
చట్టవిరుద్ధంగా కంపెనీ రహస్య పత్రాలను దొంగలించి మైక్రోసాఫ్ట్‌తో పంచుకున్న ఇంటెల్ మాజీ ఇంజినీర్‌కు రెండేళ్ల జైలు శిక్షతోపాటు 34,000 డాలర్ల(సుమారు రూ.29 లక్షలు)కు పైగా జరిమానా విధించించారు. ఇంటెల్‌లో ప్రొడక్ట్ మార్కెటింగ్ ఇంజినీర్‌గా దాదాపు పదేళ్లు పనిచేసిన వరుణ్ గుప్తాకు ఇటీవల ఈమేరకు శిక్ష ఖరారు చేశారు. ఈ దుష్ప్రవర్తన కారణంగా మైక్రోసాఫ్ట్ కూడా వరుణ్‌ను పదవి నుంచి తొలగించింది.
అసిస్టెంట్ యూఎస్ అటార్నీ విలియం నరస్ తెలిపిన వివరాల ప్రకారం.. గుప్తా ఇంటెల్ కంపెనీకి 2020లో రాజీనామా చేయడానికి ముందు సంస్థ కేటాయించిన కంప్యూటర్ నుంచి వేలాది రహస్య ఫైళ్లను వ్యక్తిగత హార్డ్ డ్రైవ్‌కు బదిలీ చేసుకున్నాడు. తర్వాత కంప్యూటర్ ప్రాసెసర్లతో కూడిన ఒప్పందంతో మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగంలో చేరాడు. ఇంటెల్‌లో దొంగలించిన ఫైళ్లను కొంత కాలానికి మైక్రోసాఫ్ట్‌లో యాక్సెస్ చేశాడు. గుప్తా యాక్సెస్ చేసిన డాక్యుమెంట్లలో ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంది. ఇది ఇంటెల్ ధరల వ్యూహాన్ని సూచిస్తుంది.
ఇదీ చదవండి: చదువుతో ఆర్థిక అక్షరాస్యత వస్తుందా?
ఈ కారణంగా మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగం కోల్పోవడంతోపాటు ఇంటెక్ కంపెనీకి జరిమానాగా 34,000 డాలర్లు చెల్లించాలని కోర్టు తీర్పు ఇచ్చింది. గుప్తా తన చర్యలకు విచారం వ్యక్తం చేస్తూ..తాను తీసుకున్న చెడు నిర్ణయంతో చాలా కోల్పోయానని చెప్పాడు. ఇంటెల్, మైక్రోసాఫ్ట్‌తోపాటు ప్రభుత్వానికి క్షమాపణలు చెప్పాడు. పని చేస్తున్న సంస్థను ఎంతో గౌరవించాలని, తప్పు చేస్తే ఎప్పటికైనా శిక్ష తప్పదని ఈ వార్తపై కొందరు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.