హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కు ఆర్‌బీఐ షాక్‌

RBI halts HDFC Bank to issue new credit cards, digital launches - Sakshi

డిజిటల్‌, క్రెడిట్‌ కార్డుల జారీకి తాత్కాలికంగా చెక్‌

ఆన్‌లైన్‌ సర్వీసులలో అంతరాయాలపై ఆర్‌బీఐ సీరియస్

‌ గత రెండేళ్లలో మూడుసార్లు కస్టమర్లకు ఆన్‌లైన్‌ సమస్యలు

ముంబై, సాక్షి: ప్రయివేట్‌ రంగ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కు తాజాగా రిజర్వ్‌ బ్యాంక్‌ షాకిచ్చింది. ఆన్‌లైన్‌ సర్వీసులలో అంతరాయాల నేపథ్యంలో డిజిటల్‌, క్రెడిట్‌ కార్డుల జారీని తాత్కాలికంగా నిలిపివేయమంటూ ఆదేశించింది. గత రెండేళ్లలో మూడుసార్లు ఆన్‌లైన్‌ సేవలకు అంతరాయం ఏర్పడిన నేపథ్యంలో సమస్యకు తొలుత పరిష్కారాన్ని వెదకమంటూ ఆదేశించినట్లు వార్తలు వెలువడ్డాయి.  డిజిటల్‌-2లో భాగంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ప్రవేశపెట్టనున్న అన్ని డిజిటల్‌ సంబంధ కార్యక్రమాలనూ తాత్కాలికంగా నిలిపివేయవలసిందిగా ఆర్‌బీఐ ఆంక్షలు విధించింది. వీటిలో భాగంగా కొత్తగా క్రెడిట్‌ కార్డుల జారీని సైతం నిలిపివేయవలసి ఉంటుందని బ్యాంకింగ్‌ వర్గాలు తెలియజేశాయి. 

సర్వీసులకు ఇబ్బంది లేదు
నిబంధనలకు అనుగుణంగా లోపాలను సవరించిన వెంటనే ఆర్‌బీఐ విధించిన తాజా ఆంక్షలను ఎత్తి వేయనున్నట్లు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఈ సందర్భంగా పేర్కొంది. ప్రస్తుతం ఆర్‌బీఐ జారీ చేసిన ఆదేశాలు బ్యాంకు రోజువారీ కార్యకలాపాలపై ఎలాంటి ప్రభావమూ చూపవని తెలియజేసింది. ప్రస్తుత కస్టమర్లకు అన్ని సేవలూ యథావిధిగా అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. ప్రైమరీ డేటా సెంటర్‌లో విద్యుత్‌ ప్రసారంలో వైఫల్యాలు సర్వీసులలో అంతరాయాలకు కారణమైనట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. 

గత నెల 21న..
ఇటీవల గత నెల 21న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ డిజిటల్‌, ఆన్‌లైన్‌‌ సేవలకు మరోసారి అంతరాయం ఏర్పడటంతో ఆర్‌బీఐ వివరాలు దాఖలు చేయమంటూ ఆదేశించింది. గతేడాది డిసెంబర్‌లో తలెత్తిన అంతరాయం కారణంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కస్టమర్లు తొలిసారి రెండు రోజులపాటు మొబైల్‌ బ్యాంకింగ్‌, నెట్‌ బ్యాంకింగ్‌ సేవలను పొందలేకపోయారు. గత రెండేళ్లుగా ఐటీ వ్యవస్థల పటిష్టానికి పలు చర్యలు తీసుకున్నట్లు ఈ సందర్భంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ తెలియజేసింది. కాగా..ప్రస్తుత క్రెడిట్‌ కార్డుల వినియోగదారుల సేవలు, డిజిటల్‌ బ్యాంకింగ్ తదితర సర్వీసులు యథావిధిగా కొనసాగుతాయని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు వివరించింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు దేశవ్యాప్తంగా 15,292 ఏటీఎంలున్నాయి. 14.9 మిలియన్‌ క్రెడిట్‌ కార్డులు, 33.8 మిలియన్‌ డెబిట్‌ కార్డులను కస్టమర్లకు బ్యాంక్‌ జారీ చేసింది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top