Royal Enfield to Recall 26300 Units of Classic 350 on Faulty Brake Issue- Sakshi
Sakshi News home page

ఈ రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్ కొన్నారా.. అయితే, వెంటనే షోరూమ్ తీసుకెళ్లండి!

Published Mon, Dec 20 2021 2:52 PM

Royal Enfield to Recall 26300 Units of Classic 350 on Faulty Brake Issue - Sakshi

ప్రముఖ బైక్ తయారీ సంస్థ రాయల్‌ ఎన్‌ఫీల్డ్ తన క్లాసిక్ 350 బైక్‌లో బ్రేకింగ్ సమస్య ఉన్న కారణంగా 26,300 యూనిట్లను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్‌లో విడుదల చేసిన ఈ రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ క్లాసిక్‌ 350 మోడల్‌ బైక్‌లో పలు సమస్యలు ఉన్న కారణంగా విక్రయించిన బైక్‌లను వెంటనే వెనక్కి తీసుకోవాలని రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ నిర్ణయించింది. ఈ బైక్‌లో బ్రేకింగ్‌ సమస్య ఉన్నట్లు గుర్తించిన రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ఈ మోడల్స్‌కు చెందిన అన్ని బైక్‌లను వెనక్కి తీసుకొని రావాలని కోరుతుంది.

ఈ సమస్య సెప్టెంబర్ 1 నుంచి డిసెంబర్ 5 మధ్య తయారు చేసిన క్లాసిక్ 350 మోడల్స్‌ బైక్‌లలో ఉన్నట్లు తెలిపింది. వినియోగదారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అన్ని యూనిట్ల స్వింగ్ ఆర్మ్ బ్రేక్ రియాక్షన్ బ్రాకెట్'ను బలోపేతం చేయాలని నిర్ణయించుకున్నట్లు రాయల్‌ ఎన్‌ఫీల్డ్ పేర్కొంది. సర్వీస్ టీమ్ లేదా మీ దగ్గరలోని స్థానిక డీలర్ షిప్ కేంద్రాలకు సెప్టెంబర్ 1 నుంచి డిసెంబర్ 5 మధ్య ఈ బైక్ కొనుగోలు చేసిన వినియోగదారులు కొనుగోలు పత్రాలతో చేరుకోవాలని సూచించింది. వాటిని వెనక్కి తీసుకున్న తర్వాత లోపాలను సరిచేసి తిరిగి ఇవ్వనునట్లు పేర్కొంది.

(చదవండి: 2021లో నాకు సాయం చేసినవి ఇవే!: ముకేష్‌ అంబానీ)

మీ దగ్గరలోని సర్విస్ కేంద్రాల గురుంచి తెలుసుకోవడం కోసం వినియోగదారులు రాయల్‌ ఎన్‌ఫీల్డ్ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. అలాగే, వినియోగదారులకు ఏమైనా సందేహాలు ఉంటే 1800-210-007కు కాల్ చేయవచ్చు అని కూడా పేర్కొంది. ఈ రాయల్ ఎన్‌ఫీల్డ్‌ క్లాసిక్ 350 బైక్ మూడు వేరియంట్లలో లభ్యమవుతుంది. ఫైర్ బాల్ వేరియంట్ ధర - రూ.1.85 లక్షలు, సూపర్ నోవా వేరియంట్ ధర - రూ. 1.86 లక్షలు, స్టెల్లార్ వేరియంట్ ధర -1.90 లక్షలుగా ఉన్నాయి. ఈ బైక్ యుఎస్‌బి ఛార్జర్, కొత్తగా డిజైన్ చేసిన టెయిల్ లైట్, అప్‌డేట్ చేసిన ఎగ్జాస్ట్ పైప్, 13-లీటర్ కెపాసిటీ ఫ్యూయల్ ట్యాంక్, మరింత సౌకర్యవంతమైన రైడింగ్ అనుభవం కోసం అప్‌డేట్ చేసిన సీట్లతో వస్తుంది. 

(చదవండి: Telangana: మాస్క్‌ ధరలు.. తగ్గేదే లే!)

Advertisement
Advertisement