై సెబీ చర్యలను మార్కెట్ వర్గాలు స్వాగతించాయి. దీనితో చిన్న ట్రేడర్లకు కాస్త ఊరట లభించగలదన్నాయి. కాకపోతే ఆప్షన్స్ వాల్యూమ్స్‌పైనా ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని పేర్కొన్నాయి. ఆప్షన్స్ ట్రేడింగ్ వాల్యూమ్స్‌లో జేన్ స్ట్రీట్ లాంటి ట్రేడింగ్ సంస్థల వాటా దాదాపు 50 శాతం వరకు ఉంటుందని జిరోధా సహ వ్యవస్థాపకుడు నితిన్ కామత్ తెలిపారు. ఇలాంటి సంస్థలు వెనక్కి వెళ్లిపోతే దాదాపు రిటైల్ కార్యకలాపాలపైనా ప్రభావం పడొచ్చని వివరించారు. ఫలితంగా బిడ్–ఆస్క్ స్ప్రెడ్ (కొనుగోలు, అమ్మకం బిడ్ల మధ్య వ్యత్యాసం), తీవ్ర ఒడిదుడుకులు, అనిశ్చితి పెరిగిపోవచ్చన్నారు. ఇది ఇటు ఎక్సే్చంజీలకు, అటు బ్రోకర్లకు మంచి వార్త కాకపోవచ్చని పేర్కొన్నారు. ఇలాంటి పెద్ద సంస్థలపై మన మార్కెట్ ఎంతగా ఆధారపడిందనేది దీనితో తెలిసిపోతుందని కామత్ తెలిపారు. స్టాక్స్ కుదేలు.. జేఎస్ గ్రూప్‌పై సెబీ చర్యలతో ప్రతికూల ప్రభావం పడుతుందనే భయాలతో, విదేశీ సంస్థల ట్రేడింగ్ యాక్టివిటీ ఎక్కువగా ఉండే ప్లాట్‌ఫాంలు, సంస్థల షేర్లు శుక్రవారం గణనీయంగా క్షీణించాయి. బీఎస్ఈలో నువామా వెల్త్ మేనేజ్మెంట్ షేరు 11.26%, స్టాక్ బ్రోకింగ్ సంస్థ ఏంజెల్ వన్ షేరు 6%, బీఎస్ఈ షేరు 6.42%, సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ (ఇండియా) 2.3% క్షీణించాయి. జేఎస్ గ్రూప్‌పై సెబీ చర్యలతో ఇన్వెస్టర్ల సెంటిమెంటు దెబ్బతిందని లెమన్ మార్కెట్స్ డెస్క్ అనలిస్ట్ గౌరవ్ గర్గ్ తెలిపారు.ఏమిటీ జేన్ స్ట్రీట్.. ఆర్థిక సేవల రంగానికి సంబంధించిన జేన్ స్ట్రీట్ గ్రూప్ 2000లో ట్రేడింగ్ సంస్థగా అమెరికాలో కార్యకలాపాలు ప్రారంభించింది. అమెరికాతో పాటు యూరప్, ఆసియాలోని 45 దేశాల్లో, 5 కార్యా లయాల్లో 2,600 మంది సిబ్బంది ఉన్నారు. 2020 డిసెంబర్లో ఇది భారత్‌లో కార్యకలాపాలు ఆరంభించింది. -
48 గంటల్లో రూ. 2,750 కోట్లు డిపాజిట్ చేయండి
ముంబై: రిలయన్స్ క్యాపిటల్ (ఆర్‌క్యాప్) పరిష్కార ప్రణాళికకు సంబంధించి 48 గంటల్లోగా రూ. 2,750 కోట్ల మొత్తాన్ని ఎస్క్రో ఖాతాలో జమ చేయాల్సిందిగా ఇండస్ఇండ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ (ఐఐహెచ్ఎల్)ను నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఆదేశించింది. ఈ ఖాతాపై వచ్చే వడ్డీ, రుణదాతల కమిటీకే (సీవోసీ) చెందుతుందని స్పష్టం చేసింది. వివరాల్లోకి వెడితే.. రుణాల చెల్లింపులో విఫలమైన ఆర్‌క్యాప్ దివాలా చట్టం కింద చర్యలు ఎదుర్కొంటోంది. సంస్థను కొనుగోలు చేసేందుకు దివాలా పరిష్కార ప్రణాళిక కింద రూ. 9,661 కోట్లు ఆఫర్ చేసిన హిందుజా గ్రూప్ సంస్థ ఐఐహెచ్ఎల్ .. బిడ్డింగ్‌లో విజేతగా నిలి్చంది. ఇందులో రూ. 2,750 కోట్ల మొత్తాన్ని రుణదాతల కమిటీ ఖాతాలోకి డిపాజిట్ చేయాలంటూ జూలై 23న ఐఐహెచ్ఎల్ని ఎన్సీఎల్టీ ముంబై బెంచ్ ఆదేశించింది. అయితే, ఇందుకు సంబంధించిన ప్రణాళిక అమలుకు గడువు పెంచుతూ ఆదేశాల్లో కొన్ని సవరణలు చేయాలంటూ కంపెనీ కొత్తగా దాఖలు చేసిన పిటీషన్‌పై విచారణ సందర్భంగా ఎన్సీఎల్టీ తాజా ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే మరో రూ. 7,300 కోట్ల నిధుల సమీకరణ వివరాలను కూడా పర్యవేక్షణ కమిటీకి తెలియజేయాలంటూ సూచించింది. మరోవైపు, ఎన్సీఎల్టీ ఆదేశించినట్లుగా రూ. 2,750 కోట్ల మొత్తాన్ని సీవోసీ ఖాతాల్లో డిపాజిట్ చేయకుండా ఆ మొత్తాన్ని తన సొంత ఖాతాలోనూ, ప్రమోటర్ల ఖాతాలోనూ జమ చేసుకుందని దివాలా పరిష్కార నిపుణుడు ఆరోపించారు. అయితే, ఎస్క్రో ఖాతా వివరాలను సీవోసీ ఇవ్వనందువల్లే అలా చేయాల్సి వచి్చందని ఐఐహెచ్ఎల్ వివరణ ఇచి్చంది. -
‘కోకాపేట డబ్బులు’ ఎస్క్రో ఖాతాలో ఉంచేలా ఆదేశిస్తాం
సాక్షి, హైదరాబాద్: జీవో 111 పరిధికి సంబంధించి హైపవర్ కమిటీ అధ్యయనం చేసి నివేదిక ఇచ్చేందుకు మరో రెండు నెలల సమయం ఇవ్వాలన్న రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండు నెలలు కాదు రెండేళ్లయినా సమయం ఇస్తామని, అయితే నివేదిక ఇచ్చేవరకూ ఇటీవలి కోకాపేట భూముల వేలానికి సంబం ధించిన డబ్బును ఎస్క్రో (మూడవ పార్టీ) బ్యాంకు ఖాతాలో ఉంచేలా ఆదేశాలు ఇస్తామని స్పష్టం చేసింది. అలాగే వేలం వేసిన భూముల్లో మురుగునీటి శుద్ధి కేంద్రం (ఎస్టీపీ), ఇతర మౌలిక వసతులు కల్పించే వరకూ, అలాగే హైపవర్ కమిటీ నివేదిక సమర్పించే వరకు ఈ డబ్బును ము ట్టడానికి వీల్లేదని తేల్చిచెప్పింది. ఆ భూముల్లో ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదని కూడా పే ర్కొంది. ఈ అంశాలపై ప్రభుత్వ అభిప్రాయం చెప్పాలని అదనపు అడ్వొకేట్ జనరల్ జె.రామచందర్రావును ఆదేశించింది. ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ రిజర్వాయర్లకు సమీపంలోని 84 గ్రామాల్లో భారీ నిర్మా ణాలు చేపట్టకూడదని జీవో 111 స్పష్టం చేస్తోంది. ఈ జీవో నుంచి వట్టినాగులపల్లిలోని కొన్ని సర్వే నంబర్లను తొలగించాలంటూ దాఖలైన పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమకోహ్లీ, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం బుధవారం మరోసారి విచారించింది. సీఎం అలా చెప్పలేదు... ‘జీవో 111ను ఉపసంహరించుకుంటామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మీడియాకు చెప్పలేదు. ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. హైపవర్ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆ విషయాన్ని రాయకుండా మీడియా ఇతర విషయాలను ప్రస్తావించింది. వీలైనంత త్వరగా కమిటీ నివేదిక సమర్పి స్తుంది. మరో రెండు నెలలు ఆగితే కమిటీ నివేదిక వస్తుంది. అప్పటివరకు సమయం ఇవ్వండి’అని ధర్మాసనాన్ని ఏఏజీ అభ్యర్థించారు. 2 నెలల్లో ఇస్తామంటే ఎలా నమ్మాలి? ‘జీవో 111 పరిధిని నిర్ణయించాలంటూ 2006లో ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ రీసర్చ్ అండ్ ట్రై నింగ్ సెంటర్ (ఈపీటీఆర్ఐ)ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. దీంతో వట్టినాగులపల్లిలోని కొన్ని సర్వే నంబర్లు క్యాచ్మెంట్ ఏరియాలో లేవని, వాటిని జీవో 111 పరిధి నుంచి తొలగించవచ్చని ఈపీటీఆర్ఐ నివేదిక ఇచ్చింది. అయితే జీవో 111 పరిధిపై అధ్యయనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2016లో హైపవర్ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఇచ్చిన జీవోలో 45 రోజుల్లో నివేదిక ఇవ్వాలని పేర్కొంది. ఏళ్లు గడిచినా ఇప్పటికీ ఆ కమిటీ నివేదిక ఇవ్వలేదు. పనిచేయని ఇటువంటి కమిటీలను వెంటనే రద్దు చేయాలి. ఇన్నేళ్లు పట్టనట్లుగా వ్యవహరించి ఇప్పుడు రెండు నెలల్లో నివేదిక ఇస్తామంటే ఎలా నమ్మాలి?..’అని ధర్మాసనం నిలదీసింది. తమ షరతులకు రాష్ట్ర ప్రభుత్వం సమ్మతిస్తే రెండు నెలల సమయం ఇవ్వడానికి అభ్యంతరం లేదని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయం చెప్పేందుకు సోమవారం వరకు గడువు ఇవ్వాలని ఏఏజీ అభ్యర్థించగా.. నిరాకరిస్తూ విచారణను గురువారానికి వాయిదా వేసింది. -
ప్రతి ప్రాజెక్ట్కూ ప్రత్యేక ఖాతా!
• ఎస్క్రో అకౌంట్ ఉండాలంటున్న స్థిరాస్తి నియంత్రణ బిల్లు • నిధుల పక్కదారికి చాన్సే లేదు; దీంతో సకాలంలో నిర్మాణం పూర్తి • కానీ, నగరంలో ఖాతా నిర్వహించే బిల్డర్లు తక్కువే • ఎస్క్రో ఖాతా నిర్వహించే సంస్థల్లోనే కొనుగోళ్లు మంచిది: నిపుణులు ‘‘ప్రతి స్థిరాస్తి ప్రాజెక్ట్కూ ప్రత్యేక బ్యాంక్ ఖాతా (ఎస్క్రో)ను తెరవాలి. కొనుగోలుదారుల నుంచి వసూలు చేసే సొమ్ములో 70 శాతాన్ని 15 రోజుల్లోగా ఈ ఖాతాలో జమ చేయాలి’’ .. ఇదీ స్థిరాస్తి నియంత్రణ బిల్లు (రెరా)లోని ఓ నిబంధన. కానీ, భాగ్యనగరంలో ఈ నిబంధనను ఫాలో అయ్యే బిల్డర్లను వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. ఎందుకంటే మనోళ్లు కొనుగోలుదారుల