RupeeTrading: బ్యాంకుల అవగాహన కార్యక్రమాలు  

Rupee Trading IBA and FIEO to organise sensitisation programmes - Sakshi

న్యూఢిల్లీ: రూపాయి మారకంలో సీమాంతర వాణిజ్యాన్ని నిర్వహించడానికి సంబంధించిన విధివిధానాలపై భారతీయ బ్యాంకుల అసోసియేషన్‌ (ఐబీఏ), ఎగుమతి సంస్థల సమాఖ్య ఎఫ్‌ఐఈవో దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నాయి. వాణిజ్య శాఖ అధికారులు, బ్యాంకుల సీఈవోలు, ఎగుమతిదారులతో కేంద్ర ఆర్థిక శాఖ డిసెంబర్‌ 5న నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సమావేశంలో పాల్గొన్న ఎగుమతిదారులు లేవనెత్తిన సందేహాలకు ఆర్‌బీఐ ప్రతినిధి వివరణ ఇచ్చారని పేర్కొన్నాయి.

ఈ నేపథ్యంలో బ్యాంకర్లు, ఎగుమతిదారులకు రూపాయి మారకంలో వాణిజ్య నిర్వహణపై అవగాహన కల్పించేందుకు ఐబీఏ, ఎఫ్‌ఐఈవో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. కరెన్సీ మారకంపరమైన రిస్కులను సమర్ధంగా ఎదుర్కొనేలా మన కంపెనీలకు, అలాగే తమ ఖాతాల్లో ఉన్న రూపాయి నిల్వలకు సమానంగా మన దగ్గర నుంచి దిగుమతులు పెంచుకునేలా సీమాంతర భాగస్వాములను ప్రోత్సహించేందుకు దేశీ కరెన్సీలో వాణిజ్యం తోడ్పడగలదని ఎఫ్‌ఐఈవో డైరెక్టర్‌ జనరల్‌ అజయ్‌ సహాయ్‌ చెప్పారు. (సరికొత్త అవతార్‌లో, టాటా నానో ఈవీ వచ్చేస్తోంది..?)

తద్వారా ద్వైపాక్షిక వాణిజ్యం మెరుగుపడుతుందని, మరిన్ని దేశాలకు కూడా దీన్ని విస్తరిస్తే అంతర్జాతీయ స్థాయిలో భారతీయ రూపాయికి ప్రత్యేక గుర్తింపు లభించగలదని ఆయన పేర్కొన్నారు. ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యాపై పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధించిన నేపథ్యంలో డాలరుకు ప్రత్యామ్నాయంగా ఇతర దేశాలతో దేశీ కరెన్సీలో వాణిజ్య లావాదేవీలు నిర్వహించుకోవడంపై భారత్‌ మరింతగా దృష్టి పెడుతోంది.  (వర్క్‌ ఫ్రం హోం: వచ్చే ఏడాది దాకా వారికి కేంద్రం తీపి కబురు)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top