భారీగా పెరిగిన ఫిర్యాదులు! సమస్య పరిష్కారం కావాలంటే.. | Sakshi
Sakshi News home page

భారీగా పెరిగిన ఫిర్యాదులు! సమస్య పరిష్కారం కావాలంటే..

Published Tue, Mar 12 2024 1:34 PM

RBI Ombudsman Sees 68 Percent Rise In Complaints In FY2023 - Sakshi

ప్రభుత్వ, ప్రైవేట్‌ బ్యాంకులు అందిస్తున్న సేవల్లో పారదర్శకత, వినియోగదారులకు మరింత జవాబుదారీగా ఉండేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) అంబుడ్స్‌మన్‌ విధానాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ పథకం కింద 2022-23లో 7.03 లక్షల ఫిర్యాదులు నమోదయ్యాయి. అంతక్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇవి 68% పెరిగాయి. మొబైల్‌/ఎలక్ట్రానిక్‌ బ్యాంకింగ్‌, రుణాలు, ఏటీఎమ్‌/డెబిట్‌ కార్డులు, క్రెడిట్‌ కార్డులు, పింఛను చెల్లింపులు, రెమిటెన్స్‌, పారా బ్యాంకింగ్‌ తదితరాలకు సంబంధించి ఈ ఫిర్యాదులు వచ్చాయి.

ఇంటిగ్రేటెడ్‌ అంబుడ్స్‌మన్‌ స్కీమ్‌(ఆర్‌బీ-ఐఓస్‌)-2021 కింద ఆర్‌బీఐకి చెందిన 22 అంబుడ్స్‌మన్‌ కార్యాలయాలు(ఓఆర్‌బీఐఓలు), సెంట్రలైజ్డ్‌ రిసిప్ట్‌ అండ్‌ ప్రాసెసింగ్‌ సెంటర్‌(సీఆర్‌పీసీ), కాంటాక్ట్‌ సెంటర్‌లకు వచ్చిన ఫిర్యాదులతో తొలి స్టాండలోన్‌ వార్షిక నివేదిక(2022-23) వెలువడింది. ఈ నివేదిక ప్రకారం.. 2022-23లో మొత్తం 7,03,544 ఫిర్యాదులు వచ్చాయి. ఓఆర్‌బీఐఓల్లో సగటున 33 రోజుల్లో ఫిర్యాదులకు పరిష్కారం లభించింది. అంతక్రితం ఏడాది (2021-22) ఇది 44 రోజులుగా ఉంది. ఆర్‌బీ-ఐఓస్‌ కింద పరిష్కరించిన ఫిర్యాదుల్లో మెజారిటీ(57.48%) భాగం మ్యూచువల్‌ సెటిల్‌మెంట్‌, మధ్యవర్తిత్వం ద్వారానే జరిగాయి. చండీగఢ్‌, దిల్లీ, హరియాణ, రాజస్థాన్‌, గుజరాత్‌ నుంచి అత్యధిక ఫిర్యాదులు అందగా మిజోరాం, నాగాలాండ్‌, మేఘాలయ, మణిపుర్‌, అరుణాచల్‌ప్రదేశ్‌ నుంచి అతి తక్కువగా ఫిర్యాదులు వచ్చాయి.

ఏంటీ ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్‌మన్‌ స్కీమ్?

బ్యాంకింగ్, ఎన్‌బీఎఫ్‌సీ, డిజిట‌ల్ లావాదేవీలకు సంబంధించిన ఫిర్యాదుల ప‌రిష్కారం కోసం ఇప్పటి వరకు మూడు వేర్వేరు అంబుడ్స్‌మన్ పథకాలు పనిచేస్తున్నాయి. బ్యాంకింగ్ సంబంధించిన ఫిర్యాధుల కోసం బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్ స్కీమ్ (బీఓఎస్‌) 1995 నుంచి పని చేస్తోంది. బ్యాంకింగ్-యేతర ఆర్థిక సంస్థ‌ల కోసం.. ద అంబుడ్స్‌మన్‌ స్కీమ్‌ ఫర్‌ నాన్‌-బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీస్‌ 2018 నుంచి, డిజిటల్ లావాదేవీల కోసం.. ద అంబుడ్స్‌మన్‌ స్కీమ్ ఫర్‌ డిజిటల్‌ ట్రాన్సాక్షన్స్‌ 2019 నుంచి ప‌నిచేస్తున్నాయి.

ప్ర‌స్తుతం ఈ మూడింటిని ‘ఒకే దేశం, ఒకే అంబుడ్స్‌మెన్‌’ వ్య‌వ‌స్థ‌గా ఏకీకృతం చేసి సేవ‌లు అందిస్తున్నారు. రూ.50 కోట్లు, అంతకంటే ఎక్కువ డిపాజిట్లున్న నాన్‌-షెడ్యూల్డ్‌ ప్రాథమిక సహకార బ్యాంకులూ ఈ వ్యవస్థ కిందకే వస్తాయి. వినియోగ‌దారుడు ఆర్థిక సంస్థ అంత‌ర్గ‌త ఫిర్యాదుల ప‌రిష్కార విధానంతో సంతృప్తి చెంద‌క‌పోతే అంబుడ్స్‌మెన్‌ను సంప్ర‌దించ‌వ‌చ్చు. అక్కడా పరిష్కారం కాకపోతే అప్పిలేట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ అప్పిలేట్‌లో ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌తో కూడిన బృందం ఉంటుంది.

ఫిర్యాదు ఎలా ఫైల్ చేయాలి?

ఫిర్యాదు నిర్వ‌హ‌ణ వ్య‌వ‌స్థ ‍ https://cms.rbi.org.in లో వినియోగ‌దారులు వారి ఫిర్యాదుల‌ను ఫైల్ చేయ‌వ‌చ్చు. చండీగ‌ఢ్‌లోని సెంట్ర‌లైజ్ రిసిప్ట్ అండ్ ప్రాసెసింగ్ సెంట‌ర్‌కి ఇమెయిల్ లేదా భౌతికంగా లేఖ‌ను పంప‌డం ద్వారా కూడా ఫిర్యాదుల‌ను న‌మోదు చేయ‌వ‌చ్చు. 

ఇదీ చదవండి: అసలే వేసవికాలం.. కరెంట్‌ సరఫరా ప్రశ్నార్థకం!

అంతేకాకుండా టోల్ ఫ్రీ నెంబ‌రు - 14448 ద్వారా కాల్ సెంట‌ర్‌కు కాల్ చేసి హిందీ, ఇంగ్లీష్‌తో పాటు ఎనిమిది ప్రాంతీయ భాష‌ల‌లో ఫిర్యాదు చేయ‌వ‌చ్చు. ఇత‌ర భార‌తీయ భాష‌ల‌లో త్వ‌ర‌లోనే ఈ సేవ‌లు అందుబాటులో తీసుకురానున్న‌ట్లు ఆర్‌బీఐ గతంలో తెలిపింది.
 

 
Advertisement
 
Advertisement