
బుధవారం మానిటరీ పాలసీ సమీక్ష
ఎస్‌బీఐ, ఎల్‌ఐసీ.. క్యూ1 ఫలితాలు
జాబితాలో ఎయిర్‌టెల్, టాటా మోటార్స్ బజాజ్ ఆటో, హీరో మోటో, అదానీ పోర్ట్స్
ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లు ప్రధానంగా రిజర్వ్ బ్యాంక్ పరపతి నిర్ణయాలవైపు దృష్టి సారించనున్నాయి. అంతేకాకుండా ఇప్పటికే జోరందుకున్న ఏప్రిల్–జూన్(క్యూ1) ఫలితాలు సైతం సెంటిమెంటును ప్రభావితం చేయనున్నాయి. వీటికితోడు అంతర్జాతీయ అంశాలు, ఆర్థిక గణాంకాలు సైతం కీలకంకానున్నట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
గత వారాంతాన ఫెడరల్ బ్యాంక్, ఏబీబీ ఇండియా, జేకే లక్ష్మీ సిమెంట్ తదితరాలు ఈ ఆర్థిక సంవత్సరం(2025–26) తొలి త్రైమాసిక ఫలితాలు ప్రకటించాయి. వీటికితోడు మరిన్ని దిగ్గజాలు ఈ వారం ఏప్రిల్–జూన్(క్యూ1) పనితీరును వెల్లడించనున్నాయి. ఈ జాబితాలో బాష్, శ్రీసిమెంట్స్, మారికో, ఏబీ క్యాపిటల్, భారతీ ఎయిర్‌టెల్, అదానీ పోర్ట్స్, బ్రిటానియా, బజాజ్ ఆటో, ట్రెంట్, పిడిలైట్ ఇండస్ట్రీస్, పీఎఫ్‌సీ, హీరో మోటోకార్ప్, బీహెచ్‌ఈఎల్, ఎల్‌ఐసీ, టైటన్ కంపెనీ, హెచ్‌పీసీఎల్, స్టేట్‌బ్యాంక్, టాటా మోటార్స్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్ తదితరాలున్నాయి. నేడు(సోమవారం) ఫెడరల్ బ్యాంక్, ఏబీబీ, జేకే లక్ష్మీ సిమెంట్ కౌంటర్లలో యాక్టివిటీ కనిపించనున్నట్లు రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్‌వీపీ అజిత్ మిశ్రా పేర్కొన్నారు.
గత పాలసీలో స్పీడ్
రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అధ్యక్షతన సమావేశమైన మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) గత సమీక్షలో అనూహ్యంగా కీలక వడ్డీ రేటు రెపోలో 0.5 శాతం కోత పెట్టింది. దీంతో మే నెలలో రెపో రేటు 5.5 శాతానికి దిగివచి్చంది. ఆర్థికవేత్తలు 0.25 శాతం తగ్గింపు అంచనా వేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి చూస్తే రెపో రేటు 1 శాతం తగ్గింది. ఫలితంగా 2022 ఆగస్ట్ తదుపరి వడ్డీ రేట్లు కనిష్టానికి చేరాయి.
నేడు ప్రారంభంకానున్న ఆర్‌బీఐ పాలసీ సమీక్షా సమావేశాలు బుధవారం(6న) ముగియనున్నాయి. యూఎస్ టారిఫ్‌ల విధింపు, 3 శాతానికంటే దిగువకు చేరిన ద్రవ్యోల్బణం, ఈ ఏడాది ద్వితీయార్థంలో జీడీపీ నెమ్మదించవచ్చన్న అంచనాలు మరో 0.25 శాతం రేట్ల కోతకు వీలున్నట్లు ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. అయితే గత రేట్ల కోత, ఈ ఏడాది తొలి 3 నెలల్లో జీడీపీ 7.4 శాతం వృద్ధి అంచనాల నేపథ్యంలో యథాతథ రేట్ల అమలుకే కట్టుబడవచ్చని మరికొంతమంది నిపుణులు అభిప్రాయపడ్డారు. దీంతో ఇన్వెస్టర్లు పాలసీ నిర్ణయాలపై దృష్టి పెట్టనున్నట్లు స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ సీనియర్ టెక్నికల్ అనలిస్ట్ ప్రవేష్ గౌర్ తెలియజేశారు.
