గేమింగ్‌తో ఆదాయం.. యువతకు కొత్త అవకాశాలు! | Roblox Indicates Massive Potential of India Vibrant Creator Ecosystem | Sakshi
Sakshi News home page

గేమింగ్‌తో ఆదాయం.. యువతకు కొత్త అవకాశాలు!

Oct 23 2026 4:13 PM | Updated on Oct 23 2026 4:18 PM

Roblox Indicates Massive Potential of India Vibrant Creator Ecosystem

గేమ్స్‌ ఆడటమంటే చాలామందికి సరదా మాత్రమే. కానీ ఇప్పుడు అదే గేమింగ్‌ ద్వారా డబ్బు సంపాదించే అవకాశాలు కూడా పెరుగుతున్నాయి. గేమ్స్‌ ఆడటంతో పాటు సొంతంగా గేమ్స్‌ తయారు చేసి, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకోవచ్చు. ఈ అవకాశాలను మరింత విస్తరించడంపై ప్రముఖ గేమింగ్‌ ప్లాట్‌ఫామ్‌ రోబ్లాక్స్‌ దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా.. న్యూఢిల్లీలో 'అన్‌బాక్స్‌ రోబ్లాక్స్‌' కార్యక్రమాన్ని నిర్వహించి, భారత్‌లో గేమింగ్‌ రంగానికి ఉన్న అవకాశాలను వివరించే నివేదికను విడుదల చేసింది.

భారత్‌లో 50 కోట్లకు పైగా గేమర్లు ఉన్నారని, దేశ వీడియో గేమ్‌ పరిశ్రమ ఆదాయం 2025లో సుమారు రూ.6,300 కోట్లుగా ఉండగా, 2028 నాటికి రూ.9,200 కోట్లకు చేరవచ్చని నివేదిక అంచనా వేసింది. భారత్‌లో రోబ్లాక్స్‌ రోజువారీ యాక్టివ్‌ యూజర్ల సంఖ్య 2020 నుంచి 2025 మధ్య ఏటా సగటున 76 శాతం పెరిగింది. రోబ్లాక్స్‌ ఇండియా, దక్షిణాసియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ సునీల్‌ రావు మాట్లాడుతూ, రాబోయే రోజుల్లో ఈ ప్లాట్‌ఫామ్‌పై పెద్ద హిట్‌ గేమ్‌ను భారతీయ క్రియేటర్లే రూపొందించే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.

రోబ్లాక్స్‌ ప్రత్యేకత ఏమిటంటే.. ఇందులో గేమ్స్‌ ఆడటమే కాకుండా, సొంతంగా గేమ్స్‌ తయారు చేసుకోవచ్చు. ఇందుకోసం ముందుగానే గేమ్‌ డెవలప్‌మెంట్‌లో నిపుణులై ఉండాల్సిన అవసరం లేదు. సర్వేలో పాల్గొన్న భారతీయ క్రియేటర్లలో 94 శాతం మంది పెద్దగా అనుభవం లేకపోయినా గేమ్స్‌ రూపొందించగలమని తెలిపారు. 2025 నాటికి రోబ్లాక్స్‌ ద్వారా చెల్లింపులు పొందేందుకు అర్హత సాధించిన భారతీయ క్రియేటర్ల సంఖ్య 250 దాటింది. వీరికి జరిగిన మొత్తం చెల్లింపులు కూడా 2020 నుంచి 2025 మధ్య ఏటా సగటున 72 శాతం పెరిగినట్లు నివేదిక వెల్లడించింది.

భారత్‌లోనే ఉంటూ విదేశీ యూజర్లను చేరుకోవడం కూడా ఈ ప్లాట్‌ఫామ్‌లోని మరో ప్రత్యేకత. బెంగళూరుకు చెందిన స్మాల్‌ వరల్డ్‌ గేమ్స్‌ రూపొందించిన 'డెత్‌ బాల్‌' గేమ్‌కు 1.6 బిలియన్లకు పైగా విజిట్లు రాగా, 'రాకెట్‌ రైవల్స్‌'కు 560 మిలియన్లకు పైగా విజిట్లు వచ్చాయి. అలాగే, న్యూఢిల్లీకి చెందిన అర్జున్‌ గోయల్‌ కోడింగ్‌ నేపథ్యం లేకపోయినా.. 3డీ డిజైన్‌ నేర్చుకుని డిజిటల్‌ ఫ్యాషన్‌ వ్యాపారాన్ని అభివృద్ధి చేశారు. ఆయన రూపొందించిన డిజిటల్‌ వస్తువులు 25 లక్షలకు పైగా అమ్ముడయ్యాయని నివేదిక తెలిపింది.

రోబ్లాక్స్‌ క్రియేటర్ల కార్యకలాపాలు 2020 నుంచి 2025 వరకు భారత్‌ జీడీపీకి సుమారు రూ.123.9 కోట్ల మేరకు దోహదపడ్డాయని యాక్సెస్‌ పార్ట్‌నర్‌షిప్‌ నివేదిక అంచనా వేసింది. 2025లో దేశవ్యాప్తంగా సుమారు 510 పూర్తికాల ఉద్యోగాలకు సమానమైన ఉపాధికి మద్దతు లభించినట్లు పేర్కొంది. అయితే గేమ్స్‌ తయారు చేసినంత మాత్రాన ఆదాయం వస్తుందని చెప్పలేం. మంచి ఆలోచనలు, కొత్త నైపుణ్యాలు, యూజర్లను ఆకట్టుకునే గేమ్స్‌ అవసరం. ఆసక్తి ఉన్న యువతకు మాత్రం గేమింగ్‌ ఇప్పుడు కాలక్షేపాన్ని మించి సృజనాత్మకతను కెరీర్‌గా మార్చుకునే అవకాశాన్ని అందిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement