బంగారం, వెండి ధరలు ఊరిస్తున్నాయి... కొనాలా.. ఆగాలా ? | Sakshi Wealth Story About Gold and Silver prices Reverse Gear | Sakshi
Sakshi News home page

బంగారం, వెండి ధరలు ఊరిస్తున్నాయి... కొనాలా.. ఆగాలా ?

Nov 30 2026 5:02 AM | Updated on Nov 30 2026 5:02 AM

Sakshi Wealth Story About Gold and Silver prices Reverse Gear

అంతర్జాతీయంగా భారీగా పతనమవుతున్న పసిడి, వెండి

గరిష్ఠ స్థాయిల నుంచి చూస్తే పుత్తడి రూ.1.8 లక్షల నుంచి 1.20 లక్షలకు

ఇక కిలో వెండి రూ.4.5 లక్షలకు చేరి ప్రస్తుతం 1.5 లక్షల దగ్గరకు

గరిష్ఠాన్ని లెక్కలోకి తీసుకుంటే ఇన్వెస్టర్లను ఊరిస్తున్న ప్రస్తుత ధర

కానీ చరిత్రలో ఇంతకంటే భారీ పతనాలను కూడా చూసిన లోహాలు

అక్కడి నుంచి కోలుకోవటానికి సుదీర్ఘకాలం వేచిచూడాల్సిన పరిస్థితి

కాబట్టి హెడ్జింగ్‌ కోసం, వైవిధ్యం కోసం పోర్టుఫోలియోలో 10 శాతం ఓకే

పెట్టుబడుల్లో బంగారానికి 80 శాతం, వెండికి 20 శాతం కేటాయిస్తే బెటర్‌

ఒకేసారి కాకుండా వచ్చే ఆరునెలలూ విడతలవారీ కొంటే మంచిది

ఒకవేళ ధర పతనమైనా... సిప్‌ తరహా కనక రిస్కును తగ్గించుకోవచ్చు

ఇక్కడి నుంచి ధర పెరిగినా ఇబ్బందేమీ ఉండదు.. లాభం తగ్గుతుందంతే!

బంగారమంటే... అదో ఆస్తి. అదో భరోసా!. మన భారతీయులకైతే మరీనూ!!. సొగసైనా, శుభ కార్యమైనా.. ఏదైనా ధగధగలాడేది పసిడితోనే. అన్నిటికీ మించి ఇదో మెరుగైన పెట్టుబడి సాధనం. పెట్టుబడితో ముడిపడ్డ అవసరాలకోసమైతే భౌతిక బంగారం... కేవలం పెట్టుబడికైతే ఈటీఎఫ్‌లు మనకి అలవాటే.  కాకపోతే ఇపుడు పరిస్థితి కొంచెం తేడా. నిన్నమొన్నటిదాకా బీభత్సంగా పెరిగి... ఇక తులం రెండు లక్షలకు చేరిపోవచ్చని అంతా అనుకుంటున్న తరుణంలో ఒక్కసారిగా ధర రివర్స్‌గేర్‌ వేసింది. 10 గ్రాముల పసిడి రూ.1.80 లక్షల నుంచి ఏకంగా 1.20 లక్షలకు పడిపోయింది. 

 రన్‌..రన్‌.. రన్‌.. అంటూ పెరిగి తాజాగా పెట్టుబడి సాధనాల జాబితాలోకి చేరిపోయిన వెండిదీ అదే పరిస్థితి. ఏకంగా కిలో రూ.4.5 లక్షలకు చేరి... అక్కడి నుంచి సర్రుమని జారిపోయి ఏకంగా 1.5 లక్షల  దగ్గరకొచి్చంది. వాస్తవానికి ఈ రెండూ ఇపుడు కాస్త కోలుకుంటున్నట్లు కనిపిస్తున్నాయి. పెరిగేటప్పుడు కొనలేకపోయామే అని దిగులుపడ్డ వారిని ఊరిస్తున్నాయి. మరిప్పుడు ఇన్వెస్టర్లు ఏం చేయాలి? కొనాలా... లేక ఇంకా పడతాయేమో వేచి చూడాలా? దీనికి సమాధానమే ఈ ‘సాక్షి వెల్త్‌’ ప్రత్యేక కథనం...


