ఐపీవో.. స్ట్రీట్‌పబ్లిక్‌ ఇష్యూలకు పోటాపోటీ

Rainbow Children's Medicare files DRHP for Rs 2000 crore IPO - Sakshi

2 కంపెనీలకు సెబీ గ్రీన్‌సిగ్నల్‌

తాజాగా 3 సంస్థలు దరఖాస్తు

జాబితాలో రెయిన్‌బో చిల్డ్రన్స్‌ హాస్పిటల్‌ 

గ్లోబల్‌ హెల్త్, వీడా క్లినికల్‌ రీసెర్చ్‌

న్యూఢిల్లీ: ఏడాది కాలంగా సరికొత్త రికార్డులు నెలకొల్పుతున్న ప్రైమరీ మార్కెట్‌ ఇకపై మరింత కళకళలాడనుంది. తాజాగా పబ్లిక్‌ ఇష్యూలు చేపట్టేందుకు వీలుగా క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ రెండు కంపెనీలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఐపీవోల కోసం సెప్టెంబర్‌లో ఈ కంపెనీలు  దరఖాస్తు చేశాయి. ఈ బాటలో ప్రస్తుతం మరో మూడు సంస్థలు నిధుల సమీకరణకు అనుమతించమంటూ సెబీకి ప్రాథమిక ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేశాయి. ఐపీవో బాట పట్టిన సంస్థలలో హైదరాబాద్‌కు చెందిన రెయిన్‌బో చిల్డ్రన్స్‌ మెడికేర్‌ సైతం ఉంది. వివరాలు చూద్దాం..

గ్లోబల్‌ హెల్త్‌ రెడీ
మేడాంటా బ్రాండ్‌ ఆసుపత్రుల నిర్వాహక కంపెనీ గ్లోబల్‌ హెల్త్‌ పబ్లిక్‌ ఇష్యూకి రానుంది. ఇందుకు సెబీ ఓకే చెప్పింది. ఐపీవోలో భాగంగా కంపెనీ రూ. 500 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. దీనికి జతగా మరో 4.84 కోట్ల షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ప్రధానంగా పీఈ దిగ్గజం కార్లయిల్‌ గ్రూప్‌ 4.33 కోట్ల షేర్లను ఆఫర్‌ చేయనుంది. కంపెనీ సహవ్యవస్థాపకులు సునీల్‌ సచ్‌దేవ, సుమన్‌ సచ్‌దేవ 51 లక్షల ఈక్విటీ షేర్లను విక్రయించనున్నారు. తాజా ఈక్విటీ నిధులను రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వినియోగించనుంది.

వీడా క్లినికల్‌కు సై
క్లినికల్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ వీడా.. పబ్లిక్‌ ఇష్యూ చేపట్టేందుకు సెబీ తాజాగా గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో రూ. 832 కోట్లవరకూ సమకూర్చుకోవాలని కంపెనీ ఆశిస్తోంది. ఐపీవోలో భాగంగా వీడా క్లినికల్‌ రీసెర్చ్‌ ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు రూ. 500 కోట్ల విలువైన ఈక్విటీని విక్రయానికి ఉంచనున్నారు. అంతేకాకుండా దాదాపు మరో రూ. 332 కోట్ల విలువైన షేర్లను తాజాగా జారీ చేయనుంది. ప్రధానంగా బాండ్‌వే ఇన్వెస్ట్‌మెంట్‌ రూ. 260 కోట్లు, బసిల్‌ ప్రయివేట్‌ రూ. 142 కోట్ల విలువైన షేర్లను ఆఫర్‌ చేయనున్నాయి. తాజా ఈక్విటీ నిధులను రుణ చెల్లింపులు, విస్తరణకు వినియోగించనుంది.

