
ఆరు నెలల్లో రూ.26,300 కోట్లు
గతేడాది కంటే 37 శాతం తక్కువ
న్యూఢిల్లీ: దేశ రియల్ ఎస్టేట్ మార్కెట్లో సంస్థాగత (ఇనిస్టిట్యూషన్స్) పెట్టుబడులు ఈ ఏడాది తొలి ఆరు నెలల కాలంలో (జనవరి–జూన్) 37 శాతం తక్కువగా 3.06 బిలియన్ డాలర్లు (రూ.26,300 కోట్లు)గా ఉండొచ్చని ఈ రంగానికి చెందిన కన్సల్టెంట్ జేఎల్‌ఎల్ ఇండియా తెలిపింది. ఇందులో హౌసింగ్ ప్రాజెక్టుల వాటా 38 శాతం ఉంటుందని అంచనా వేసింది. అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ అనిశి్చతులు, ఆర్థిక సవాళ్లు నెలకొనడాన్ని కారణంగా పేర్కొంది. దీంతో పెట్టుబడుల లావాదేవీల గడువు పొడిగింపునకు గురవుతున్నట్టు వివరించింది.
క్రితం ఏడాది మొదటి ఆరు నెలల్లో రియల్ ఎస్టేట్‌లో ఇనిస్టిట్యూషన్స్ 4.89 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసినట్టు జేఎల్‌ఎల్ ఇండియా నివేదిక తెలిపింది. ఈ ఏడాది మొదటి ఆరు నెలల కాలంలో మొత్తం సంస్థాగత పెట్టుబడుల్లో.. విదేశీ ఇన్వెస్టర్ల వాటా 68 శాతంగా ఉంటే, దేశీ ఇనిస్టిట్యూషన్స్ మిగిలిన 32 శాతం వాటాను ఆక్రమించినట్టు పేర్కొంది. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్‌లు (రీట్ లు), క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషన్ ప్లేస్‌మెంట్ (క్యూఐపీలు), లిస్టెడ్ సంస్థల్లో సంస్థాగత ఇన్వెస్టర్ల పెట్టుబడులు కొనసాగుతున్నట్టు జేఎల్‌ఎల్ ఇండియా నివేదిక వెల్లడించింది.
పెట్టుబడులకు ఆకర్షణీయం..
‘‘భారత రియల్ ఎస్టేట్ రంగం ఇప్పటికీ పెట్టుబడులకు ఆకర్షణీయ కేంద్రంగా కొనసాగుతోంది. అంతర్జాతీయ అనిశ్చితుల కారణంగా ఈ ఏడాది మొదటి 6 నెలల్లో సవాళ్లు నెలకొన్నప్పటికీ దేశీ, విదేశీ ఇన్వెస్టర్లలో విశ్వాసం కొనసాగింది’’అని జేఎల్‌ఎల్ ఇండియా క్యాపిటల్ మార్కెట్స్ హెడ్ లతా పిళ్లై తెలిపారు. గత 5 ఏళ్లుగా రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు 5 బిలియన్ డాలర్లకు మించి నమోదవుతున్నట్టు గుర్తు చేశారు. ఈ ఏడాది దీనికి అనుగుణంగానే ఉండొచ్చన్నారు.