గోల్డ్, సిల్వర్‌... ఈ రెండూ చరిత్రలో ఎన్నో ర్యాలీలు చూశాయి. ఆ వెంటనే భారీ పతనాలనూ చూపించాయి. కొన్నిసార్లు ఏళ్ల తరబడి ఒకే ధరల దగ్గర కదిలాయి. పసిడి ఒకసారి రికార్డు ధర నుంచి పడ్డాక మళ్లీ ఆ« ధరను అందుకోవటానికి పాతికేళ్లు పట్టిన సందర్భాలూ ఉన్నాయి. ఇపుడివి రికార్డు స్థాయిలకు చేరి వేగంగా పడుతుండటానికి చాలా కారణాలున్నాయి.  

→ ఇది చాలా బలమైన.. వేగవంతమైన ర్యాలీ. ఆ వేగాన్ని చూసి చాలామంది ఇన్వెస్ట్‌ చేశారు. మరికొందరు స్పెక్యులేటివ్‌ పొజిషన్లు తీసుకున్నారు. అంతర్జాతీయంగా కాస్త ధరల్లో కరెక్షన్‌ మొదలయ్యేసరికి లాభాల స్వీకరణ మొదలైంది. దీంతో ధర తగ్గుతోంది. మార్జిన్లతో కొనుగోళ్లు చేసినవారు ధర ఇంకా తగ్గకుండా తమ పొజిషన్లను విక్రయిస్తూ ఉండటంతో పతనం మరింత వేగవంతమవుతోంది.  

→ బంగారం ధర పెరిగితే లాభం తప్ప దానిపై వడ్డీ ఏమీ రాదు. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికాలో వడ్డీ రేట్లు పెరగటం మొదలైంది. రాబడి పెరిగి బాండ్లు ఆకర్షణీయంగా మారుతున్నాయి. దీంతో బంగారాన్ని విక్రయించి ఆ సొమ్మును బాండ్లలోకి మళ్లించటం కూడా పతనానికి తోడయింది.  

→ దేశంలో కరెన్సీ కదలికలు ధరల్ని నిర్దేశిస్తున్నాయి. కొద్దిరోజులుగా డాలర్‌తో పోలిస్తే రూపాయి బలపడుతూ వస్తోంది. 97 స్థాయి నుంచి 93కు వచి్చంది. దాదాపుగా 4 శాతం బలపడింది. అంతర్జాతీయ బంగారం క్రయవిక్రయాలు డాలర్లలో జరుగుతాయి కనక మన దగ్గర ధర అదనంగా 4 శాతం పడిందని అనుకోవాలి. కాకపోతే దిగుమతి సుంకం, పన్నులు దేశీయంగా బంగారం ధరను ఇంకా హెచ్చు స్థాయిలోనే ఉంచుతున్నాయనేది మరో కోణం

చరిత్ర... ఓ హెచ్చరిక 
దీర్ఘకాలంలో బంగారం పెరుగుతూనే వస్తోందన్నది కాదనలేని వాస్తవం. కాకపోతే ఆ పెరుగుదల తీరును బాగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే 1970ల్లో భారీ ర్యాలీ చేసి... అక్కడి నుంచి 1980–82 మధ్య 52 శాతం పడిపోయింది. విచిత్రమేంటంటే 1970ల నాటి గరిష్ఠ ధరను అందుకోవటానికి 2007 వరకూ వేచి చూడాల్సి వచి్చంది.  
వెండిదీ అలాంటి పరిస్థితే. 2008 నాటి ఆర్థిక సంక్షోభంతో అంతా సురక్షిత ఆస్తుల్లో పెట్టుబడులకోసం పరుగులు పెట్టి వెండి ధరను అమాంతం పెంచేశారు. 2011లో ఔన్స్‌ వెండి 50 డాలర్లకు చేరింది. కిలో రూ.75 వేలను తాకింది. అక్కడి నుంచి పతనమై సుదీర్ఘకాలం దిగువనే కొనసాగింది. మళ్లీ 14 ఏళ్ల తరవాత గతేడాది భారీ ర్యాలీ చేసి 2011 నాటి గరిష్ఠాన్ని అధిగమించింది. అంటే 2011లో గరిష్ఠ స్థాయిల వద్ద కొన్నవారు మళ్లీ ఆ ధరను చూడటానికి 14 ఏళ్లు వేచి చూడాల్సి వచి్చంది. కాబట్టి భారీ ర్యాలీలు చేసినపుడు ఇంకా పెరుగుతుందికదా అని కొనుగోలు చేయటం అంత తెలివైన పని కాదు.  

