పేటీఎంకు భారీ ఊరట..ఆంక్షలపై ఆర్‌బీఐ మరో కీలక ప్రకటన! | RBI Extends Timeline For Deposits, Credit Transactions Till March 15 - Sakshi
Sakshi News home page

పేటీఎంకు భారీ ఊరట..ఆంక్షలపై ఆర్‌బీఐ మరో కీలక ప్రకటన!

Published Fri, Feb 16 2024 6:47 PM

Rbi Extends Timeline For Deposits, Credit Transactions Till March 15 - Sakshi

ప్రముఖ ఫిన్‌ టెక్‌ దిగ్గజం పేటీఎం, ఆ సంస్థ అధినేత విజయ్‌ శేఖర్‌ శర్మకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) భారీ ఊరట ఇచ్చింది. 

ఇటీవల ఆర్‌బీఐ ‘పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌’ (PPBL) 2024 ఫిబ్రవరి 29 తరవాత నుంచి డిపాజిట్లను స్వీకరించకూడదని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 16న (ఇవాళ) ఆ గడువు తేదీని మార్చి 15, 2024కి పొడిగిస్తూ ఆర్‌బీఐ కీలక ప్రకటన చేసింది. మార్చి 15 తర్వాత నిబంధనలు అమల్లోకి వస్తాయని సెంట్రల్‌ బ్యాంక్‌ స్పష్టం చేసింది. 
  
వినియోగదారులు అధికారిక వెబ్‌సైట్‌లో అడిగిన ప్రశ్నలకు ఆర్‌బీఐ ఎప్పటికప్పుడు సమాధానాలిస్తుంది. పేటీఎంపై ఆంక్షలు విధించిన తరుణంలో యూజర్ల అనుమానాల్ని ఆర్‌బీఐ నివృత్తి చేసింది. అందులో పలువురు యూజర్లు అడిగిన ప్రశ్నలు ఇలా ఉన్నాయి. 

పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ జారీ చేసిన ఫాస్టాగ్‌ను వినియోగించొచ్చా? 
ఫాస్టాగ్‌లో ఉన్న మొత్తాన్ని మీరు టోల్ చెల్లించడానికి ఉపయోగించుకోవచ్చు. అయితే, మార్చి 15, 2024న పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ జారీ చేసిన ఫాస్టాగ్‌లకు ఇకపై ఫైనాన్సింగ్ లేదా టాప్ అప్‌లకు అర్హత పొందలేవు. ఫాస్టాగ్‌ ప్రొడక్ట్‌లో క్రెడిట్ బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్‌ ఫీచర్ అందుబాటులో లేదు. కాబట్టి, మీరు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ జారీ చేసిన మీ పాత ఫాస్టాగ్‌ను మూసివేసి, రీఫండ్ కోసం బ్యాంక్‌ని అభ్యర్థించాలి.

మార్చి 15, 2024 తర్వాత మీరు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ జారీ చేసిన మీ ఫాస్టాగ్‌ను రీఛార్జ్ చేయలేరు.ఈ ఇబ్బందుల నుంచి సురక్షితంగా ఉండేందుకు నిర్ధేశించిన గడువులోపు మరొక బ్యాంక్ జారీ చేసిన కొత్త ఫాస్టాగ్‌ పొందాలి అని ఆర్‌బీఐ సూచించింది.

పేటీఎం పేమెంట్‌ బ్యాంక్‌లో ఉన్న బ్యాలెన్స్‌ ఎలా? 
మీరు వాలెట్‌లో ఉన్న నగదును ఉపయోగించడం, విత్‌ డ్రాయిల్‌ లేదా,  బ్యాంక్ అకౌంట్‌కు బదిలీ చేయడం కొనసాగించవచ్చు.  మార్చి 15, 2024 తర్వాత మీ పేటీఎం పేమెంట్‌ బ్యాంక్‌ అకౌంట్‌ నుంచి డబ్బుల్ని ట్రాన్స్‌ఫర్‌ చేయలేరు. డిపాజిట్‌ చేయలేరు. అయితే, ఖాతాల్లో ఉన్న బ్యాలెన్స్ వరకు యూపీఐ/ ఐఎంపీఎస్‌ ద్వారా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఖాతా నుండి మీ డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు.

నేను పీపీబీఎల్‌ వాలెట్‌ని మూసివేసి, బ్యాలెన్స్‌ని మరొక బ్యాంక్‌లో నా బ్యాంక్ అకౌంట్‌కు బదిలీ చేయవచ్చా?
మీరు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌ని సంప్రదించాలి. లేదంటే దాని బ్యాంకింగ్ యాప్‌ని ఉపయోగించి మీ వాలెట్‌ని బ్లాక్‌ చేయొచ్చు. కేవైసీ వాలెట్ల విషయంలో బ్యాలెన్స్‌ని మరొక బ్యాంక్‌లో ఉపయోగించే అకౌంట్‌కు బదిలీ చేసుకోవచ్చు.  

Advertisement
 
Advertisement