లాభాలు తీసుకోండి.. రీబ్యాలెన్స్‌ చేసుకోండి

Sakshi Special Story On Portfolio Rebalancing

రిస్క్‌ తగ్గించుకోవడంలో కీలక మార్గం

అధిక రాబడులకు అవకాశం

పెట్టుబడులను పట్టించుకోకపోవడం సరైనది కాదు  

స్టాక్‌ మార్కెట్లు మార్చిలో చూసిన కనిష్టాల నుంచి భారీగానే రికవరీ అయ్యాయి. ఒకటి తర్వాత ఒకటి చొప్పున వివిధ రంగాల్లోని స్టాక్స్‌ వరుసగా ర్యాలీ బాట పడుతున్నాయి. మిడ్‌ క్యాప్, స్మాల్‌ క్యాప్‌ షేర్లు సైతం కనిష్ట స్థాయిల నుంచి గణనీయంగానే పెరిగాయి. ఇంకా పెరుగుతాయన్న ధోరణి కాకుండా.. ర్యాలీ కారణంగా ఈక్విటీ పెట్టుబడుల విలువ పెరిగిందన్న సత్యాన్ని గుర్తించాలి. దీనికి తగినట్టు పోర్ట్‌ ఫోలియోను సవరించుకోవడం వల్ల రిస్క్‌ తగ్గించుకోవచ్చు. దీన్నే పోర్ట్‌ పోలియో రీబ్యాలెన్స్‌ గా చెబుతారు. ఇన్వెస్టర్‌ తన లక్ష్యాలకు తగిన రాబడులను ఇచ్చే సాధనాలను ఎంచుకోవడం, అందుకు అనుగుణంగా వాటికి కేటాయింపులు చేసుకోవడం పోర్ట్‌ ఫోలియో అలొకేషన్‌ అవుతుంది. వివిధ మార్కెట్లలో రాబడుల తీరుకు అనుగుణంగా పోర్ట్‌ ఫోలియోలోనూ మార్పులు అవసరం అవుతాయి. ఆ వివరాలను   ‘మై మనీ మంత్ర’ ఎండీ రాజ్‌ ఖోస్లా వివరించారు.

అందరికీ అన్ని సాధనాలు ఒకే విధంగా అనుకూలంగా ఉండవు. ఉదాహరణకు రమణ (39) సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌. నెలకు సంపాదన రూ.లక్ష వరకు ఉంటుంది. సంతానం ఒకే కుమారుడు. దీంతో వీరికి ప్రతీ  నెలా రూ.60వేల వరకు మిగులు కనిపిస్తోంది. మరో ఉదాహరణలో గోపాల్‌ (32) ఓ ఫార్మా కంపెనీ ప్రొడక్షన్‌ యూనిట్‌లో పనిచేస్తుంటాడు. నెలకు ఆదాయం రూ.40వేలు. సంతానం ఒక కుమార్తె, ఒక కుమారుడు. నెలలో మిగులు కష్టంగా ఉంటోంది. కొన్ని ఖర్చులను నియంత్రించుకుంటే రూ.5వేల వరకు పొదుపు చేసుకోగల సౌలభ్యం ఉంటుంది.

ఈ రెండు కేసుల్లో ఆదాయ స్థాయిలు మారిపోయాయి. వారి అవసరాల్లోనూ, కుటుంబ సభ్యుల సంఖ్యలోనూ మార్పులు గమనించొచ్చు. వీరిలో రమణ అధిక ఆదాయ పరుడు. చిన్న కుటుంబం. బాధ్యతలు తక్కువ. కనుక రిస్క్‌ ఎక్కువగా తీసుకోగలడు. కనుక ఈక్విటీలకు అధిక కేటాయింపులు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. కానీ, గోపాల్‌ పరిస్థితి వేరు. మిగిలేదే తక్కువ. కనుక ఈక్విటీలకు ఎక్కువ కేటాయింపులు చేసుకోలేని పరిస్థితి. రిస్క్‌ ఎక్కువగా తీసుకోలేడు. ఇలా ప్రతీ ఒక్కరూ అవసరాలు, ఆదాయాలు, మిగులు, జీవిత లక్ష్యాలు, బాధ్యతలను అనుసరించి వారి పోర్ట్‌ ఫోలియో అలొకేషన్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

