ప్రముఖ మోటార్ సైకిల్ తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల మార్కెట్‌లోకి ప్రవేశించడానికి రంగం సిద్ధం చేస్తోంది. కంపెనీ సీఈఓ బి.గోవిందరాజన్ వెల్లడించిన వివరాల ప్రకారం కంపెనీ 2026లో తమ మొదటి ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్లను మార్కెట్లోకి తీసుకురానుంది. ఈమేరకు ఇటలీలో జరిగిన ఈఐసీఎంఏ 2025లో ప్రకటన చేశారు.
ఈ సందర్భంగా గోవిందరాజన్ మాట్లాడుతూ..‘మేము 2026లో మార్కెట్లోకి ఎలక్ట్రిక్ బైక్‌ను తీసుకొస్తున్నాం. మొదట ఫ్లయింగ్ ఫ్లీ C6 పేరుతో కొత్త మోడల్‌ను ఆవిష్కరిస్తాం. తర్వాత ఫ్లయింగ్ ఫ్లీS6 మార్కెట్‌లోకి వస్తుంది. అయితే మొదట ఈ బైక్‌లు యూరప్‌లో అందుబాటులోకి వస్తాయి. తర్వాత కొద్ది రోజులకు భారత వినియోగదారులకు అందుబాటులో ఉంటాయి’ అని చెప్పారు.
రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎలక్ట్రిక్ మొబిలిటీ విభాగం ఫ్లయింగ్ ఫ్లీ అనే బ్రాండ్‌తో మార్కెట్‌లోకి రానుంది. కంపెనీ రెండో ప్రపంచ యుద్ధం నాటి తేలికపాటి మోటార్ సైకిళ్ల నుంచి ప్రేరణ పొంది వీటిని డిజైన్ చేస్తున్నట్లు ఇదివరకే తెలిపింది. అయితే ఈ మోడళ్లను ఏ ధరకు అందుబాటులోకి తీసుకురానున్నారో ఇంకా తెలియాల్సి ఉంది.
ఇదీ చదవండి: టాటా ట్రస్ట్‌లో ఆధిపత్య పోరు ముగిసినట్లేనా?


