స్టార్టప్స్‌కు తగ్గిన నిధులు

Reduced funding for startups - Sakshi

క్యూ1లో 75 శాతం క్షీణత

58 శాతం పడిపోయిన డీల్స్‌ 

ఇంక్‌42 ఇండియన్‌ టెక్‌ స్టార్టప్‌ ఫండింగ్‌ నివేదికలో వెల్లడి 

భారతీయ స్టార్టప్స్‌ 2022 క్యూ1లో 12 బిలియన్‌ డాలర్ల నిధులను అందుకున్నాయి. 2023 జనవరి–మార్చిలో ఇది 3 బిలియన్‌ డాలర్లకు పడిపోవడం ఆందోళన కలిగించే అంశం.

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: యూనికార్న్‌ కంపెనీల జాబితాలో 2023 జనవరి–మార్చిలో కొత్తగా ఏ కంపెనీ చోటు సంపాదించలేదు. 2022 క్యూ1తో పోలిస్తే నిధులు 75 శాతం పడిపోయాయి. డీల్స్‌ సంఖ్య 58 శాతం తగ్గింది. 100 మిలియన్‌ డాలర్ల కంటే ఎక్కువ విలువ చేసే డీల్స్‌ 77 శాతం క్షీణించాయి. ఇదీ 2023 మార్చి త్రైమాసికంలో భారత స్టార్టప్స్‌ స్టోరీ. ఇంక్‌42 రూపొందించిన ఇండియన్‌ టెక్‌ స్టార్టప్‌ ఫండింగ్‌ నివేదికలో ఈ విషయాలు వెల్లడి అయ్యాయి.

ఫిన్‌టెక్‌ ముందంజలో.. 
మార్చి త్రైమాసికంలో అందుకున్న నిధుల విషయంలో ఫిన్‌టెక్‌ కంపెనీల వాటా ఏకంగా 44.9 శాతం ఉంది. ఈ–కామర్స్‌ 22.1 శాతం, ఎంటర్‌ప్రైస్‌టెక్‌ 6.8, కంన్జ్యూమర్‌ సర్విసెస్‌ 6.5, డీప్‌టెక్‌ 5.1, ఎడ్‌టెక్‌ 3.5, మీడియా, వినోదం 2.7, ఇతర కంపెనీలు 8.4 శాతం కైవసం చేసుకున్నాయి.

డీల్స్‌ సంఖ్య పరంగా ఎంటర్‌ప్రైస్‌టెక్‌ 41, ఈ–కామర్స్‌ 40, ఫిన్‌టెక్‌ 25, డీప్‌టెక్‌ 21, ఎడ్‌టెక్‌ 17, మీడియా, వినోదం 16, హెల్త్‌కేర్‌ 13, ఇతర రంగాల కంపెనీలు 40 చేజిక్కించుకున్నాయి. విలీనాలు, కొనుగోళ్లు 2022 క్యూ1లో ఆల్‌టైమ్‌ హై రికార్డులతో 100 నమోదైతే, ఈ ఏడాది ఇదే కాలంలో 35కు వచ్చి చేరాయి. 2022 సెపె్టంబర్‌లో టాటా 1 ఎంజీ తర్వాత యూనికార్న్‌ కంపెనీల జాబితాలో కొత్త కంపెనీ చేరకపోవడం గమనార్హం.  

పడిన సీడ్‌ ఫండింగ్‌.. 
మందగమనం ఉన్నప్పటికీ భారత్‌ స్టార్టప్స్‌కు అత్యధిక సీడ్‌ ఫండింగ్‌ 2022లో సమకూరింది. గత ఎనిమిదేళ్లలో ఇదే అత్యధికం. 2014 నుంచి 2022 మధ్య సేకరించిన 5 బిలియన్‌ డాలర్ల సీడ్‌ ఫండ్‌లో 2 బిలియన్‌ డాలర్లు 2022లో నమోదు కావడం విశేషం. సీడ్‌ ఫండింగ్‌ గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 2023 మార్చి త్రైమాసికంలో 81% క్షీణించి 180 మిలియన్‌ డాలర్లుగా ఉంది.

స్టార్టప్‌ వ్యవస్థలో భారీ నిధుల దిద్దుబాటును ఇది సూచిస్తోంది. మార్కెట్లు పుంజుకున్న తర్వాత మంచి వాల్యుయేషన్‌తో నిధులను సేకరించాలని వ్యవస్థాపకులు యోచిస్తున్నారు. వర్కింగ్‌ క్యాపిటల్‌కు  చివరి దశలో రుణ నిధుల సాధనాల వైపు పరిశ్రమ మళ్లాల్సి వస్తోంది. 

కారణం ఏమంటే.. 
కొనసాగుతున్న రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం, రూపాయి విలువ పడిపోవడం, సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌ పతనం, ఆర్థిక అనిశ్చితి వంటి ఇతర విషయాల కారణంగా పెట్టుబడిదారులు భయపడుతున్నారు. అంతే కాకుండా భారతీయ స్టార్టప్‌ల ఆదాయాలు క్షీణించడం, వాటి పెరుగుతున్న నష్టాలు, వ్యాపారాలను తదుపరి స్థాయికి తీసుకువెళ్లేందుకు వ్యవస్థాపకులు వ్యూహాలను కనుగొనడంలో విఫలం కావడం పెట్టుబడి సెంటిమెంట్‌ను స్పష్టంగా దెబ్బతీసింది.

2021 బుల్‌ రన్‌ తర్వాత నిధుల రాక తీరు చూస్తుంటే మహమ్మారి ముందస్తు స్థాయికి పడిపోయినట్టు అవగతమవుతోంది. ఈ సంవత్సరం వృద్ధి దశలో మూలధనాన్ని సేకరించడం సవాలుగా ఉంటుందని 84% పెట్టుబడిదారులు అభిప్రాయపడ్డారు.

ఇవీ గణాంకాలు.. 
సిరీస్‌ సి–రౌండ్స్‌లో గరిష్ట కరెక్షన్‌తో ఈ ఏడాది జనవరి–మార్చిలో మెగా డీల్స్‌ 77 శాతం పడిపోయి ఏడుకు వచ్చి చేరాయి. 2022 క్యూ1లో ఈ సంఖ్య 30గా ఉంది. మెగా డీల్స్‌ సంఖ్య తగ్గడం 2023 క్యూ1లో భారతీయ స్టార్టప్‌లు సేకరించిన మొత్తం నిధులపై ప్రభావం చూపింది. ఫండింగ్‌ పరంగా ఈ ఏడాది క్యూ1లో టాప్‌–3లో నిలిచిన ఫోన్‌పే 650 మిలియన్‌ డాలర్లు, లెన్స్‌కార్ట్‌ 500 మిలియన్‌ డాలర్లు, ఇన్సూరెన్స్‌దేఖో 150 మిలియన్‌ డాలర్లు అందుకున్నాయి.

గతేడాది జనవరి–మార్చిలో మొత్తం 506 డీల్స్‌ నమోదయ్యాయి. 2023 మార్చి క్వార్టర్‌లో ఈ సంఖ్య 213కు పరిమితమైంది. 2020 క్యూ1లో 3.4 బిలియన్‌ డాలర్ల విలువ చేసే 212 డీల్స్‌ నమోదయ్యాయి. 2023 మార్చి త్రైమాసికంలో లేట్‌ స్టేజ్‌ ఫండింగ్‌ 77 శాతం పడిపోయి 1.8 బిలియన్‌ డాలర్లకు వచ్చి చేరింది. గ్రోత్‌ స్టేజ్‌ ఫండింగ్‌ 76% క్షీణించి 700 మిలియన్‌ డాలర్లకు వచ్చి చేరింది. సిరీస్‌–ఏ డీల్స్‌ 58 నుంచి 30కి, సిరీస్‌–బీ డీల్స్‌ 28 నుంచి 4కు పడిపోయాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top