గుర్తుంచుకోవాల్సిన విషయమిదీ... 
→ షేరు గానీ, లోహం గానీ ఏదైనా.... 50 శాతం పడిపోయిందంటే మళ్లీ ఆ ధరను అందుకోవటానికి అక్కడి నుంచి 100 శాతం పెరగాలి.  
→ ఒకవేళ 70 శాతం గనక పడిపోతే... మళ్లీ 233 శాతం పెరిగితే తప్ప మన ధర మనకు రాదు.  
→ ఒకవేళ 90 శాతం గనక కరెక్షన్‌ జరిగితే... మిగిలేది 10 శాతమే. అక్కడి నుంచి 900 శాతం... అంటే 9 రెట్లు పెరిగితే తప్ప మన ధర మనకు రాదు.  
→ అందుకే సంప్రదాయ పోర్టుఫోలియోలో వెండిని బంగారం మాదిరిగా భావించి ఎక్కువ ఇన్వెస్ట్‌ చేయకూడదనేది నిపుణుల సూచన.  

ఇన్వెస్టర్లు ఏం చేయాలిపుడు? అన్నిటికన్నా ముఖ్యం... ధరలు తగ్గాయి కదా అని మరీ దూకుడుగా కొనేయొద్దు. ఎందుకంటే ఈ స్థాయి వరకూ పడ్డవి మరికొంత పడవనే గ్యారంటీ లేదు. అలాగని మరింత పడిపోతాయని కూడా చెప్పలేం. కాబట్టి ఇప్పటికే బంగారం, వెండిలో బాగా ఇన్వెస్ట్‌ చేసినవారు ధరలు తగ్గిపోయాయని భయపడి అమ్మేయాల్సిన పనిలేదు. పసిడిది ఎప్పుడూ పోర్టుఫోలియో డైవర్సిఫికేషన్‌లో కీలకపాత్రే. ఆర్థిక సంక్షోభాలు, యుద్ధాలు, అనిశ్చితి ఉన్నపుడు ఇదే సురక్షితమైన పెట్టుబడి సాధనం.  కొత్తగా పసిడిలో ఇన్వెస్ట్‌ చేయాలనుకున్నవారు మాత్రం ఒకేసారి మొత్తం పెట్టేయకుండా దశలవారీ ఇన్వెస్ట్‌ చేస్తే మంచిది.  పెట్టుబడి పెటాలనుకుంటున్న మొత్తాన్ని వచ్చే 6–9 నెలల్లో నాలుగైదు దశల్లో పెడితే మంచిది. దీనివల్ల అనుకూలంగా లేని ధరల వద్ద కొంటున్నామనే రిస్క్‌ తగ్గుతుంది. ధరలు స్థిరపడి, ఊగిసలాట తగ్గితే... పెట్టే మొత్తాన్ని అప్పుడు పెంచుకోవచ్చు.  

ఈ రెండిటినీ కలపటమెందుకు? 
→ ఎందుకంటే ప్రాథమికంగా బంగారాన్ని ఎన్నాళ్లయినా ఉంచుకోవచ్చు. అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొన్నపుడు పెట్టుబడుల వైవి«ధ్యానికి, హెడ్జింగ్‌కు ఇది మంచి సాధనం. 
→ వెండి అరుదైన లోహమే కాకుండా పారిశ్రామిక వినియోగమూ ఎక్కువే. సోలార్, ఎల్రక్టానిక్, ఎలక్ట్రిక్‌ పరికరాల నుంచి డిమాండ్‌ ఎక్కువ. దీంతో దీని ధర పెరగటానికి అవకాశాలెక్కువ. అదేవిధంగా బాగా పెరిగాక కరెక్షన్‌ సైకిల్స్‌ కూడా దీన్లో అధికం.  
→ వెండి ధరల్లో హెచ్చుతగ్గులు ఎక్కువ కనక దానికి తక్కువ కేటాయించటం వల్ల రిస్కు తగ్గుతుంది.  

