అంతా అబద్ధం.. ఏవీ నమ్మొద్దు! | RBI Gold Sale Rumors Exposed Govt Confirms Reserves Rising Not Falling | Sakshi
Sakshi News home page

అంతా అబద్ధం.. ఏవీ నమ్మొద్దు!

Jun 3 2026 3:01 PM | Updated on Jun 3 2026 3:04 PM

RBI Gold Sale Rumors Exposed Govt Confirms Reserves Rising Not Falling

అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి మారకం విలువ పతనాన్ని అడ్డుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) సుమారు 12 బిలియన్ డాలర్ల విలువైన బంగారాన్ని విక్రయించిందంటూ ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ బ్లూమ్‌బెర్గ్ ప్రచురించిన కథనాన్ని భారత ప్రభుత్వం ఖండించింది. ఈ ప్రచారం నకిలీదని (ఫేక్ న్యూస్) స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వ అధికారిక సమాచార సంస్థ ‘పీఐబీ ఫ్యాక్ట్ చెక్’ ఈ వ్యవహారంపై స్పందిస్తూ ఎక్స్ వేదికగా వాస్తవాలను వెల్లడించింది. బంగారం భౌతిక నిల్వలపై ఆర్‌బీఐ విడుదల చేసిన తాజా బులెటిన్‌ను పరిశీలించాలని ప్రజలను కోరింది.

పెరిగిన బంగారం నిల్వలు

బ్లూమ్‌బెర్గ్ ఎకనామిక్స్ సీనియర్ ఆర్థికవేత్త అభిషేక్ గుప్తా అంచనా ప్రకారం.. మే 22తో ముగిసిన రెండు వారాల్లో రూపాయిని కాపాడేందుకు ఆర్‌బీఐ 12 బిలియన్ డాలర్ల బంగారాన్ని విక్రయించి ఉండవచ్చని పేర్కొన్నారు. అయితే ఈ వాదన పూర్తిగా తప్పని ఆర్‌బీఐ గణాంకాలు రుజువు చేస్తున్నాయి.

భారత విదేశీ మారక నిల్వల్లో బంగారం వాటా వివరాలు

  • సెప్టెంబర్ 2025 చివరి నాటికి: 13.92%

  • మార్చి 31, 2026 నాటికి: 16.70%

  • మే 22, 2026 నాటికి: 16.85%

గణాంకాలను పరిశీలిస్తే విదేశీ మారక నిల్వలలో బంగారం వాటా నిరంతరం పెరుగుతూనే ఉంది తప్ప తగ్గలేదని స్పష్టమవుతోంది. ఆర్‌బీఐ తన నెలవారీ బులెటిన్‌లో భౌతిక బంగారం నిల్వల స్థితిని స్పష్టంగా పొందుపరిచిందని, తాజా ఎడిషన్ ఆర్‌బీఐ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉందని కేంద్ర ఫ్యాక్ట్ చెకింగ్ ఏజెన్సీ తెలిపింది. ఇలాంటి తప్పుడు వార్తలను నమ్మవద్దని, ప్రామాణిక సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్‌ను మాత్రమే సంప్రదించాలని సూచించింది.

‘రూపాయి విలువ తగ్గినా నష్టం లేదు’

మరోవైపు, రూపాయి మారకం విలువపై 16వ ఆర్థిక సంఘం చైర్మన్, నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మన్ అరవింద్ పనగారియా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఒక సంవత్సరం ఫార్వర్డ్ మార్కెట్లో రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే 100 మార్కును తాకే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయన స్పందించారు. ఈ తరుణంలో రూపాయి విలువ క్షీణించడానికి ఆర్బీఐ అనుమతించాలని, కేవలం 100 అనే అంకెను చూసి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయంగా చమురు కొరత స్వల్పకాలికమైనా, దీర్ఘకాలికమైనా.. రూపాయి విలువ సహజంగా క్షీణించడమే ప్రస్తుతానికి సరైన ప్రతిస్పందనేనన్నారు.

ఇదీ చదవండి: ఏఐ సామ్రాజ్యంపై భారత్‌కు హక్కు దక్కేనా?

Advertisement
 
Advertisement
Advertisement