VIRAL: సాసారాం జంక్షన్‌.. రైలు టైంకి రాకున్నా వీళ్లు మాత్రం వస్తారు

Sasaram Railway Station Turns Coaching Institution Again Viral - Sakshi

వనరులు పుష్కలంగా ఉన్నా.. వాటిని ఎలా వాడుకోవాలో తెలియని స్థితిలో ఉన్నాం మనం. పైపెచ్చు ‘సొసైటీ మనకేం ఇచ్చింద’ని భారీ డైలాగులు సంధిస్తూ నిందిస్తుంటాం.  కానీ, అవసరం మనిషికి ఎంతదాకా అయినా తీసుకుపోతుంది కదా!.  పేదరికానికి తోడు అక్కడి పరిస్థితులు..  యువతను రైల్వే స్టేషన్‌ బాట పట్టించాయి. కొన్నేళ్లుగా ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపుతున్న రైల్వే ప్లాట్‌ ఫామ్స్‌ కథ మీలో ఎంతమందికి తెలుసు?.. అదే ఇప్పుడు మీకు చెప్పబోతున్నా. 

అనగనగనగా..  బిహార్‌లోని సాసారాం రైల్వే జంక్షన్‌.  రోజు పొద్దుపొద్దునే..  సాయంత్రం పూట వందల మంది యువతీయువకులు ఇక్కడి రైల్వేస్టేషన్‌కు క్యూ కడుతుంటారు. 1, 2 రైల్వే ప్లాట్‌ఫామ్స్‌ మీద వాళ్ల హడావిడితో కోలాహలం నెలకొంటుంది కాసేపు. అలాగని వాళ్లు ప్రయాణాల కోసం రావట్లేదు. కాసేపటికే అంతా గప్‌ చుప్‌. బిజీగా చదువులో మునిగిపోతారు వాళ్లు. వీళ్లలో బ్యాంకింగ్స్‌ పరీక్షలకు కొందరు, స్టేట్స్‌ సర్వీసెస్‌ ఎగ్జామ్స్‌కు మరికొందరు, సివిల్‌ సర్వీసెస్‌ పరీక్ష ఇంకొందరు సిద్ధమవుతూ కనిపిస్తుంటారు. కొందరి కష్టానికి అదృష్టం తోడై జాబ్‌లు కొడుతుండగా.. సీనియర్ల నుంచి విలువైన సలహాలు అందుకునేందుకు వచ్చే జూనియర్ల సంఖ్య పోనుపోనూ పెరుగుతూ వస్తోంది. 

కరెంట్‌ సమస్యే..    
రోహతాస్‌ జిల్లాలో పేదరికం ఎక్కువ. మూడు పూటల తిండే దొరకడం కష్టమంటే.. పిల్లల్ని కోచింగ్‌లకు పంపించే స్తోమత తల్లిదండ్రులకు ఎక్కడి నుంచి వస్తది?. పైగా మావోయిస్ట్‌ ప్రభావిత ప్రాంతం అది. చాలా గ్రామాలకు కరెంట్‌ సదుపాయం లేదు. అదే సాసారాం రైల్వే స్టేషన్‌లో 24/7 కరెంట్‌ ఉంటుంది. ఈ ఒక్కకారణం వల్లే చుట్టుపక్కల ఉన్న ఊళ్లలోని యువత అంతా అక్కడికి వస్తోంది. 2002-03లో ఐదారుగురు ఫ్రెండ్స్‌తో మొదలైన బ్యాచ్‌.. ఇప్పుడు వందల మందితో కొనసాగుతోంది.  ప్లాట్‌ఫామ్‌ లైట్ల వెలుతురులో చదివి తమ నసీబ్‌ మార్చేసుకోవాలని ప్రయత్నిస్తోంది అక్కడి యువత.

విలువైన సలహాలు
కొందరైతే ఇంటికి కూడా వెళ్లకుండా చదువుల్లో మునిగిపోతున్నారు. అంతేకాదు వాళ్లలో వాళ్లే పాఠాలు చెప్తూ కనిపిస్తుంటారు అక్కడ.  ఇదే ప్లాట్‌ఫామ్‌ మీద చదివి సక్సెస్‌ కొట్టిన వాళ్లు సైతం సలహాలు అందించేందుకు అప్పుడప్పుడు వస్తుంటారు. ఈ ఆసక్తిని గమనించే ఇక్కడి అధికారులు సైతం అడ్డుచెప్పడం లేదు. పైగా ఐదు వందల ఐడీకార్డులు సైతం జారీ చేసి వాళ్లకు ప్రోత్సాహం అందిస్తున్నారు.  ఇది కొన్నేళ్లుగా కోచింగ్‌ సెంటర్‌గా నడుస్తున్న.. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న సాసారాం రైల్వే స్టేషన్‌ కథ.

- ఐఏఎస్‌ అవానిష్‌ శరణ్‌
ఛత్తీస్‌గఢ్‌ కేడర్‌, 2009 బ్యాచ్‌

(ట్విటర్‌ సౌజన్యంతో..)

చూడండి: ఏటీఎం నుంచి డబ్బులు రాగానే యువతి ఏం చేసిందంటే..

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top