
రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్లను ఇక ఆన్లైన్లో కొనుగోలు చేయొచ్చు. ప్రీమియం బైక్‌ల తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ ఈ మేరకు ఈ-కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. బిగ్ బిలియన్ డేస్ సేల్ కు ముందు రాయల్ ఎన్‌ఫీల్డ్ మాతృ సంస్థ ఐషర్ మోటార్స్ లిమిటెడ్ నుండి ఈ ప్రకటన వచ్చింది.
ఈ భాగస్వామ్యం కింద రాయల్ ఎన్ఫీల్డ్ 350 సీసీ మోడల్ రేంజ్ బైక్‌లు సెప్టెంబర్ 22 నుంచి ఈ-కామర్స్ వెబ్సైట్లో కొనుగోలుకు అందుబాటులోకి రానున్నాయి. జీఎస్టీ రేట్ల తగ్గింపు అమల్లోకి వచ్చే రోజు కూడా ఇదే కావడం గమానార్హం.
అంటే బిగ్ బిలియన్ డేస్ సేల్ సమయంలో వినియోగదారులు ఫ్లిప్ కార్ట్ లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ లను కొనుగోలు చేయొచ్చు. రాయల్ ఎన్ఫీల్డ్ తమ మోటార్ సైకిళ్లను ఆన్లైన్ లో అందించడం ఇదే మొదటిసారి. బుల్లెట్ 350, క్లాసిక్ 350, హంటర్ 350, గోవా క్లాసిక్ 350, న్యూ మెటియోర్ 350 వంటి మోడళ్లను ఫ్లిప్ కార్ట్ ద్వారా విక్రయించాలని కంపెనీ యోచిస్తోంది.
బెంగళూరు, గురుగ్రామ్, కోల్ కతా, లక్నో, ముంబైలలో ఉన్న కస్టమర్లు పూర్తి జీఎస్టీ ప్రయోజనాలతో పాటు వివిధ సౌకర్యవంతమైన చెల్లింపు ఎంపికలను ఉపయోగించి ఆర్డర్లు ఇవ్వవచ్చు. తమకు నచ్చిన మోడల్ బైక్లను కొనుగోలు చేయవచ్చు.