రూ.10 లక్షల పోర్టుఫోలియోలో బంగారం, వెండికి ఎంత కేటాయించవచ్చు? 
→ పోర్టుఫోలియోలో బంగారం, వెండికి 10 శాతం వరకూ కేటాయించవచ్చు. దీన్లో కూడా బంగారానికి 80 శాతం... వెండికి 20 శాతం కేటాయిస్తే బెటర్‌. అంటే... 
→ బంగారానికి : రూ.80,000 
→ వెండికి : రూ.20,000 
→ మొత్తం : రూ.1 లక్ష

ఏక మొత్తం కంటే... విడతల వారీ బెటర్‌ 
→ ఉదాహరణకు మీరు గోల్డ్‌ ఈటీఎఫ్‌లో రూ.1 లక్ష ఇన్వెస్ట్‌ చేస్తున్నారనుకుందాం. యూనిట్‌ ధర రూ.10వేలుగా భావిస్తే 10 యూనిట్లొస్తాయి.  
→ అలాకాకుండా రూ.20వేల చొప్పున ఐదు నెలల పాటు ఇన్వెస్ట్‌ చేశారనుకుందాం. ధర ఏ కొంచెం తగ్గినా... మన చేతికొచ్చే యూనిట్ల సంఖ్య పెరుగుతుంది. ఒకవేళ ధర గనక పెరిగినా... కొంత లాభం తగ్గుతుంది తప్ప నష్టపోయే పరిస్థితి ఉండదు.  
→ కాబట్టి నిపుణులు చెబుతున్నదేంటంటే బంగారం, వెండిలో ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్న మొత్తాన్ని వారి వారి రిస్కు సామర్థ్యాన్ని బట్టి 9:1 లేదా 8:2 లేదా 7:3 నిష్పత్తిలో వచ్చే ఆరు నెలలపాటు విడతల వారీగా ఇన్వెస్ట్‌ చేస్తే మంచిదని.  
→ ధరల్లో ఊగిసలాటలు ఎక్కువగా ఉన్నాయి కనక వచ్చే ఆరునెలల్లో అవి స్థిరపడవచ్చని, అపుడు పరిస్థితిని బట్టి వేరే మొత్తాన్ని కూడా ఇన్వెస్ట్‌ చేయవచ్చన్నది వారి సూచన.

ఈ సంకేతాలను గమనించాలి... 
బంగారం, వెండి వంటి లోహాల్లో ఇన్వెస్ట్‌ చేసేవారు అంతర్జాతీయంగా ఈ ఐదు సంకేతాలనూ ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. అవి.. 
→ అమెరికా డాలర్‌ ఇండెక్స్‌: బాగా బలహీనపడుతూ ఉంటే దానివల్ల బంగారం ధరలు పెరుగుతాయి. 
→ అమెరికా బాండ్‌ ఈల్డ్స్‌: ఇవి పెరుగుతుంటే బంగారం ధర బలహీనపడవచ్చు. ఈల్డ్స్‌ తగ్గితే అది బంగారం ధరను పెంచుతుంది.  
→ అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ నిర్ణయాలు: వడ్డీ రేట్లు తగ్గించటం, తగ్గిస్తామో– పెంచుతామో చెప్పటం వంటివి బంగారం, వెండి ధరలపై ప్రభావాన్ని చూపిస్తుంటాయి.  
→ డాలర్‌– రుపీ ధర: రూపాయి గనక బలపడి, డాలర్‌ విలువ తగ్గితే... అంతర్జాతీయ ట్రెండ్‌ ఎలా ఉన్నా దేశీయంగా మాత్రం బంగారం ధర పెరుగుతుంది.  
→ కేంద్ర బ్యాంకుల బంగారం కొనుగోళ్లు: హెడ్జింగ్‌ కోసం ప్రతి దేశంలోని సెంట్రల్‌ బ్యాంకూ కొంతమేర బంగారాన్ని కొనుగోలు చేస్తూ ఉంటుంది. ఈ కొనుగోళ్లు పెరిగితే అది దీర్ఘకాలంలో బంగారం ధర పెరుగుతుందనే సంకేతాలిస్తుంది.  

చివరిగా ఇన్వెస్టర్లు తెలుసుకోవాల్సింది ఒక్కటే. బంగారం, వెండి దీర్ఘకాలంలో సంపదను కాపాడటానికి, పెంచటానికి ఉపయోగపడతాయన్నది కాదనలేని వాస్తవం. కానీ మనం ఏ ధరలో కొంటున్నాం? ఎంత మొత్తంలో కొంటున్నాం? ఎంతకాలం వేచి ఉండగలం? అన్నదే పెట్టుబడులపై రాబడిని నిర్ణయిస్తుంది. ధరలు పడిపోయాయని కొనేయటం కాదు. మన పోర్టు ఫోలియోకు అవసరమైతే... సరైన కేటాయింపుతో, విడతల వారీగా కొనటమే వివేకం.

రమణమూర్తి మంథా 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement