గోల్డ్‌ లోన్‌.. కష్టాలు! | RBI Gold Loan Rules Create Trouble For Borrowers | Sakshi
Sakshi News home page

గోల్డ్‌ లోన్‌.. కష్టాలు!

Jun 9 2026 1:15 PM | Updated on Jun 9 2026 1:26 PM

RBI Gold Loan Rules Create Trouble For Borrowers

సాధారణ, మధ్య తరగతి కుటుంబీకులకు బంగారమంటే కేవలం అలంకరణే కాదు.. ఆపద నుంచి గట్టెక్కించేది కూడా. వ్యక్తిగత, వ్యాపార, తదితర స్వల్పకాలిక, దీర్ఘకాలిక అవసరాల్లో తక్షణమే పొందగలిగేది పసిడి రుణం మాత్రమే. మొన్నటి వరకు బ్యాంకుల్లో చాలా సులభంగా పొందే గోల్డ్‌ లోన్‌ ప్రస్తుతం కఠినతరంగా మారింది. ఆర్‌బీఐ తాజాగా తీసుకొచ్చిన నిబంధనల కారణంగా బ్యాంకుల్లో బంగారు రుణాలు తీసుకున్న వారు కొత్త నిబంధనలతో దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటున్నారు. 

‘ప్రైవేటు’ను ఆశ్రయిస్తూ..
రుణాలను అసలు, వడ్డీ చెల్లిస్తేనే రెన్యూవల్‌ చేస్తామని బ్యాంకర్లు చెబుతుండడంతో కొందరు రుణ గ్రహీతలు రెన్యూవల్‌ కోసం నానా అవస్థలు పడుతున్నారు. రెన్యూవల్‌ కోసం రూ.లక్షలు అప్పులు పుట్టక.. చివరకు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. వీరు రెండు, మూడు రోజుల్లోనే రూ.2 చొప్పున వడ్డీ చెల్లిస్తేనే ఇస్తామని చెబుతున్నా.. చేసేదిలేక రుణగ్రస్తులు వడ్డీకి డబ్బులు తీసుకొచ్చి తీవ్రంగా నష్టపోతున్నారు.

నూతన నిబంధనలు ఇలా..

  • బంగారం రుణాలను అగ్రి లోన్స్, నాన్‌ అగ్రి లోన్స్‌ అంటూ రెండు భాగాలుగా విభజించారు. రూ.2.25 లక్షల రుణం తీసుకునే వారికి నిబంధనలు కాస్త సరళతరంగా ఉండగా.. అంతకు మించి అయితే రుణం పొందలేని పరిస్థితి ఉంది. 

  • వ్యవసాయదారుడు రుణం తీసుకోవాలంటే పట్టాదారు పాస్‌ పుస్తకంతో పాటు తహసీల్దార్‌ ధ్రువీకరించిన ఆదాయ సర్టిఫికెట్, భూమికి చెందిన 1బీ, పశువుల వివరాలు, వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకానికి సంబంధించిన రశీదులు సమర్పించాల్సి ఉంటుంది. 

  • ఇక నాన్‌ అగ్రి రుణం తీసుకునే వారికి ఐటీఆర్, సిబిల్, ఆదాయ ధ్రువీకరణ చేసుకున్నాకే రుణం మంజూరు చేస్తారు. 

  • గతంలో డిఫాల్టర్‌గా ఉండి సెటిల్మెంట్‌ చేసుకున్న వారికి బంగారంపై రుణాలు ఇవ్వబడవు. 

    ఆదాయాన్ని బట్టి ఒక్కరు మూడు నుంచి ఐదు రుణాలను మాత్రమే తీసుకోవడానికి అర్హులు. ఆదాయ వనరులు, ఆదాయం లేని వారు రుణం పొందడానికి అనర్హులు. 

    రెన్యూవల్లో మాత్రం నిబంధనలను సడలించింది. ఏడాదిలోపు రుణాన్ని రెన్యూవల్‌ చేసుకునే వారికి వడ్డీ మాత్రమే చెల్లించేలా వెసులుబాటు కల్పించింది. ఈ వెసులుబాటు కేవలం మూడు పర్యాయాలు మాత్రమే వర్తించనుంది. 

    అలాగే బంగారం రుణాల మంజూరు ప్రక్రియలో రుణగ్రహీత నిధులను ఎందుకోసం ఖర్చు చేయనున్నారనే విషయంపై ఆరా తీయాలని బ్యాంకులకు ఆర్బీఐ ఆదేశించినట్లు సమాచార. 

    అంతేకాక రుణగ్రహీతల బ్యాక్‌గ్రౌండ్‌ చెక్‌ చేయాలని, తాకట్టు పెట్టిన బంగారం వాస్తవ హక్కుదారు ఎవరనేదీ తెలుసుకోవాలని నిర్దేశించినట్లు తెలిసింది. పసిడి రుణాల వ్యాపారంలో అనైతిక వ్యవహారాలకు చెక్‌ పెట్టడంతో పాటు ఆర్థిక వ్యవస్థ స్థిరత్వానికి భంగం కలగకుండా చూడటమే ఆర్బీఐ ఉద్దేశంగా ఉన్నట్లు తెలుస్తోంది.


భారీగా రుణాల చార్జీలు..
వివిధ బ్యాంకులు బంగారం రుణాల్లో భారీగా చార్జీలు పెంచింది. గతంలో రూ.3 లక్షల వరకు ఉచితంగా ఉండగా.. రూ.3 లక్షలు పైన నామినల్‌ చార్జీలు తీసుకునే వారు. అయితే ఇటీవల బంగారం రుణాలు తీసుకునే వారిపై చార్జీల మోత మోగిస్తోంది. ప్రతి రూ.లక్ష రుణానికి అప్రైజర్‌ చార్జితో పాటు సర్వీస్‌ చార్జి అంటూ సుమారు రూ.900 వరకు వసూలు చేస్తున్నారు. ఇలా రూ.5 లక్షల వరకు రుణానికి అయితే గోల్డ్‌ అప్రైజర్‌కు రూ. 590, ప్రాసెసింగ్‌ చార్జిలు రూ. 295లు వసూలు చేస్తుండగా.. రూ.5 లక్షల పైన రుణానికి అయితే గోల్డ్‌ అప్రైజర్‌కు రూ. 708, ప్రాసెసింగ్‌ చార్జిలు రూ. 590 లు వసూలు చేస్తున్నారు. కాగా, బ్యాంకుల వారీగా చార్జీలు ఉన్నాయి. ఇకనైనా బ్యాంకర్లు వడ్డీ మాత్రమే కట్టించుకుని రుణాలు రెన్యూవల్‌ చేయాలని రైతులు కోరుతున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement