
చదువుకు, ఆర్థిక అక్షరాస్యతకు సంబంధం ఉందా అంటే లేదనే చెప్పొచ్చు. దేశంలోనే అధిక అక్షరాస్యత శాతం కలిగిన రాష్ట్రంగా కేరళకు గుర్తింపు ఉంది. అదే సమయంలో లాటరీ టికెట్లు కొని భారీగా డబ్బు నష్టపోతున్న జనాభా ఎక్కువగా ఉన్న రాష్టంగా కూడా కేరళకు గుర్తింపు ఉంది. దాంతో చదువు ఆర్థిక పరిజ్ఞానాన్ని పూర్తిగా నేర్పించడం లేదనే అభిప్రాయలున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలకు చదువుల్లో ఆర్థిక సంబంధ అంశాలపై పరిజ్ఞానం పెంచాలని కొందరు భావిస్తున్నారు. ఇప్పటికే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఈమేరకు అకడమిక్ సిలబస్‌లో ఫైనాన్షియల్ టాపిక్స్‌ను బోధిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలు మాత్రం ఇంకా చర్యలు తీసుకోలేదు. అందుకు ఏవరి కారణాలు వారికి ఉంటాయి. ఈ సంగతి అటుంచితే తల్లిదండ్రులుగా పిల్లల ఫైనాన్షియల్ లిటరసీ పెరగడానికి ఏం చేయాలనే దానిపై దృష్టి సారించాలి.
పిల్లలు చాలా సమయాల్లో సాధారణంగా మనం చెప్పింది చేయరు. మనం ఏదైనా పని చేస్తూ ఉంటే వారు చూస్తూ దాన్ని అనుకరిస్తారు. అంటే ముందు తల్లిదండ్రులకు ఫైనాన్షియల్ డిసిప్లెయిన్ ఉండి, క్రమశిక్షణగా నడుచుకుంటుంటే దాన్ని చూసి పిల్లలు నేర్చుకుంటారు. తరగతి గదిలో చెప్పిన పాఠం కంటే ప్రయోగశాలలో నేర్చుకుంది ఎక్కువగా గుర్తుంటుంది.
పిల్లలకి ఫైనాన్షియల్ డిసిప్లెయిన్ నేర్పించాలంటే పరిస్థితులను అనుసరించి వీలైప్పుడు ఆర్థిక లావాదేవీల్లో వారిని ఇన్‌వాల్వ్ చేయాలి. ఉదాహరణకు.. మీరు సూపర్ మార్కెట్‌కు వెళ్లాలనుకుంటున్నారు. ముందే బడ్జెట్ రాసుకోండి. ఈరోజు మీరు చేయబోయే షాపింగ్ రూ.3000.. కొనవాల్సిన వస్తువులు ఇవి..అని జాబితా సిద్ధం చేసుకోవాలి. షాపులోకి వెళ్లాక వాటిని బడ్జెట్‌లో కొనటం ఎలాగో పిల్లలకి టాస్క్ ఇవ్వండి. ప్రాక్టికల్‌గా చూపించండి. ఆ సమయంలో అవసరాలు, అత్యావసరాలు, నిత్యావసరాలు ఏంటో గమనించేలా చేయాలి. భవిష్యత్తులో ఏదైనా షాపింగ్ వెళ్లినప్పుడు పిల్లలకి బడ్జెట్ కేటాయించాలి. దాన్ని దాటి చేసే ఖర్చులను కట్టడి చేయాలి. ఉన్న బడ్జెట్‌లో క్వాలిటీ వస్తువులను ఎలా ఎంచుకోవాలి.. అందుకు ఏయే మార్గాలున్నాయో తెలియజేయాలి. క్రమంగా కొంతకాలంపాటు దీన్ని అనుసరిస్తే తప్పకుండా పిల్లల్లో మార్పు వస్తుంది.
ఇదీ చదవండి: బడ్జెట్ కార్ల ధరలో రూ.80,000 వరకు రాయితీ?