
ముంబై: బోర్డులో ఎండీ, సీఈవోతోపాటు ఇద్దరు హోల్‌టైమ్ డైరెక్టర్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్ని ప్రైవేటు బ్యాంకులు, విదేశీ బ్యాంకుల సబ్సిడరీలను ఆర్‌బీఐ కోరింది. వారసత్వ బదిలీకి వీలుగా ఈ సూచన చేసింది. బ్యాంకింగ్ రంగంలో పెరుగుతున్న సంక్లిష్టతల నేపథ్యంలో ప్రస్తుత, భవిష్యత్తులో రాబోయే సవాళ్లను ఎదుర్కొనేందుకు వీలుగా సమర్థవంతమైన సీనియర్ మేనేజ్‌మెంట్ బృందం అవసరమని గుర్తు చేసింది.
‘‘ఇలాంటి సమర్థవంతమైన బృందాన్ని ఏర్పాటు చేయడం వల్ల నాయకత్వ బదిలీకి కూడా సాయపడుతుంది. ఎండీ, సీఈవోలకు సంబంధించి గరిష్ట వయసు నిబంధనల అమలుకు వీలు కల్పిస్తుంది’’అని ఆర్‌బీఐ తన తాజా ఆదేశాల్లో పేర్కొంది.
కార్యకలాపాల స్థాయి, వ్యాపారం, సంక్లిష్టతలు, ఇతర అంశాల ఆధారంగా బోర్డులో గరిష్టంగా ఎంత మంది హోల్‌టైమ్ డైరెక్టర్లు ఉండాలనే అంశాన్ని బ్యాంక్‌ల బోర్డులు నిర్ణయించుకోవచ్చని పేర్కొంది. హోల్‌టైమ్ డైరెక్టర్లకు సంబంధించి ప్రస్తుత బ్యాంక్ బోర్డులు కనీస అవసరాలకు అనుగుణంగా లేవంటూ.. ఇక్కడి నుంచి నాలుగు నెలల్లోగా హోల్‌టైమ్ డైరెక్టర్ల నియామకం విషయమై ప్రతిపాదనలను సమర్పించాలని కోరింది.