
భారత ఎగుమతులపై అమెరికా విధించిన భారీ సుంకాలు బాధాకరమని, ఏ ఒక్క వాణిజ్య భాగస్వామిపైనా ఎక్కువగా ఆధారపడకూడదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ తెలిపారు. భారత్‌కు ఇదో స్పష్టమైన మేల్కొలుపు అని హెచ్చరించారు. భారత వస్తువులపై యూఎస్ 50 శాతం సుంకాలు నిన్నటి నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో రాజన్ మాట్లాడారు.
వాణిజ్య సంబంధాలకు ఎదురుదెబ్బ
‘ప్రతీకార సుంకాలు విధిస్తూ ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం భారత్-అమెరికా వాణిజ్య సంబంధాలను దెబ్బతీసింది. భారతదేశం కఠినమైన ఆర్థిక శిక్షలను ఎదుర్కొన్నప్పటికీ చైనా, యూరప్ వంటి రష్యా ఇంధనాన్ని భారీగా దిగుమతి చేసుకునే దేశాలపై యూఎస్ ఇలాంటి విధానాన్ని అనుసరించలేదు. ఇది యూఎస్ విదేశీ వాణిజ్య విధానంలో ద్వంద్వ ప్రమాణాల ఆరోపణలను రేకెత్తిస్తోంది. అమెరికా భౌగోళిక రాజకీయం, వాణిజ్యం, పెట్టుబడులు, ఫైనాన్స్ అన్నీ ఆయుధంగా మలుచుకుంటోంది’ అన్నారు.
రష్యా చమురు విధానం
‘భారత్ తన రష్యా ముడిచమురు దిగుమతులను కొనసాగించాలి. వాస్తవంగా ఎవరికి లాభం, ఎవరికి నష్టం జరుగుతుందో స్పష్టంగా తెలియజేయాలి. రిఫైనరీలు అధిక లాభాలను ఆర్జిస్తున్నప్పటికీ ఎగుమతిదారులు పెరిగిన టారిఫ్ ధరలు చెల్లించాల్సిందే. అందులో ప్రయోజనం పెద్దగా లేకపోతే ఈ కొనుగోళ్లను కొనసాగించాలా వద్దా అనేది ఆలోచించాలి’ అన్నారు. ఉక్రెయిన్ యుద్ధానికి పరోక్షంగా మద్దతు ఇస్తూ రష్యా చమురు నుంచి భారత్ లాభపడుతోందని యూఎస్ వాణిజ్య సలహాదారు పీటర్ నవరో సహా అమెరికా అధికారులు ఆరోపించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రత్యామ్నాయాలు అవసరం..
‘అమెరికా, చైనా సహా ఏదైనా ఒక దేశంపై భారత్ అతిగా ఆధారపడకూడదు. చైనా, జపాన్, అమెరికా లేదా ఎవరితోనైనా కలిసి పనిచేయాలి కానీ, వాటిపై పూర్తిగా ఆధారపడకూడదు. ప్రత్యామ్నాయాలు ఉండేలా చూసుకోవాలి. సులభతర వాణిజ్యాన్ని మెరుగుపరచడానికి నిర్మాణాత్మక సంస్కరణలను వేగవంతం చేయాలి. ప్రపంచ సరఫరా గొలుసులకు అనుగుణంగా దేశీయ పోటీతత్వాన్ని పెంచాలి. ఆచరణాత్మకంగా ఉన్న విభాగాల్లో స్వావలంబన సాధించాలి’ అని రాజన్ అన్నారు.
ఇదీ చదవండి: పిల్లల ఆధార్ అప్‌డేట్.. యూఐడీఏఐ లేఖ