ఆయిల్ కంపెనీలకు ఉపశమనం.. రూ.30,000 కోట్లు కేటాయింపు

ప్రభుత్వరంగ చమురు విక్రయ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ఉపశమనం కల్పించింది. 10 నెలలుగా పెట్రోల్, డీజిల్ విక్రయ ధరలను సవరించకుండా నష్టపోయిన బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్, ఐవోసీ కోసం రూ.30,000 కోట్లను ఆర్థిక మంత్రి కేటాయించారు. అంతర్జాతీయంగా ధరలు గణనీయంగా పెరిగినప్పటికీ, 2021 ఏప్రిల్ 6 నుంచి ఈ సంస్థలు ధరలను సవరించకుండా విక్రయిస్తున్నాయి.
బ్యారెల్ చమురు ధర 116 డాలర్లకు వెళ్లిన సమయంలో వాటికి ఎక్కువ నష్టం వచ్చింది. ఆ తర్వాత చమురు ధరలు తగ్గడంతో పెట్రోల్‌పై లాభం వస్తుండగా, డీజిల్‌పై ఇప్పటికీ నష్టపోతున్నాయి. 2022–23లో ఏప్రిల్–సెప్టెంబర్ కాలానికి ఈ మూడు ఉమ్మడిగా రూ.21,200 కోట్ల నష్టాలను ప్రకటించడం గమనార్హం. పైగా వీటికి రెండేళ్లుగా ఎల్పీజీ సబ్సిడీ చెల్లింపులు కూడా చేయలేదు. దీంతో రూ.50,000 కోట్లను ఇవ్వాలని అవి కోరగా, ప్రభుత్వం రూ.30,000 కోట్లను కేటాయించింది.
సంబంధిత వార్తలు