నుంచి వసూలు చేసిన సొమ్మును మళ్లించడంలో సిద్ధహస్తులు కదా! ఇంతకీ ఎస్క్రో ఖాతా అంటే ఏంటి? ఈ ఖాతాతో కొనుగోలుదారులకు ఒరిగే ప్రయోజనాలేంటో వివరించేదే ‘సాక్షి రియల్టీ’ ఈ వారం ప్రత్యేక కథనం!! సాక్షి, హైదరాబాద్ : స్థిరాస్తి రంగంలో పెట్టుబడులు ఎంత సురక్షితమో.. ఏమరపాటుగా ఉంటే నష్ట భయం కూడా అంతే! అందుకే ప్రతి అంశాన్ని పక్కాగా పరిశీలించాకే ముందడుగు వేయాలి. భవిష్యత్తు దృష్ట్యా ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేవారి సంఖ్య ఎలా అరుుతే పెరుగుతుందో.. అలాగే కొనుగోళ్ల సమయంలో రకరకాల సమస్యలూ ఎదురవుతున్నారుు కస్టమర్లకు. గత కొంతకాలం నుంచి దేశ వ్యాప్తంగా వేలాదిమంది కస్టమర్లు తమ కలల గృహం ఆలస్యం కావటం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్‌లో అరుుతే తెల్లాపూర్‌లో ఆకాశహర్మ్యాల నిర్మాణమంటూ భారీ ప్రచారం చేసి కస్టమర్లను నట్టేట ముంచింది ఓ సంస్థ. కొనుగోలుదారులు చేసే చెల్లింపులను మరో ప్రాజెక్ట్‌కు లేదా వ్యక్తిగత అవసరాలు లేదా ఇతర పనులకు వినియోగించడం వల్లే ఈ పరిస్థితి నెలకొంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి సంస్థలు నగరంలో కోకొల్లలు. ఇలాంటి డెవలపర్లను నియంత్రించడం కొనుగోలుదారుల వల్ల అయ్యే పనికాదు. అలాగే సకాలంలో ఫ్లాట్లను అందించేలా చేయనూ లేరు. నిర్మాణంలో జాప్యాన్ని తగ్గించేందుకు, పారదర్శకంగా నిధులను వినియోగించేందుకు అవసరమయ్యేదే ‘‘ఎస్క్రో ఖాతా’’! ఎస్క్రో ఖాతా అంటే.. ప్రతి ప్రాజెక్ట్‌కు ప్రత్యేకంగా బ్యాంక్ ఖాతాను నిర్వహించడమే ఎస్క్రో ఖాతా. ఇందులో జమయ్యే సొమ్మును పూర్తిగా ఆ ప్రాజెక్ట్ నిర్మాణ పనుల కోసమే వినియోగించేలా చేయడమే ఈ ఖాతా ప్రధాన లక్ష్యం. ఇది తాత్కాలిక ఖాతా. ప్రాజెక్ట్ పూర్తిగా డెలివరీ అరుు నిరభ్యంతర ధృవీకరణ పత్రం (ఎన్ఓసీ) వచ్చేంతవరకూ ఈ ఖాతా నిర్వహణలో ఉంటుంది. ఎస్క్రో ఖాతాను తెరవాలంటే బిల్డర్ బ్యాంకుతో ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ఖాతా లావాదేవీలను పర్యవేక్షించడానికి ఓ ట్రస్టీని నియమిస్తారు. ఖాతాలోని నిధుల్ని నిర్మాణ పనులకే వాడుతున్నారా? లేదా? అన్నది పర్యవేక్షించడం ఇతని విధి. ఒకవేళ నిధులు అవసరమైతే ట్రస్టీ అనుమతితో ఖాతాలోని 70 శాతం సొమ్మును వినియోగించుకునే వీలుంటుంది. కస్టమర్లకు ఏం లాభం.. ఎస్క్రో ఖాతా నిబంధనల ప్రకారం బిల్డర్ నిధుల్ని దుర్వినియోగం చేయడానికి, మళ్లించడానికి అవకాశం లేదు. ఇదే సొమ్ముతో కొత్తగా వేరే ప్రాంతంలో భూములను కొనుగోలు చేయాలన్నా కూడా కుదరదు. నిధుల సక్రమ వినియోగంతో గడువులోగా ప్రాజెక్ట్ పూర్తవుతుంది. ఒకవేళ కస్టమర్లు కావాలనుకుంటే ఖాతాలోని సొమ్మును వడ్డీతో సహా వెనక్కి తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. ‘‘ఫ్లాట్ కొనేటప్పుడు ప్రతి ఒక్కరూ బిల్డర్లను ఎస్క్రో ఖాతాను నిర్వహిస్తున్నారా? లేదా? అని ప్రశ్నించాలి. సరైన జవాబు వచ్చిందా ఓకే. లేకపోతే సదరు బిల్డర్ ఎస్క్రో ఖాతాను నిర్వహించడం లేదని అర్థం. ఇక ఆ బిల్డర్ వద్ద ఫ్లాట్ కొనాలా? వద్దా? అనేది ఎవరికి వారే నిర్ణరుుంచుకోవాల్సిన విషయమని’’ నిపుణులు సూచిస్తున్నారు. నగరంలోని బిల్డర్ల పరిస్థితి.. సాధారణంగా మౌలిక సదుపాయాల సంస్థలు ఎస్క్రో ఖాతాను ఎక్కువగా నిర్వహిస్తుంటారుు. అమెరికా, ఆస్ట్రేలియా, దుబాయ్ వంటి దేశాల్లో స్థిరాస్తి లావాదేవీలన్నీ ఎస్క్రో ఖాతాలోనే జమ అవుతుంటారుు. తాజాగా కేంద్రం తీసుకొచ్చిన స్థిరాస్తి నియంత్రణ బిల్లులో ప్రతి నిర్మాణ సంస్థ ప్రతి ప్రాజెక్ట్‌కు ప్రత్యేకంగా ఎస్క్రో ఖాతాను ప్రారంభించానే నిబంధనను పెట్టింది. పైగా ఎస్క్రో ఖాతాలను ఆరంభించేలా నిర్మాణ సంస్థలపై ఒత్తిడి తేవాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది కూడా. -
బీఓఆర్ మాజీ ప్రమోటర్లపై సెబీ కఠిన చర్యలు
ముంబై: ఇన్సైడర్ ట్రేడింగ్ కేసుకు సంబంధించి బ్యాంక్ ఆఫ్ రాజస్తాన్ మాజీ ప్రమోటర్ల కుటుంబాలకు సంబంధమున్న ఏడు సంస్థలు చట్టవిరుద్ధంగా ఆర్జించిన రూ. 1.6 కోట్ల లాభాలను జప్తు చేయాలని స్టాక్‌మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆదేశించింది. నిర్దేశిత మొతా ్తన్ని ఎస్క్రో ఖాతాలో జమచేసేంత వరకూ ఈ ఏడుగురు వ్యక్తులు/సంస్థలు ఎటువంటి ఆస్తులు, సెక్యూరిటీలు విక్రయించరాదని పేర్కొంది. అలాగే తమ ఆస్తుల వివరాలను 7 రోజుల్లోగా సమర్పించాలని సూచించింది. ఆయా వ్యక్తులు/ సంస్థల బ్యాంకు ఖాతాలు, డీమ్యాట్ అకౌంట్ల నుంచి డెబిట్ లావాదేవీలేవీ జరగకుండా చూడాలని అన్ని బ్యాంకులు, డిపాజిటరీలకు ఆదేశాలు జారీ చేసింది. సెబీ చర్యలు ఎదుర్కొంటున్న వారిలో రోహిత్ ప్రేమ్‌కుమార్ గుప్తా, సంజయ్ కుమార్ తయాల్, నవీన్ కుమార్ తయాల్, జ్యోతికా సంజయ్ తయాల్, కుల్విందర్ కుమార్ నయ్యర్, ఆజం మొహమ్మద్ అషాన్ షేఖ్‌తో పాటు అద్విక్ టెక్స్టైల్స్, రియల్ప్రో సంస్థలు ఉన్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్‌తో బీవోఆర్ విలీన ఒప్పంద సమయంలో బ్యాంక్ ఆఫ్ రాజస్తాన్ షేర్లు గణనీయంగా పెరగడం, ఇందులో ఇన్సైడర్ ట్రేడింగ్ కోణం ఉండొచ్చన్న అనుమానాల దరిమిలా విచారణ జరిపిన సెబీ తాజా ఆదేశాలు ఇచ్చింది.