పోర్ట్‌ ఫోలియో అంటే.. ఈక్విటీ, డెట్, డిపాజిట్స్, బంగారం, రియల్‌ ఎస్టేట్‌ తదితర సాధనాల్లో పెట్టుబడులు. భిన్న సాధనాల మధ్య చేసిన కేటాయింపులను.. అవసరమైనప్పుడల్లా సమతూకం ఉండేలా మార్పులు, చేర్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అన్ని రకాల పెట్టుబడులు ఒకే తీరులో, ఒకే దిశలో చలిస్తాయని చెప్పలేము. ఇందుకు ఈ ఏడాది తొలి ఆరు నెలలే ప్రత్యక్ష నిదర్శనం. ఈక్విటీ మార్కెట్లు మార్చి కనిష్టాల నుంచి చూస్తే 50 శాతానికి పైగా ఐదు నెలల్లో పెరిగాయి. బంగారం 20 శాతం పెరిగింది. రాబడులన్నవి ఈక్విటీ, బంగారంలో ఒకే మాదిరిగా లేకపోవడాన్ని గమనించొచ్చు. ఎవరైనా ఒకరు తమ ఆర్థిక ప్రణాళిక మేరకు.. ఈ ఏడాది జనవరిలో 60% ఈక్విటీలకు, 30 శాతం డెట్‌ సాధనాలకు, మరో 10 శాతం బంగారానికి కేటాయించారనుకుంటే.. ఆగస్ట్‌ చివరి నాటికి చూస్తే ఈక్విటీ పెట్టుబడుల శాతం 55గాను, డెట్‌ పెట్టుబడులు 32.5 శాతంగాను, బంగారం 12.5 శాతంగా మారి ఉంటాయి.

ఇక రానున్నఆరు నెలల్లో ఈక్విటీలు మరో 5 శాతం క్షీణించి, డెట్‌ 7 శాతం, బంగారం 10 శాతం పెరుగుతుందనుకుంటే.. అప్పటికి ఈక్విటీల్లో 53 శాతం, డెట్‌లో 34 శాతం, బంగారంలో 14శాతంగాను ఉంటాయి.  ఎంత రిస్క్‌ తీసుకోగలరు, ఎంత రాబడులను ఆశిస్తున్నారనే అంశాల ఆధారంగా ఈ కేటాయింపులు చేసుకుని ఉండొచ్చు. కానీ కొంత కాలానికి వీటిల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఈక్విటీలకు 60% అనుకుంటే 55 శాతానికి తగ్గిపోయి, మిగిలిన రెండు సాధనాల్లోని పెట్టుబడుల విలువ పెరిగింది. ఈ వ్యత్యాసం ప్రస్తుతం చూడ్డానికి చాలా స్వల్పమే అనిపించొచ్చు. కానీ దీర్ఘకాలానికి రాబడుల పరంగా ఈ వ్యత్యాసం భారీగా ఉంటుందన్న వాస్తవాన్ని గమనించాలి. అందుకే ఈ సమయంలో పోర్ట్‌ ఫోలియో రీబ్యాలెన్స్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఈక్విటీల్లో పెట్టుబడులను తిరిగి 60 శాతానికి పెంచుకోవాలి. అందుకోసం డెట్, బంగారంలో కొంత మొత్తాన్ని వెనక్కి తీసుకోవాలి. బుల్‌ రన్‌ చూసి అధిక ఉత్సాహంతో ఈక్విటీలకు అధిక కేటాయింపులు చేసుకుంటే ఆటుపోట్లు భారీగా పెరిగే అవకాశాన్ని ఇచ్చినట్టే అవుతుంది. ఒకవేళ స్టాక్‌ మార్కెట్‌ పెరిగిన స్థాయి నుంచి మళ్లీ పడిపోతే పెట్టుబడుల విలువ క్షీణిస్తుంది.    

