సిలికాన్ వ్యాలీ బిలియనీర్లు, టెక్ దిగ్గజాలు అమెరికా మధ్యంతర ఎన్నికలను ప్రభావితం చేసేందుకు కోట్లాది డాలర్లు కుమ్మరిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ సమయంలో ఓపెన్‌ఏఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సామ్ ఆల్ట్‌మన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 2026 యూఎస్ ఎన్నికల్లో(మధ్యంతర) తాను ఎలాంటి రాజకీయ విరాళాలు ఇచ్చే ప్రణాళికలు లేవని ఆయన స్పష్టం చేశారు. వాషింగ్టన్ పర్యటనకు వచ్చిన సందర్భంగా ఆల్ట్‌మన్ ఈ వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో డబ్బు ప్రభావంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తూ ‘సాధారణంగా రాజకీయాల నుంచి డబ్బు దూరం కావాలని నేను కోరుకుంటున్నాను. అది జరిగితే చాలా మంచిది’ అని పేర్కొన్నారు.
తాను స్వయంగా రాజకీయ విరాళాలకు దూరంగా ఉంటున్నప్పటికీ ఏఐ పరిశ్రమపై పెరుగుతున్న వ్యతిరేకతను తట్టుకోవడానికి ప్రచారాలకు డబ్బు పెట్టే ఇతర టెక్ దిగ్గజాల నిర్ణయాన్ని ఆయన సమర్థించారు. ‘మా పోటీదారులందరి కంటే మమ్మల్ని వేరే ప్రమాణాలతో కొలవడం సరికాదు. వారు మమ్మల్ని తొక్కేయడానికి డబ్బును ఆయుధంగా వాడుతుంటే మేము కూడా తిరిగి పోరాడగలగాలి. అయితే, బోర్డు అంతటా నిబంధనలు అందరికీ ఒకేలా ఉండడానికి నేను ఇష్టపడతాను’ అని ఆల్ట్‌మన్ వ్యాఖ్యానించారు.
సూపర్ పీఏసీల హోరాహోరీ
కృత్రిమ మేధ రంగంలో ఆధిపత్యం కోసం, అనుకూల చట్టాల కోసం సిలికాన్ వ్యాలీలో పొలిటికల్ యాక్షన్ కమిటీల (పీఏసీ) యుద్ధం నడుస్తోంది.
లీడింగ్ ది ఫ్యూచర్: ఓపెన్‌ఏఐ ప్రెసిడెంట్ గ్రెగ్ బ్రోక్‌మన్, సిలికాన్ వ్యాలీ వెంచర్ క్యాపిటల్ సంస్థ ‘ఆండ్రీసెన్ హోరోవిట్జ్’ సహ వ్యవస్థాపకుల మద్దతుతో నడుస్తున్న సూపర్ పీఏసీ ఇది. ఏఐ స్నేహపూర్వక అభ్యర్థులను గెలిపించడం, డేటా సెంటర్ల నిర్మాణంపై రాష్ట్రాల ఆంక్షలను ఎదుర్కోవడం దీని ముఖ్య ఉద్దేశం.
పబ్లిక్ ఫస్ట్ యాక్షన్: ఓపెన్‌ఏఐ ప్రధాన పోటీదారు ‘ఆంత్రోపిక్ పీబీసీ’ ఈ సూపర్ పీఏసీకి ఏకంగా 20 మిలియన్ డాలర్ల నిధులు ఇచ్చింది. ఇది కఠినమైన ఏఐ భద్రతా నిబంధనల కోసం వాదిస్తుంది.
ఓపెన్‌ఏఐ వివరణ: లీడింగ్ ది ఫ్యూచర్ పీఏసీకి గ్రెగ్ బ్రోక్‌మన్, ఆయన భార్య అన్నా నుంచి 25 మిలియన్ డాలర్ల విరాళాలు అందినప్పటికీ ఆ సంస్థతో తమకు ఎలాంటి అధికారిక అనుబంధం లేదని ఓపెన్‌ఏఐ బ్లాగ్ పోస్ట్‌లో స్పష్టం చేసింది.
ఇదీ చదవండి: గేదె హెయిర్ స్టైల్‌కు ఫుల్ క్రేజ్!


