ఖాతాదారులకు భారీ షాక్‌, రుణాలపై స్పందించిన ఎస్‌బీఐ చైర్మన్‌ ఖారా!

Sbi Said It Expects To Sustain Credit Growth 15 Per Cent In The Current Fiscal - Sakshi

ప్రభుత్వ రంగ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) రుణాలపై వడ్డీ రేట్లను 50 బేసిస్‌ పాయింట్ల (అర శాతం) వరకూ పెంచింది. దీంతో రుణగ్రహీతలు నెలవారీగా చెల్లించే వాయిదాల (ఈఎంఐ) భారం మరింత పెరగనుంది. కొత్త రేట్లు ఆగస్టు 15 నుంచి వర్తిస్తాయని బ్యాంకు వెల్లడించింది. 

ఈ సందర్భంగా వడ్డీ రేట్లు పెరుగుతున్నప్పటికీ రిటైల్, కార్పొరేట్‌ లోన్‌లకు డిమాండ్‌ నెలకొన్న నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 15 శాతం మేర రుణ వృద్ధిని సాధించగలమని అంచనా వేస్తున్నట్లు ఎస్‌బీఐ చైర్మన్‌ దినేశ్‌ ఖారా తెలిపారు. జూన్‌ 30తో ముగిసిన త్రైమాసికంలో రుణాల వృద్ధి గతేడాది ఇదే వ్యవధితో పోలిస్తే రూ.25,23,793 కోట్ల నుంచి 14.93 శాతం పెరిగి రూ.29,00,636 కోట్లకు పెరిగినట్లు ఆయన పేర్కొన్నారు.

ఇందులో రిటైల్‌ రుణాలు సుమారు 19 శాతం, కార్పొరేట్‌ రుణాలు 11 శాతం మేర పెరిగాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో కార్పొరేట్‌ రుణాలు రూ.2.5–3 లక్షల కోట్లకు పెరిగే అవకాశం ఉందని, చిన్న.. మధ్య తరహా సంస్థల (ఎస్‌ఎంఈ) నుంచి కూడా రుణాలకు డిమాండ్‌ నెలకొందని ఖరా వివరించారు. త్వరలో మరిన్ని కొత్త ఫీచర్లతో యోనో 2.0 యాప్‌ను ప్రవేశపెట్టనున్నట్లు విశ్లేషకులతో సమావేశంలో ఆయన తెలిపారు. 

యోనోలో ఇప్పటివరకూ నమోదు చేసుకున్న వారి సంఖ్య 5.25 కోట్లకు చేరిందని పేర్కొన్నారు. కొత్త సేవింగ్స్‌ ఖాతాల్లో 65 శాతం అకౌంట్లను యోనో ద్వారానే తెరుస్తున్నట్లు ఖారా వివరించారు. ప్రభుత్వాలు భారీగా టీకాల కార్యక్రమం నిర్వహించడంతో కరోనా మహమ్మారి చాలా మటుకు అదుపులోకి వచ్చిందని..ఆంక్షల తొలగింపుతో ఎకానమీ మెరుగుపడుతోందని ఆయన చెప్పారు.

చదవండి👉 ఎస్‌బీఐ:'హాయ్‌' చెప్పండి..వాట్సాప్‌లో బ్యాంక్‌ సేవల్ని పొందండి!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top