రెండు హోటల్స్ నుంచి ఏడు దేశాలకు.. వేల కోట్ల సామ్రాజ్యాన్ని సృష్టించిన ఒబెరాయ్‌

Prithvi Raj Singh Oberoi Success Journey - Sakshi

ప్రపంచ వ్యాపార రంగంలో తనదైన ముద్ర వేసిన భారతీయ దిగ్గజం, ఒబెరాయ్ గ్రూప్ చైర్మన్ 'పృథ్వీ రాజ్ సింగ్ ఒబెరాయ్' (Prithvi Raj Singh Oberoi) ఈ రోజు కన్నుమూశారు. 1939లో సిమ్లాలో మొదలైన ఒబెరాయ్ హోటల్స్ ప్రస్థానం ప్రస్తుతం ఏడు దేశాలకు విస్తరించింది. దీని వెనుక ఒబెరాయ్ కృషి ఏమిటి, ఆయన సంపద ఎంత అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

ఈస్ట్ ఇండియా హోటల్స్ బాధ్యతలు
1929లో జన్మించిన 'ఒబెరాయ్' పాఠశాల విద్యను డార్జిలింగ్‌లోని సెయింట్ పాల్స్ స్కూల్‌లో పూర్తి చేశారు. ఆ తరువాత అమెరికా, స్విట్జర్లాండ్‌ దేశాల్లో ఉన్నత చదువుకులు చదువుకున్నాడు. తన తండ్రి 'మోహన్ సింగ్ ఒబెరాయ్' మరణం తరువాత 'ఈస్ట్ ఇండియా హోటల్స్' (East India Hotels) బాధ్యతలను స్వీకరించారు. ఆ తరువాత దీనిని ప్రపంచ దేశాలకు విస్తరించడం మొదలుపెట్టారు.

ఒక్క ఆలోచన
నిజానికి పర్యాటకులు ఒక దేశాన్ని సందర్శిస్తున్నారంటే.. వారికి బస చేసుకోవడానికి తప్పకుండా అనువైన హోటల్స్ కావాలి. ఈ విషయాన్ని గ్రహించిన 'ఒబెరాయ్' లగ్జరీ హోటల్స్ ప్రారంభించారు. 1939లో సిమ్లాలో ఒబేరాయ్ హోటళ్ల ప్రస్థానం మొదలైంది. ఇప్పుడు ఏడు దేశాల్లో హాస్పిటాలిటీ రంగంలో (ఆతిధ్య రంగం) తిరుగులేని వ్యక్తిగా వేల కోట్ల సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసాడు.

రెండు హోటళ్లతో ప్రారంభమై
తొమ్మిది దశాబ్దాల చరిత్ర కలిగిన ఒబెరాయ్ గ్రూప్‌ 1934లో కేవలం రెండు హోటళ్లతో ప్రారంభమైంది. మన దేశంలో మొదటి ఫైవ్ స్టార్ హోటల్ ప్రారంభించిన ఘనత ఒబెరాయ్ గ్రూప్‌దే కావడం విశేషం. ఈ ఘనత పీఆర్ఎస్ ఒబేరాయ్ సొంతమే. 

పీఆర్ఎస్ ఒబెరాయ్ 2013 వరకు ఈఐహెచ్ సీఈఓగా బాధ్యతలు చేపట్టి హాస్పిటాలిటీ రంగంలో దినదినాభివృద్ధి చెందాడు. అంతర్జాతీయ హాస్పిటాలిటీ రంగంలో గుర్తింపు పొందిన పీఆర్ఎస్ ఒబెరాయ్ గత ఏడాది మే 03న ఈఐహెచ్ డైరెక్టర్ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ప్రస్తుతం పీఆర్ఎస్ ఒబేరాయ్ కొడుకు 'విక్రమ్ ఒబెరాయ్' ఈఐహెచ్ బాధ్యతలు స్వీకరించారు.

మొత్తం సంపద (నెట్‍వర్త్)
బికీగా ప్రసిద్ధి చెందిన పీఆర్ఎస్ ఒబెరాయ్ సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 2008లో దేశ రెండవ అత్యున్నత పౌరపురస్కారమైన 'పద్మవిభూషణ్‌'తో గౌరవించింది. ఫోర్బ్స్ ప్రకారం పీఆర్ఎస్ ఒబెరాయ్ సంపద రూ. 3829 కోట్లు అని సమాచారం.

ఇదీ చదవండి: ఈ కారు కొనే డబ్బుతో ఫ్లైటే కొనేయొచ్చు - ధర తెలిస్తే అవాక్కవుతారు!

కేవలం భారతదేశంలో మాత్రమే కాకుండా.. ప్రపంచంలోని ఇతర దేశాల్లో కూడా విస్తరించిన ఒబెరాయ్ హోటల్స్ ఇప్పుడు మరిన్ని ప్రాంతాల్లో ఏర్పాటుకు సిద్ధమవుతున్నాయి. ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి, జమ్మలమడుగు, విశాఖపట్టణ ప్రాంతాల్లో ఒబెరాయ్ హోటల్స్ కోసం శంకుస్థాపన చేశారు. ఇవన్నీ త్వరలోనే పూర్తయ్యే అవకాశం ఉంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top