Satish Malhotra: మనసున్న సీఈవో! ఉద్యోగుల కోసం ఏం చేశాడో తెలుసా?

Satish Malhotra CEO Reduced Salary for Employees Salary Hikes - Sakshi

ప్రపంచవ్యాప్తంగా ఓవైపు లేఆఫ్‌లు.. మరోవైపు తక్కువ జీతాలతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. చాలా కంపెనీల్లో జీతాల పెంపు లేక ఎంప్లాయీస్‌ అవస్థలు పడుతున్న తరుణంలో ఓ కంపెనీ సీఈవో తీసుకున్న నిర్ణయం సర్వత్రా ప్రశంసలు అందుకుంటోంది. ఇంతకీ ఆయన తీసుకున్న నిర్ణయం ఏమిటో తెలుసుకుందాం..

సతీష్ మల్హోత్రా (Satish Malhotra).. అమెరికన్ స్పెషాలిటీ రిటైల్ చైన్ కంపెనీ ‘ది కంటైనర్ స్టోర్‌’కు సీఈవో (CEO). తమ కంపెనీలోని ఇతర ఉద్యోగులకు వేతనాల పెంపునకు, ఖర్చులను తగ్గించడంలో సహాయపడటానికి తన జీతాన్ని స్వచ్ఛందంగా 10 శాతం తగ్గించుకున్నారు. సతీష్ 2021 ఫిబ్రవరి నుంచి కంపెనీ సీఈవోగా ఉన్నారు. గతంలో ఆయన ప్రపంచ ప్రఖ్యాత కాస్మెటిక్స్ చైన్ సెఫోరాలో 20 ఏళ్లు పనిచేశారు.

ఫార్చ్యూన్ నివేదిక ప్రకారం.. ఆరు నెలల కాలానికి మల్హోత్రా వార్షిక జీతం 925,000 డాలర్ల (రూ. 7.68 కోట్లు) నుంచి 8,32,500 డాలర్లకు (రూ. 6.9 కోట్లు) తగ్గుతుందని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్‌ ఫైలింగ్‌లో కంపెనీ పేర్కొంది.

 

కాగా గత సంవత్సరం మల్హోత్రా 2.57 మిలియన్ డాలర్ల (రూ. 21.35 కోట్లు) వేతన పరిహారాన్ని అందుకున్నారు. అయితే ఉద్యోగులకు సగటు పెంపుదల ఎంత ఉంటుందనేది కంపెనీ స్పష్టం చేయలేదు. కంటైనర్ స్టోర్ దాని ఇటీవలి త్రైమాసిక ఫలితాలలో 10.1 మిలియన్‌ డాలర్ల సర్దుబాటు చేసిన నికర నష్టాన్ని నివేదించింది.

గూగుల్‌, యాపిల్‌ సీఈవోల సరసన..
యాపిల్ సీఈఓ టిమ్ కుక్ (Apple CEO Tim Cook),  గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌ (Google  CEO Sundar Pichai)తో పాటు ఈ ఏడాది భారీగా వేతనాలు తగ్గించుకున్న  సీఈవోల జాబితాలో సతీష్ మల్హోత్రా కూడా చేరారు. ఈ ఏడాది జనవరిలో 12,000 తొలగింపులను ప్రకటించిన 10 రోజుల తర్వాత తనతో సహా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ స్థాయి కంటే పైస్థాయి ఎగ్జిక్యూటివ్‌లందరూ తమ వార్షిక బోనస్‌ను గణనీయంగా తగ్గించుకుంటున్నట్లు సీఈఓ సుందర్ పిచాయ్ పేర్కొన్నారు. ఇక యాపిల్‌ సీఈవో టిమ్ కుక్ 2023 సంవత్సరానికి తన వేతన పరిహారాన్ని 50 శాతం తగ్గించుకున్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top