రెయిన్‌బో చిల్డ్రన్స్‌
పబ్లిక్‌ ఇష్యూ చేపట్టేందుకు వీలుగా చిన్నపిల్లల మల్టీస్పెషాలిటీ ఆసుపత్రుల చైన్‌ రెయిన్‌బో సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. తద్వారా ఈ హైదరాబాద్‌ సంస్థ రూ. 2,000 కోట్లకుపైగా సమీకరించే ప్రణాళికలు వేసింది. ఐపీవోలో భాగంగా రెయిన్‌బో చిల్డ్రన్స్‌ మెడికేర్‌ లిమిటెడ్‌ రూ. 280 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 2.4 కోట్ల షేర్లను ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ఆర్హతగల ఉద్యోగులకు సైతం షేర్లను ఆఫర్‌ చేయనుంది. తాజా ఈక్విటీ నిధులను ఎన్‌సీడీల చెల్లింపులకు, కొత్త ఆసుపత్రుల ఏర్పాటు, మెడికల్‌ పరికరాల కొనుగోలుకి వెచ్చించనుంది. 1999లో యూకే ఫైనాన్స్‌ కంపెనీ సీడీసీ గ్రూప్‌ హైదరాబాద్‌లో 50 పడకల పిడియాట్రిక్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ను నెలకొల్పింది. తదుపరి దేశవ్యాప్తంగా 14 ఆసుపత్రులకు విస్తరించింది. 1500 పడకల సదుపాయాలతో హెల్త్‌కేర్‌ సేవలు అందిస్తోంది.  

వీనస్‌ పైప్స్‌ ట్యూబ్స్‌
స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ పైపులు, ట్యూబుల తయారీ కంపెనీ వీనస్‌ పైప్స్‌ అండ్‌ ట్యూబ్స్‌ ఐపీవో చేపట్టేందుకు సెబీకి దరఖాస్తు చేసింది. ఇష్యూలో భాగంగా కంపెనీ 50.74 లక్షల షేర్లను విక్రయానికి ఉంచనుంది. ఈ నిధులను సామర్థ్య విస్తరణతోపాటు.. సొంత అవసరాలకు వినియోగించే హాలో పైపుల తయారీ ప్రాజెక్టుకు వినియోగించనుంది. కంపెనీ వీనస్‌ బ్రాండుతో ప్రొడక్టులను దేశ, విదేశాలలో విక్రయిస్తోంది. కెమికల్స్, ఇంజినీరింగ్, ఫార్మాస్యూటికల్, పవర్, ఫుడ్‌ ప్రాసెసింగ్, ఆయిల్‌ అండ్‌ గ్యాస్, పేపర్‌ తదితర పలు రంగాలకు ప్రొడక్టులను అందిస్తోంది.

క్యాపిల్లరీ టెక్నాలజీస్‌
క్లౌడ్‌ దన్నుతో సాఫ్ట్‌వేర్‌నే సొల్యూషన్‌(శాస్‌)గా సేవలందించే క్యాపిల్లరీ టెక్నాలజీస్‌ పబ్లిక్‌ ఇష్యూ బాట పట్టింది. ఏఐ ఆధారిత సేవలందించే ఈ కంపెనీ ఇందుకు వీలుగా సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. తద్వారా రూ. 850 కోట్లు సమీకరించాలని ఆశిస్తోంది. ఇష్యూలో భాగంగా రూ. 200 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో రూ. 650 కోట్ల విలువైన షేర్లను క్యాపిల్లరీ టెక్నాలజీస్‌ ఇంటర్నేషనల్‌ విక్రయానికి ఉంచనుంది. వార్‌బర్గ్‌ పింకస్, సీక్వోయా క్యాపిటల్, క్వాల్‌కామ్‌ తదితరాలకు పెట్టుబడులున్నప్పటికీ వాటాలను ఆఫర్‌ చేయకపోవడం గమనార్హం! ఇష్యూ నిధులను రుణ చెల్లింపులు, ప్రొడక్ట్‌ డెవలప్‌మెంట్, టెక్నాలజీ అభివృద్ధి, ఇతర సంస్థల కొనుగోళ్లు తదితరాలకు వినియోగించనుంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top