తగిన ప్రణాళికకు మార్గం
పడిన మార్కెట్లు మళ్లీ పెరగడం సహజం. కానీ, మార్కెట్లు రికవరీ అయినా కానీ, ఇన్వెస్టర్‌ పోర్ట్‌ ఫోలియోలోని ఈక్విటీ పెట్టుబడుల విలువ అదే స్థాయిలో రికవరీ అవ్వకపోవచ్చు. అందుకే ఇన్వెస్టర్‌ రీబ్యాలెన్స్‌ చేసుకోవడం అవసరం. దానివల్ల రిస్క్‌ ను కూడా నియంత్రించుకోవడం సాధ్యపడుతుంది. తద్వారా ఇన్వెస్టర్‌ విశ్వాసం మరింత పెరుగుతుంది. తన పోర్ట్‌ ఫోలియోలో ఏదేనీ ఒక విభాగం కరెక్షన్‌ లోనైనప్పుడు ఇన్వెస్టర్‌ భయపడిపోకుండా  తన పెట్టుబడులను ప్రణాళిక మేరకు సవరించుకుని కొనసాగించుకునే వీలుంటుంది. ఈ ఏడాది మార్చిలో స్టాక్‌ మార్కెట్ల భారీ పతనంతో చాలా మంది ఇన్వెస్టర్లు నష్టాలను ఎదుర్కొని ఉంటారు. కానీ, క్రమశిక్షణ కలిగిన ఇన్వెస్టర్లు ఎవరైతే ఈ ఏడాది జనవరిలో తమ పోర్ట్‌ ఫోలియోను రీబ్యాలెన్స్‌ చేసుకుని ఉండి ఉంటారో వారు మంచి సక్సెస్‌ చవి చూసి ఉంటారు. ఎందుకంటే ఈ ఏడాది జనవరిలో ఈక్విటీ మార్కెట్లు ఆల్‌ టైమ్‌ గరిష్టాలకు చేరాయి. రీబ్యాలెన్స్‌ విధానం తెలిసి, దాన్ని ఆచరిస్తున్నవారు అయితే భారీగా పెరిగిన ఈక్విటీ విభాగంలో పెట్టుబడులను తగ్గించుకుని ఉండేవారు. దాంతో అనంతరం మార్చిలో భారీ పతనం తర్వాత ఈక్విటీ పెట్టుబడుల విలువ తగ్గినందున మరిన్ని పెట్టుబడులకు అవకాశం లభించేది.

ఇన్వెస్ట్‌మెంట్‌పై ఆటుపోట్లను తగ్గించుకునే ప్రయత్నం
మార్కెట్లలో ఆటుపోట్లను ఇన్వెస్టర్లు నియంత్రించలేరన్నది నిజం. కాకపోతే ఈ ఆటుపోట్ల ప్రభావం తమ పెట్టుబడులపై తక్కువగా ఉండేలా రిస్క్‌ను నియంత్రించుకోగలరు. ఇందుకు చేయాల్సిందల్లా పెట్టుబడుల్లో సమతుల్యం ఉండేలా చూసుకోవడమే. నిర్ణయించుకున్న మేర వివిధ సాధనాలకు పెట్టుబడుల కేటాయింపులను సవరించుకోవాలి. ఇన్వెస్ట్‌ చేసి, అవసరం వచ్చే నాటి వరకు వాటిని పట్టించుకోని వారితో పోలిస్తే.. క్రమానుగతంగా తమ పెట్టుబడుల కేటాయింపులను రీబ్యాలెన్స్‌ చేసుకునే వారే దీర్ఘకాలంలో మెరుగైన రాబడులను సొంతం చేసుకుంటున్నట్టు చారిత్రక గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఏదేనీ ఒక విభాగంలో (ఈక్విటీ లేదా డెట్‌ లేదా గోల్డ్‌) గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నప్పుడు లేదా కనీసం ఏడాదికి ఒక పర్యాయం అయినా పెట్టుబడుల కేటాయింపులను రీబ్యాలెన్స్‌ చేసుకోవాలన్నది నిపుణుల సూచన.

ఆర్థిక సంవత్సరం చివర్లో ఈ పని చేయడం ద్వారా మూలధన లాభాల పన్ను ప్రయోజనాలు ఉంటే సొంతం చేసుకోవచ్చు. అయితే రీబ్యాలెన్స్‌ అన్నది రిస్క్‌ తగ్గించుకునేందుకే కాదు.. మరెన్నో ప్రయోజనాలు దీనివల్ల ఇన్వెస్టర్‌ పొందొచ్చు. అప్పటి వరకు బాగా పెరిగిన వాటి నుంచి పెట్టుబడులను తీసుకుని, ర్యాలీకి సిద్ధంగా ఉన్న నాణ్యమైన వాటిల్లోకి ప్రవేశించే అవకాశం లభిస్తుంది. చెట్టు నుంచి పుష్పాలను కోసుకుని, మళ్లీ పువ్వుల కోసం చెట్టుకు నీరు, పోషకాలు ఇచ్చినట్టే.. పెట్టుబడుల రీబ్యాలెన్స్‌ రాబడుల ఫలాలను ఇస్తుందని నిపుణుల సూచన. ఆర్థి క, పెట్టుబడుల వ్యవహారాలు అంత సులభమైనవి కావు. తగిన విషయ జ్ఞానంతోనే చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ఆర్థిక సలహాదారులను సంప్రదించడం సూచనీయం. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top