సహకార బ్యాంకింగ్‌ ‘విలీనాల్లో’ ముందడుగు

RBI issues guidelines for merging district central co-op banks with state ones - Sakshi

ఆర్‌బీఐ మార్గదర్శకాలు జారీ

రాష్ట్ర సహకార బ్యాంకుతో డీసీసీబీల విలీనాలకు రాష్ట్ర ప్రతిపాదన తప్పనిసరి

నాబార్డ్‌ సిఫారసులతో తుది నిర్ణయం

ముంబై: వివిధ షరతులకు లోబడి రాష్ట్ర సహకార బ్యాంకుతో (ఎస్‌టీసీబీ) జిల్లా సహకార కేంద్ర  బ్యాంకుల (డీసీసీబీ) విలీనాలను పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుందని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) సోమవారం స్పష్టం చేసింది. ఇలాంటి ప్రతిపాదన సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం నుంచి తప్పనిసరిగా రావాలన్నది ఈ షరతుల్లో ఒకటి. ఎస్‌టీసీబీ, డీసీసీబీల విలీనానికి ఉద్దేశించిన బ్యాంకింగ్‌ రెగ్యులేషన్‌ (సవరణ) చట్టం, 2020 గత నెల (ఏప్రిల్‌) 1వ తేదీ నుంచీ అమల్లోకి వచ్చే విధంగా నోటిఫై అయిన సంగతి తెలిసిందే.   

విలీన నేపథ్యం...
సహకార బ్యాంకులు ప్రధానంగా మూడు అంచెల్లో పనిచేస్తాయి. ఇందులో గ్రామ స్థాయిలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం. జిల్లా స్థాయిలో సహకార కేంద్ర బ్యాంక్‌ పనిచేస్తుంది (దీని తరఫున మండల కేంద్రాల్లో బ్రాంచీలు పనిచేస్తాయి) మూడవ స్థాయి రాష్ట్ర సహకార బ్యాంక్‌. రైతుకు వడ్డీ భారం తగ్గించాలన్న ప్రధాన ధ్యేయంగా  రాష్ట్ర స్థాయి సహకార బ్యాంకులో జిల్లా స్థాయి సహకార బ్యాంకుల విలీన నిర్ణయం జరిగింది. తద్వారా రెండంచెల సహకార బ్యాంక్‌ వ్యవస్థకు మార్గం సుగమం అయ్యింది. బ్యాంకింగ్‌ రెగ్యులేషన్‌ (సవరణ) చట్టం, 2020 ప్రకారం ఇందుకు రాష్ట్రాలు తప్పనిసరిగా ఆర్‌బీఐని సంప్రదించాలి. రెండంచెల సహకార వ్యవస్థకు (షార్ట్‌–టర్మ్‌ కో–ఆపరేటివ్‌ క్రెడిట్‌ స్ట్రక్చర్‌) పలు రాష్ట్రాలు ఆర్‌బీఐని సంప్రదిస్తున్న నేపథ్యంలో సెంట్రల్‌ బ్యాంక్‌ తాజా  మార్గదర్శకాలను జారీ చేసింది.

నిబంధనల్లో ముఖ్యాంశాలు
► రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతిపాదనను ఆర్‌బీఐ పరిశీలనలోకి తీసుకుని ‘న్యాయ, ద్రవ్యపరమైన అంశాలపై’ సమగ్ర అధ్యయనం అనంతరం ఇందుకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకుంటుంది.  
► అదనపు మూలధనం సమకూర్చడం, అవసరమైతే ద్రవ్య పరమైన మద్దతు, లాభదాయకతతో కూడిన వ్యాపార నమూనా, పాలనా పరమైన నమూనా వంటి అంశాలు విలీన అంశ పరిశీలనలో ప్రధానంగా ఉంటాయి.  
► విలీన పథకానికి మెజారిటీ వాటాదారుల మద్దతు అవసరం.  
► రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి జాతీయ బ్యాంక్‌ (నాబార్డ్‌) కూడా పరిశీలించి, తగిన సిఫారసులు చేస్తుంది. నాబార్డ్‌తో తగిన సంప్రదింపుల అనంతరం ఆర్‌బీఐ ఇందుకు సంబంధించి నిర్ణయం తీసుకుంటుంది.  
► విలీనానికి సంబంధించి నికర విలువ ఆధారంగా షేర్ల మార్పిడి రేషియో విషయంలో కొన్ని డీసీసీబీ షేర్‌హోల్డర్లకు ఎటువంటి షేర్లనూ కేటాయించలేని పరిస్థితి ఉంటే, అటువంటి డీసీసీబీలకు ప్రభుత్వం తగిన మూలధనం సమకూర్చాలి. తద్వారా షేర్‌హోల్డర్లకు కనీసం ఒక షేర్‌ చొప్పున కేటాయింపు జరగాలి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top