వాట్సప్‌లో కొత్తమోసాలు.. జాగ్రత్తసుమా! | Sakshi
Sakshi News home page

వాట్సప్‌లో కొత్తమోసాలు.. జాగ్రత్తసుమా!

Published Thu, Feb 8 2024 9:23 AM

Scammers Approach People In WhatsApp With Diff Manner - Sakshi

రోజురోజుకు టెక్నాలజీ పెరుగుతోంది. దానికితోడు ఆన్‌లైన్‌ మోసాలు అధికమవుతున్నాయి. సామాన్యులు, చదువురానివారు, బాగా చదువుకున్నవారు, పేదవారు, ధనికులు అనే తేడా లేకుండా దాదాపు అన్ని వర్గాల ప్రజలు సైబర్‌దాడికి బలవుతున్నవారే. అయితే వీటన్నింటికి ప్రధాన కారణం వాట్సప్‌.

ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాక దాదాపు గరిష్ఠకాలం వాట్సప్‌లోనే గడుపుతుంటాం. అందులో వివిధ వ్యక్తులతో అన్ని వివరాలు చర్చించుకుంటాం. గోప్యంగా ఉండాల్సిన చాలా వివరాలు స్కామర్లు తెలుసుకుని ఆర్థికంగా, వ్యక్తిగతంగా, సామాజికంగా మనల్ని వేదిస్తే చాల ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకోసం కొన్ని జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

వాట్సప్‌కాల్స్‌తో జాగ్రత్త..
తెలియని నంబర్ల నుంచి సైబర్‌ నేరస్థులు నేరుగా కాకుండా వాట్సప్‌లో మిస్డ్‌ కాల్‌ చేస్తుంటారు. సాధారణంగా అయితే కాల్‌ లిఫ్ట్‌ చేసేంతవరకు రింగ్‌ అవుతుంది కదా. ఈ స్పామ్‌ కాల్స్‌ రెండు మూడు రింగ్‌ల తరువాత కాల్‌ కట్‌ అవుతుంది. అన్‌నోన్‌ నంబర్ల నుంచి కాల్స్‌ వస్తే ఈ విషయాన్ని గ్రహించాలని చెబుతున్నారు. హ్యాకర్స్‌ యాక్టివ్‌ వినియోగదారులను గుర్తించేందుకు ఇలా మిస్డ్‌ కాల్స్‌ చేస్తుంటారని బ్యూరో ఆఫ్‌ పోలీస్‌ అండ్‌ రిసెర్చ్‌(బీపీఆర్‌డీ) పేర్కొంది. 

నిరుద్యోగులకు ఎర..
ఏటా పెరుగుతున్న నిరుద్యోగం ఒక సమస్య అయితే. వారిని సైబర్‌ నేరస్థులు ట్రాప్‌ చేసి వేదింపులకు గురిచేయడం మరో సమస్యగా మారుతుంది. నిరుద్యోగులకు గుర్తించి స్కామర్లు వారికి వాట్సప్‌లో మెసేజ్‌లు పంపుతారు. అప్పటికే ఎన్నో ఒత్తిడులతో ఉన్న నిరుద్యోగులు వాటిని నమ్మి వాటికి రిప్లై ఇస్తున్నారు. దాంతో మన ఫోన్‌లోని వివరాలు వారికి చేరుతున్నాయి.

ఫుల్‌ టైమ్‌, పార్ట్‌ టైమ్‌, వర్క్‌ ఫ్రం హోమ్‌ ఉద్యోగాల పేరిట విభిన్ని ఖాతాల నుంచి ఇలాంటి సందేశాలు వస్తుంటాయి. వీటిని నమ్మొద్దని నిపుణులు చెబుతున్నారు. ఏదైనా అవసరమై వివరాలు పంపించాల్సి వస్తే క్రెడబిలిటీ ఉన్న ఆఫిషియల్‌ వెబ్‌సైట్‌ లింక్‌ ద్వారా సమాచారం ఇవ్వాలంటున్నారు. ఏదైనా ఇంటర్వ్యూకు హాజరవ్వాలంటే వీలైతే నేరుగా వెళ్లి కలిసి సదరు కంపెనీలతో మాట్లాడాలని సూచిస్తున్నారు. 

బ్యాంక్‌ వివరాలు చోరీ..
వాట్సప్‌లో వీడియోకాల్‌ మాట్లాడుతున్నప్పుడు స్క్రీన్‌ షేరింగ్‌ ఆప్షన్‌ వస్తుంది. ఈ ఫీచర్‌ను ఇటీవలే అందుబాటులోకి తెచ్చారు. ఈ ఫీచర్‌లో భాగంగా తమ స్క్రీన్‌ను అవతలి వ్యక్తి ఉపయోగించే వీలుంటుంది. దీన్ని ఆసరాగా తీసుకొని సైబర్‌ నేరస్థులు బాధితుడి బ్యాంకు ఖాతాల వివరాలు, గోప్యమైన సమాచారాన్ని సేకరిస్తున్నారు. అనంతరం ఖాతాలోని డబ్బు కొల్లగొడుతున్నారు. 

ఇదీ చదవండి: 20 లక్షల మందికి ఏఐలో శిక్షణ

ట్రేడింగ్‌ సలహాలతో..
కరోనా తర్వాత మార్కెట్‌లు భారీగా ర్యాలీ అయ్యాయి. దాంతో ఆ లాభాలు చూపించి సామాన్యులకు ఎరవేస్తున్నారు. ట్రేడింగ్‌లో నైపుణ్యం కలిగిన వ్యక్తులమంటూ పలువురు వాట్సప్‌లో మెసేజ్‌లు చేస్తున్నారు. తమ సలహాలు పాటిస్తే లాభాలు పొందవచ్చని నమ్మిస్తున్నారు. గూగుల్‌ ప్లేస్టోర్‌లో లేని అనధికారిక అప్లికేషన్‌ లింక్‌లను పంపించి దానిలో ఖాతా తెరిపించి పెట్టుబడులు పెట్టేలా ప్రేరేపిస్తున్నారు. ప్రారంభంలో వినియోగదారులకు కొంత లాభాలు చూపించి, పెద్దమొత్తంలో పెట్టుబడులు పెట్టాకా ఖాతాలో డబ్బు కొట్టేస్తున్నారు.

Advertisement
 
Advertisement