క్రెడిట్‌ కార్డును ఉపయోగించి ఏటీఎంలలో డబ్బులు డ్రా చేయొచ్చా?

Pros And Cons Of Withdrawing Cash Using A Credit Card - Sakshi

ఇటీవల కాలంలో డిజిటల్ చెల్లింపులు వేగంగా వృద్ధి చెందుతున్నాయి. అయినప్పటికీ కొన్ని సందర్భాలలో ఈ డిజిటల్‌ చెల్లింపుల కంటే లిక్విడ్‌ క్యాష్‌తో మన అవసరాల్ని తీర్చుకోవాల్సి ఉంటుంది. ఆ సమయంలో డెబిట్‌ కార్డుతో డబ్బుల్ని డ్రా చేస్తుంటాం. మరి క్రెడిట్‌ కార్డుతో ఏటీఎం నుంచి డబ్బుల్ని డ్రా చేసుకునే సదుపాయం ఉంది కదా. డబ్బుల్ని డ్రా చేయొచ్చా? డ్రా చేస్తే ఏమవుతుంది? ఆర్ధిక నిపుణులు ఏం చెబుతున్నారు. 

ఏటీఎంలో డెబిట్‌ కార్డును ఎలా ఉపయోగిస్తామో.. క్రెడిట్‌ కార్డును కూడా అలాగే వినియోగించుకోవచ్చు. అయితే, క్రెడిట్ కార్డుల విషయంలో ఏటీఎం నుంచి డబ్బుల్ని డ్రా చేసుకుంటే కొన్ని అదనపు ఛార్జీలు బ్యాంకులకు కట్టాల్సి ఉంటుంది. వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఆర్ధికంగా అంత మంచి పద్దతి కాదని ఆర్ధిక వేత్తలు హెచ్చరిస్తున్నారు. 

సర్వీస్‌ ఛార్జ్‌   
మీరు మీ క్రెడిట్ కార్డ్‌తో ఏటీఎం నుండి నగదును విత్‌డ్రా చేస్తే.. సదరు విత్‌ డ్రాల్‌ పై సర్వీస్‌ ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. ఈ రుసుము సాధారణంగా మీరు ఏటీఎం నుంచి డ్రా చేసిన నగదు పై చెల్లించాలి. మొత్తంగా ఆ అదనపు ఛార్జీలు 2.5% నుండి 3% వరకు ఉంటాయి. ఈ ఛార్జీలు మీ నెక్ట్స్‌ క్రెడిట్‌ కార్డు బిల్‌ జనరేట్‌ స్టేట్మెంట్‌లో యాడ్‌ అవుతాయి. 

వడ్డీ 
సాధారణంగా డెబిట్‌ కార్డుతో నెలకు 5 సార్లు ఉచితంగా డబ్బుల్ని డ్రా చేసుకోవచ్చు. కానీ క్రెడిట్‌తో అలా కాదు. బ్యాంకులు అందించే క్రెడిట్‌ కార్డుతో ఏటీఎం సెంటర్‌లలో డబ్బులు డ్రా చేస్తే భారీగా వడ్డీ చెల్లించాలి. ఆ వడ్డీ రేట్లు క్రెడిట్‌ కార్డుతో డబ్బులు డ్రా చేసిన నెంబర్‌ను బట్టి ఉంటుంది. ఉదాహరణకు ప్రారంభ వడ్డీ నెలకు 3.5% వరకు ఉండవచ్చు.  

సిబిల్‌ స్కోర్‌ తగ్గుతుందా?
క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి డబ్బుల్ని డ్రా చేసుకుంటే ఆ ప్రభావం నేరుగా క్రెడిట్‌ కార్డు స్కోర్‌పై ప్రభావితం చూపదు. అయినప్పటికీ, అధిక ఛార్జీల కారణంగా మీరు కనీస బకాయిని చెల్లించడంలో విఫలం కావచ్చు. మీ క్రెడిట్ కార్డ్ వినియోగం పెరుగుతుంది. ఇది మీ క్రెడిట్ స్కోర్‌ను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది.

ప్రయోజనాలు, డీల్స్
రెస్టారెంట్‌లు, దుకాణాలలో చెల్లించడానికి మీ క్రెడిట్ కార్డ్‌ని స్వైప్ చేసినప్పుడు, బ్యాంకులు మీకు ప్రత్యేక ఆఫర్లు అందిస్తుంటాయి. కానీ, మీరు నగదు ఉపసంహరించుకోవడానికి మీ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించినప్పుడు ఈ అదనపు ప్రయోజనాల్ని పొందలేం. కాబట్టి అత్యవసర పరిస్థితుల్లో తప్పా క్రెడిట్‌ కార్డును ఉపయోగించి ఏటీఎం సెంటర్లలో డబ్బులు డ్రా చేయొద్దని ఆర్ధిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top