
ముంబై: సంక్షోభం ఎదుర్కొంటున్న న్యూ ఇండియా కోపరేటివ్ బ్యాంక్ (ఎన్‌ఐసీబీ)ను విలీనం చేసుకుంటున్నట్టు దేశంలోనే అతిపెద్ద పట్టణ సహకార బ్యాంక్ అయిన సారస్వత్ కోపరేటివ్ బ్యాంక్ ప్రకటించింది. దీంతో ఎన్‌ఐసీబీకి చెందిన 1.22 లక్షల మంది డిపాజిటర్లు ఎలాంటి నష్టాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం లేదని.. వారి పొదుపు నిధులన్నీ భద్రంగా ఉంటాయని సారస్వత్ బ్యాంక్ చైర్మన్ గౌతమ్ ఠాకూర్ తెలిపారు.
ప్రస్తుతం ఎన్‌ఐసీబీ ఒక్కో కస్టమర్ గరిష్టంగా రూ.25,000 ఉపసంహరణకు పరిమితం చేయగా.. విలీనం తర్వాత వారి పూర్తి డిపాజిట్ మొత్తాన్ని వెనక్కి తీసుకునేందుకు వీలుంటుందని చెప్పారు. ఈ విలీనం సెప్టెంబర్ చివరికి ముగుస్తుందన్నారు. ఎన్‌ఐసీబీ విలీనం కోసం తామే స్వచ్ఛందంగా ఆర్‌బీఐని సంప్రదించినట్టు చెప్పారు. సంక్షోభంలో పడిన ఏడు బ్యాంక్‌లను గతంలో విలీనం చేసుకున్నట్టు గుర్తు చేస్తూ.. ఇదే మాదిరి ఎన్‌ఐసీబీ విలీనంపైనా నమ్మకం వ్య క్తం చేశారు. ఎన్‌ఐసీబీలో యాజమాన్యం రూ.122 కోట్ల నిధులను దుర్వినయోగం చేసిన విషయం ఇటీవలే వెలుగులోకి రావడం గమనార్హం.