మొండిబకాయిలు, బంగారం విషయాల్లో రిస్క్‌ తక్కువేనంట

Risks Increase For The Nbfc Sector Says Icra  - Sakshi

ముంబై: కరోనా సెకండ్‌వేవ్‌ నాన్‌బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీల(ఎన్‌బీఎఫ్‌సీ) రుణాలపైనా ప్రతికూల ప్రభావం చూపనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) ముగిసే మార్చి నాటికి ఎన్‌బీఎఫ్‌సీల మొండిబకాయిలు (ఎన్‌పీఏ) ఒక శాతం వరకూ పెరిగే అవకాశం ఉందని రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా అంచనా వేస్తోంది.

ఇదే జరిగితే ఒత్తిడిలో ఉన్న ఎన్‌బీఎఫ్‌సీల రుణ శాతం దాదాపు 8 శాతం వరకూ (దాదాపు రూ.2 లక్షల కోట్లు) పెరిగే అవకాశం ఉంది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రుణ పునర్‌ వ్యవస్థీకరణసైతం రెట్టింపై 3.3 శాతానికి చేరవచ్చని అంచనావేసింది. 2020–21లో ఇది 1.6 శాతం మాత్రమే కావడం గమనార్హం.  

తగ్గిన వసూళ్ల సామర్థ్యం..
ఎన్‌బీఎఫ్‌సీలతోపాటు, హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీల (హెచ్‌ఎఫ్‌సీ) వసూళ్ల సామర్థ్యం మహమ్మారి వల్ల తీవ్రంగా పడిపోయినట్లు ఇక్రా పేర్కొంది. మూడవవేవ్‌ సమస్యలు లేకుండా ఉంటే, ఈ రంగం కొంత మెరుగుపడే అవకాశం ఉందని విశ్లేషించింది. ఆయా అంశాల నేపథ్యంలో ఈ రంగానికి ‘‘నెగటివ్‌’’ అవుట్‌లుక్‌ ఇస్తున్నట్లు పేర్కొంది. నాన్‌ బ్యాంకింగ్‌ రూ.24 లక్షల కోట్ల రుణాల్లో 30 శాతం ‘‘హై రిస్క్‌ కేటగిరీ’’ (తీవ్ర ఇబ్బందికరమైన)లో ఉన్నాయని పేర్కొంది.

ఆయా రంగాలను పరిశీలిస్తే, సూక్ష్మ, వ్యక్తిగత, లఘు, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు ఇచ్చిన రుణాలు ఇందులో ఉన్నాయని పేర్కొంది. రియల్టీ కూడా ఇదే కోవలోకి వస్తుందని తెలిపింది. అయితే బంగారం, హౌసింగ్‌ విషయాల్లో రిస్క్‌ కొంత తక్కువగా  ఉందని వివరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ రంగానికి రూ.2 లక్షల కోట్ల అదనపు మూలధనం అవసరం అవుతుందని కూడా ఇక్రా అంచనావేస్తోంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top