రష్యా తిరస్కరణ.. పెట్రోల్‌, డీజిల్‌ ధరలతో పాకిస్తాన్‌ ఉక్కిరిబిక్కిరి!

Russia REJECTS Pakistan demand of more discounts oil imports - Sakshi

పాకిస్తాన్‌లో ఆర్థిక సంక్షోభం మరింత ముదురుతోంది. ఆ దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. అధిక ధరలతో ప్రజలు అల్లాడుతున్నారు. భారీ నగదు కొరతను ఎదుర్కొంటున్న పాకిస్థాన్‌ రష్యాపై ఆశలు పెట్టుకుంది. ఇప్పటికే రాయితీపై ముడి చమురు సరఫరా చేసిన రష్యాను మరింత తగ్గించాలని కోరగా రష్యా తిరస్కరించింది. 

పాకిస్తాన్‌కు చెందిన ‘ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్’ నివేదిక ప్రకారం.. రష్యాను దీర్ఘకాల చమురు ఒప్పందాన్ని ఖరారు చేయాలని కోరింది. దీర్ఘకాలిక ప్రాతిపదికన తమకు బ్యారెల్‌ ముడి చమురు గరిష్టంగా 60 డాలర్లకే విక్రయించాలని అభ్యర్థించింది. ఇది భారత్‌ విక్రయించిన దానికంటే దాదాపు 6.8 డాలర్లు తక్కువ. భారత వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రకారం.. గత జులైలో రష్యా చమురు సగటు ధర బ్యారెల్‌కు 68.09 డాలర్లు.

ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించేందుకు చమురు ధరలపై మరిన్ని తగ్గింపులను పొందాలని పాకిస్తాన్‌ తాత్కాలిక ప్రభుత్వం భావిస్తున్నట్లుగా  ‘ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్’ నివేదించింది. దీర్ఘకాలిక ప్రాతిపదికన ముడి చమురును దిగుమతి చేసుకునేందుకు, ఓడరేవులో వసూలు చేసే వాస్తవ ధర అయిన 'ఫ్రీ ఆన్ బోర్డ్' (FOB)  ఒక బ్యారెల్‌కు 60 డాలర్లు బెంచ్‌మార్క్‌గా నిర్ణయించాలని పాకిస్తాన్ కోరింది. అంటే పాకిస్థాన్‌కు ఎగుమతి చేసే చమురు సరుకు రవాణా ఖర్చును కూడా భరించాలని అభ్యర్థించింది. 

భారీగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు
పాకిస్తాన్‌లో ఆగస్ట్‌లో ఆపద్ధర్మ ప్రభుత్వం ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచి పెట్రోల్, డీజిల్, కిరోసిన్ ధరలను రెండుసార్లు పెంచడం గమనార్హం. సెప్టెంబర్‌ ప్రారంభంలో, అన్వర్ ఉల్ హక్ కకర్ నేతృత్వంలోని ప్రభుత్వం పెట్రోల్, హై-స్పీడ్ డీజిల్ ధరలను లీటరుకు (పాకిస్తానీ రూపాయల్లో) రూ.14.91, రూ.18.44  చొప్పున పెంచింది. ప్రస్తుతం (అక్టోబర్‌ 19) ఆ దేశంలో సూపర్ పెట్రోల్ ధర లీటరు రూ. 283.38,  హైస్పీడ్ డీజిల్ ధర లీటరు రూ. 304.05 ఉంది.

గతంలో రాయితీ
ఈ ఏడాది జూన్‌లో అప్పటి ప్రధాని షెహబాజ్ షరీఫ్ రష్యాతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం.. రాయితీపై రష్యా ముడి చమురు మొదటి రవాణా కరాచీకి చేరుకుంది. మీడియా నివేదిక ప్రకారం.. మాస్కో ఒక నెలలో 1,00,000 మెట్రిక్ టన్నుల ముడి చమురుతో ఒక కార్గోను రవాణా చేసింది. ఆ చమురు కోసం సరుకు రవాణా ఖర్చు కూడా రష్యా చెల్లించింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top