విదేశీ గణాంకాలు
జులై నెలకు చైనా సరీ్వసుల రంగ గణాంకాలు మంగళవారం(5న) వెలువడనున్నాయి. గురువారం(7న) వాణిజ్య గణాంకాలు వెల్లడికానున్నాయి. జూన్‌లోనే చైనా వాణిజ్య మిగులు దాదాపు 115 బిలియన్ డాలర్లకు చేరింది. అంతక్రితం 99 బిలియన్ డాలర్లుగా నమోదైంది. కాగా.. జులై నెలకు యూఎస్ తయారీ, సరీ్వసుల రంగ గణాంకాలు సైతం సోమ, మంగళవారాల్లో వెలువడనున్నాయి. ఇక ఈ వారం బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్(బీవోఈ) వడ్డీ రేట్ల సమీక్షను చేపట్టనుంది.
ఇతర అంశాలు..
యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ తాజాగా భారత్‌పై 25 శాతం టారిఫ్‌లను విధించడంతో 48 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులపై ప్రతికూల ప్రభావం పడనున్నట్లు అంచనాలు వెలువడ్డాయి. ప్రధానంగా టెక్స్‌టైల్స్, ఫార్మా, రత్నాభరణాలు, ఆక్వా, ఫుట్‌వేర్, కెమికల్స్ తదితర పలు రంగాలకు సవాళ్లు ఎదురుకానున్నట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి.
ఇవి మార్కెట్ సెంటిమెంటును దెబ్బతీసినట్లు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ వెల్త్ మేనేజ్‌మెంట్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా, జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్ పెట్టుబడుల ప్రధాన వ్యూహకర్త వీకే విజయకుమార్ తెలియజేశారు. మరోపక్క గత నెలలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) దేశీ స్టాక్స్‌లో అమ్మకాలకే అధిక ప్రాధాన్యమిస్తూ వచి్చనట్లు వివరించారు. జూలైలో నికరంగా రూ.17,741 కోట్ల విలువైన షేర్లను నికరరంగా విక్రయించారు.
గత వారం డీలా..
శుక్రవారం(ఆగస్ట్ 1)తో ముగిసిన గత వారం స్టాక్ మార్కెట్లు వరుసగా ఐదో వారం నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్(బీఎస్‌ఈ) 863 పాయింట్లు(1.1 శాతం) క్షీణించి 80,560 వద్ద నిలిచింది. నిఫ్టీ(ఎన్‌ఎస్‌ఈ) 272 పాయింట్లు(1.1 శాతం) నీరసించి 24,565 వద్ద స్థిరపడింది. ఈ బాటలో బీఎస్‌ఈ మిడ్ క్యాప్ 1.8 శాతం, స్మాల్ క్యాప్ 2.5 శాతం చొప్పున పతనమయ్యాయి.
సాంకేతికంగా చూస్తే..
యూఎస్ టారిఫ్‌ల విధింపు, ఎఫ్‌పీఐల అమ్మకాలకుతోడు గత వారాంతాన ప్రపంచ మార్కెట్లు డీలా పడటంతో దేశీయంగా సెంటిమెంటు బలహీనపడినట్లు సాంకేతిక నిపుణులు పేర్కొన్నారు. దీంతో మార్కెట్లు మరింత బలహీనపడవచ్చని అభిప్రాయపడ్డారు. వీటి ప్రకారం సాంకేతికంగా ఎన్‌ఎస్‌ఈ ప్రధాన ఇండెక్స్ నిఫ్టీ 24,900 స్థాయిలో నిలదొక్కుకోలేకపోయింది. ఒక దశలో 24,550 దిగువకు చేరింది. దీంతో ఈ వారం 24,450 వద్ద తొలి మద్దతు లభించవచ్చు. ఇక్కడినుంచి పుంజుకుంటే 24,900–25,000కు తిరిగి చేరవచ్చు. ఇలాకాకుండా మరింత నీరసిస్తే 24,300కు, ఆపై 24,000 పాయింట్లస్థాయికి క్షీణించే వీలుంది.
– సాక్షి, బిజినెస్ డెస్క్