చేతులు మారిన ల్యూమినస్‌ ఎలక్ట్రికల్‌

Rr Kabel Acquires Luminous Home Electrical Business From Schneider - Sakshi

న్యూఢిల్లీ: ల్యూమినస్‌ పవర్‌కు చెందిన హోమ్‌ ఎలక్ట్రికల్‌ బిజినెస్‌(హెచ్‌ఈబీ)ను కొనుగోలు చేసినట్లు వైర్లు, కేబుళ్ల తయారీ కంపెనీ ఆర్‌ఆర్‌ కేబుల్‌ తాజాగా పేర్కొంది. ఫ్రెంచ్‌ ఇంజినీరింగ్‌ దిగ్గజం ష్నీడర్‌ నుంచి ల్యూమినస్‌ హెచ్‌ఈబీని సొంతం చేసుకున్నట్లు తెలియజేసింది. 

తద్వారా తమ కన్జూమర్‌ ఎలక్ట్రికల్‌ గూడ్స్‌ బిజినెస్‌ మరింత పటిష్టంకానున్నట్లు టీపీజీ క్యాపిటల్‌కు పెట్టుబడులున్న ఆర్‌ఆర్‌ కేబుల్‌ అభిప్రాయపడింది. ల్యూమినస్‌ పోర్ట్‌ఫోలియోలో ఫ్యాన్లు, లైట్లు, అప్లయెన్సెస్‌ తదితరాలున్న సంగతి తెలిసిందే. కాగా.. ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) చివరి త్రైమాసికంలో ఐపీవోకు వచ్చే యోచనలో ఉన్నట్లు ఆర్‌ఆర్‌ కేబుల్‌ ఎండీ శ్రీగోపాల్‌ కాబ్రా విలేకరుల వర్చువల్‌ సమావేశంలో తెలియజేశారు. ల్యూమినస్‌ పవర్‌ డీల్‌ ఈ ఏడాది మే నెలకల్లా పూర్తికావచ్చని అంచనా వేశారు. 

అటు ల్యూమినస్, ఇటు ఆర్‌ఆర్‌ అన్‌లిస్టెడ్‌ కంపెనీలు కావడంతో డీల్‌ విలువను వెల్లడించలేమన్నారు. ల్యూమినస్‌ కొనుగోలు ద్వారా ఫ్యాన్లు, లైట్లు తదితరాల ప్రీమియం విభాగంలోకి ప్రవేశించినట్లు వివరించారు. బ్రాండ్‌ లైసెన్సింగ్‌ ఒప్పందం ప్రకారం నాలుగేళ్లపాటు ల్యూమినస్‌ను ప్రొడక్టులకు వినియోగించుకునే వీలున్నట్లు వెల్లడించారు. ల్యూమినస్‌ పవర్‌లో 74% వాటాను ష్నీడర్‌ 2011లో కొనుగోలు చేసింది. 2017లో మిగతా 26% వాటా  సొంతం చేసుకుంది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top