Air Cooler Sales: ఏసీల విక్రయాలు ఢమాల్‌

Sales of ACs, other cooling products hit again as Covid-19 - Sakshi

రిఫ్రిజిరేటర్ల అమ్మకాలూ అంతంతే

వరుసగా రెండవ ఏడాది దెబ్బ

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఎయిర్‌ కండీషనర్స్‌ (ఏసీ), రిఫ్రిజిరేటర్ల విక్రయాలపై కరోనా–19 ఎఫెక్ట్‌ పడింది. అమ్మకాలు పడిపోవడం వరుసగా ఇది రెండవ ఏడాది. వైరస్‌ వ్యాప్తి చెందడం, లాక్‌డౌన్స్‌ కారణంగా అత్యంత కీలకమైన వేసవి సీజన్లో సేల్స్‌ లేకపోవడం పరిశ్రమకు కోలుకోలేని దెబ్బపడింది. 2019తో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్‌లో అమ్మకాలు 75 శాతం పడిపోయాయని తయారీ సంస్థలు చెబుతున్నాయి. ఇక మే నెలలో విక్రయాలు పూర్తిగా నిలిచిపోయాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

థర్డ్‌ వేవ్‌ ముప్పు పొంచి ఉందంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో వినియోగదార్లలో సెంటిమెంట్‌ పడిపోవడం పరిస్థితిని మరింత దిగజార్చిందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. కోవిడ్‌–19 తగ్గే వరకు ఖర్చులను నియంత్రించుకోవాలన్నది కస్టమర్ల భావనగా ఉందని చెబుతున్నాయి. భారత్‌లో గృహాల్లో వినియోగించే ఏసీల వార్షిక మార్కెట్‌ 70–75 లక్షల యూనిట్లు. 15కు పైగా కంపెనీలు పోటీపడుతున్నాయి.

గతేడాది నుంచీ కష్టాలే..
భారత్‌లో ఏసీలు, రిఫ్రిజిరేటర్ల విక్రయాలు 2020 ఏప్రిల్‌లో పూర్తిగా నిలిచిపోయాయి. 2019తో పోలిస్తే గతేడాది మే నెలలో 10 శాతానికే అమ్మకాలు పరిమితమయ్యాయి. జూన్‌లో 25 శాతం జరిగాయి. ఇక ఈ ఏడాది ఏప్రిల్‌లో సేల్స్‌ 75 శాతం పడిపోయాయి. లాక్‌డౌన్స్, కర్ఫ్యూలతో మే నెల అమ్మకాలు పూర్తిగా కనుమరుగు అయినట్టేనని పరిశ్రమ చెబుతోంది. సంవత్సరం పొడవునా జరిగే ఏసీ, రిఫ్రిజిరేటర్ల విక్రయాల్లో ఏప్రిల్‌–జూన్‌ వాటా 35 శాతం దాకా ఉంటుంది.

దేశంలో కేవలం 15 శాతం మార్కెట్‌ మాత్రమే తెరిచి ఉందని కన్జ్యూమర్‌ ఎలక్ట్రానిక్స్, అప్లయెన్సెస్‌ మాన్యుఫ్యాక్చరర్స్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ కమల్‌ నంది తెలిపారు. స్టోర్లకు వచ్చే వినియోగదార్లు అతి తక్కువ అని వివరించారు. ముడి సరుకు భారం అవుతున్నందున ఏసీల ధరలు 8 శాతం పెరిగే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే వీటి ధరలు 12 శాతం వరకు అధికమయ్యాయి. లాక్‌డౌన్స్‌ ముందు వరకు ఏసీల డిమాండ్‌ ఉన్నప్పటికీ చిప్‌ కొరతతో సరఫరా 10 శాతమే ఉందని ఐటీ మాల్‌ ఎండీ మొహమ్మద్‌ అహ్మద్‌ తెలిపారు.  

అంచనాలు తారుమారయ్యాయి..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండంకెల వృద్ధి ఉంటుందని భావించినట్టు వోల్టాస్‌ తెలిపింది. సెకండ్‌ వేవ్, పరిమితుల కారణంగా లక్ష్యాలను పునర్‌ పరిశీలించుకోవాల్సి వస్తోందని వివరించింది. తొలి త్రైమాసికం అమ్మకాలు తుడిచిపెట్టుకు పోయినట్టేనని ఆందోళన వ్యక్తం చేసింది. 2019లో సాధించిన విక్రయాలు ఈ ఏడాది కూడా నమోదు చేస్తే అదే ఎక్కువ అని దైకిన్‌ అంటోంది. మార్చిలో ఏసీ సేల్స్‌ సానుకూలంగా ప్రారంభమయ్యాయని ప్యానాసోనిక్‌ ఇండియా సీఈవో మనీష్‌ శర్మ తెలిపారు.

ఒక్కసారిగా కోవిడ్‌ కేసులు అధికం కావడం, పాక్షిక లాక్‌డౌన్లతో వేసవి అమ్మకాలు క్షీణించాయని చెప్పారు. ఏప్రిల్‌–జూన్‌ కాలంలో 50% నష్టం అంచనా వేస్తున్నట్టు వెల్లడించారు. స్టాక్‌ సరిపడ ఉందని గుర్తు చేశారు. లాక్‌డౌన్స్, కర్ఫ్యూలు జూన్‌ వరకే ఉంటాయి. అయితే అప్పటికే సీజన్‌ పూర్తి అవుతుందని హాయర్‌ అభిప్రాయపడింది. కీలకమైన మే నెలలో సేల్స్‌ సాధించకపోతే తరువాత చేయలేమని వివరించింది. గతేడాది జూలై, ఆగస్టులో మార్కెట్‌ పుంజుకుంది. ఈ ఏడాది అటువంటి పరిస్థితి లేదు అని హాయర్‌ ఇండియా ప్రెసిడెంట్‌ ఎరిక్‌ బ్రగాంజా తెలిపారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top