
న్యూఢిల్లీ : కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ ఉన్నదీ, లేనిదీ రెండు గంటల్లోనే ఫలితమిచ్చే ఆర్‌టీ–పీసీఆర్ టెస్ట్ కిట్‌ను రిలయన్స్ లైఫ్ సైన్సెస్ అభివృద్ధి చేసింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆర్‌టీ–పీసీఆర్ కిట్లు ఫలితాన్నిచ్చేందుకు 24 గంటల సమయాన్ని తీసుకుంటున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థయే రిలయన్స్ లైఫ్ సైన్సెస్. సార్స్ కోవిడ్–2కు సంబంధించి 100 జీనోమ్‌లను విశ్లేషించిన అనంతరం ఈ కిట్‌ను రిలయన్స్ లైఫ్ సైన్సెస్ శాస్తవేత్తలు రూపొందించినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కరోనా నిర్ధారణకు ఆర్‌టీ పీసీఆర్ పరీక్షను అత్యంత విశ్వసనీయమైనదిగా పరిగణిస్తున్న విషయం తెలిసిందే. రిలయన్స్ లైఫ్ సైన్సెస్ ప్రత్యేకంగా నిర్వహించిన మరో అధ్యయనంలో.. కరోనా కారణంగా మరణాల రేటు 2020 చివరికి గణనీయంగా తగ్గుతుందని తెలిసింది.